ఈ 3 రకాల ఆహారాలు కలిపి తినొచ్చా.. తింటే ఏమవుతుంది.. సైన్స్ ఏం చెబుతోందంటే ?

 ఈ 3 రకాల ఆహారాలు కలిపి తినొచ్చా.. తింటే ఏమవుతుంది.. సైన్స్ ఏం చెబుతోందంటే ?

కొన్ని ఆహార పదార్థాలను కలిపి తినకూడదనే నమ్మకాలు మనలో చాలా కాలంగా ఉన్నాయి. అయితే తినేటప్పుడు లేదా తిన్నాక కొన్ని ఆహార పదార్ధాలు వెంటనే తినకూడదు అని చెబుతుంటారు. అయితే ఈ ఆహార పదార్థాలు మన శరీరానికి ఏ విధంగా హాని చేస్తాయి... వీటిని కలిపి తినడం వల్ల మన జీర్ణక్రియలో ఎం జరుగుతుందో  వైద్య నిపుణులు వివరిస్తూ సూచిస్తున్నారు... 

1. పాలు, పుల్లని (సిట్రస్) పండ్లు 
చాలామంది పాలు తాగినప్పుడు లేదా పాలతో పాటు నిమ్మ, నారింజ వంటి పుల్లని పండ్లు తీసుకోకూడదు అని అంటారు. అయితే పుల్లని పండ్లలో ఉండే ఆమ్లాలు  పాలతో కలిస్తే పాలు విరిగిపోతాయి. అయితే, మన కడుపులో ఉండే జీర్ణరసాలు కూడా చాలా శక్తివంతమైన ఆమ్లాలే. కాబట్టి మనం పాలు తాగగానే అవి కడుపులో సహజంగానే విరిగి జీర్ణమవుతాయి. మీకు ఇప్పటికే గ్యాస్, ఎసిడిటీ లేదా పాలు పడకపోవడం వంటి సమస్యలు ఉంటే, ఈ రెండింటినీ కలిపి తీసుకున్నప్పుడు కడుపు ఉబ్బరంగా లేదా భారంగా అనిపించవచ్చు. అలాంటి వారు వీటిని విడివిడిగా తీసుకోవడం మంచిది.

2. వేడి చేసిన కొవ్వు పదార్ధాలు, తేనె
తేనెను వేడి చేయకూడదని, అలాగే నూనెతో కలపకూడదని కొందరు చెబుతుంటారు. తేనెను బాగా వేడి చేయడం వల్ల అందులో ఉండే మంచి ఎంజైమ్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు నశించిపోతాయి. అలాగే, నూనెను మళ్ళి మళ్ళి  వేడి చేయడం  వల్ల అవి శరీరానికి హాని చేసే విధంగా మారుతాయి. తేనె, కొవ్వు పదార్థాలు కలిపి తిన్నంత మాత్రాన ఏదో రసాయన చర్య జరిగిపోతుందని భయపడక్కర్లేదు. కానీ, ఆహారం వండే పద్ధతి ముఖ్యం. నూనెలో బాగా వేయించిన పదార్థాల కంటే, తక్కువ నూనెతో వండిన ఆహారం ఆరోగ్యానికి మంచిది.

3. చేపలు, పాలు
చేపలు తిన్న తర్వాత పాలు తాగితే చర్మ వ్యాధులు వస్తాయని పాతకాలం నుండి ఒక నమ్మకం ఉంది. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రపంచంలో చాలా చోట్ల చేపలు, మీగడ లేదా పాలను కలిపి వండుతుంటారు. కొంతమందికి సముద్రపు ఆహారం అంటే సీఫుడ్  పడదు. మరికొందరికి పాల పదార్థాలు పడవు. ఇలాంటి అలర్జీ ఉన్నవారు వీటిని కలిపి తీసుకున్నప్పుడు జీర్ణక్రియ కష్టం ఆవ్వచ్చు లేదా చర్మంపై దద్దుర్లు రావచ్చు. అంతేకానీ, అందరికీ ఈ విధంగా వర్తించదు.