నిజమాబాద్ జిల్లాలో ఘోరం జరిగిపోయింది. చెవి నొప్పితో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన యువకుడు మృతి చెందటం తీవ్ర విషాదాన్ని నింపింది. చేతికొచ్చిన కొడుకు అర్ధంతరంగా చనిపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో హాస్పిటల్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
వివరాల్లోకి వెళ్తే.. భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన గంగం అజయ్ మంగళవారం (ఫిబ్రవరి 24) చెవి నొప్పితో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అజయ్ కండిషన్ చూసిన వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ కోసం మత్తు మందు ఇచ్చిన తర్వాత అజయ్ చనిపోయాడు. దీంతో ఆస్పత్రి వైద్యులు, మత్తు వైద్యుల నిర్లక్ష్యం మూలంగా అజయ్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఆస్పత్రిలో వెంటిలేటర్, ఎలాంటి సౌకర్యాలు లేవు అంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. చేతికొచ్చిన కొడుకు చనిపోయాడని.. న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. హాస్పిటల్ ఎదుటనే అజయ్ మృతదేహాన్ని దహనం చేస్తామని డీజిల్ డబ్బాతో ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
►ALSO READ | యూట్యూబర్ కోమలి అందుకే సూసైడ్ చేసుకుంది: V6 తో రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న
వైద్యుల నిర్లక్ష్యంతో అజయ్ మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ సమయంలో ఎక్కువ మోతాదులో మత్తు మందు ఇవ్వటం వల్లనే అజయ్ మృతి చెందారని ఆందోళనకు దిగారు. ఆ క్రమంలో పోలీసులకు, కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
