సనత్‌‌నగర్‌‌ టిమ్స్‌‌కు మర్రి చెన్నారెడ్డి పేరు    

సనత్‌‌నగర్‌‌ టిమ్స్‌‌కు మర్రి చెన్నారెడ్డి పేరు    

 

  • టిమ్స్‌‌ ఇన్‌‌చార్జ్‌‌ డైరెక్టర్‌‌గాడాక్టర్ నరేంద్రకుమార్
  • కొత్త డీఎంఈగా డాక్టర్ ఎన్.వాణికి ప్రమోషన్
  • ఉత్తర్వులు జారీ చేసిన వైద్యారోగ్య శాఖ

హైదరాబాద్, వెలుగు: సనత్‌‌నగర్‌‌లోని తెలంగాణ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)కు మాజీ సీఎం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ఈ సూపర్‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌ను “డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సనత్‌‌నగర్‌‌” అని పిలవనున్నారు. ఈ మేరకు శుక్రవారం హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్. చొంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు.

టిమ్స్ ఇన్‌‌చార్జ్‌‌ డైరెక్టర్‌‌గా నరేంద్ర కుమార్..

సనత్‌‌నగర్‌‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఇన్‌‌చార్జ్‌‌ డైరెక్టర్‌‌గా డాక్టర్ ఎ.నరేంద్రకుమార్‌‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన వయోపరిమితి జులై 31తో ముగిసింది. నేటి నుంచి (ఆగస్టు 1) అమలులోకి వచ్చేలా తాత్కాలిక ప్రాతిపదికన టిమ్స్ ఇన్‌‌చార్జ్‌‌ డైరెక్టర్‌‌గా ఆయనను నియమించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు నరేంద్రకుమార్ ఈ పదవిలో కొనసాగుతారు.

కొత్త డీఎంఈగా డాక్టర్ వాణి..

డీఎంఈ ఎ.నరేంద్రకుమార్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో కొత్త డీఎంఈగా డాక్టర్ ఎన్.వాణిని నియమిస్తూ ప్రభుత్వం మరో జీవో విడుదల చేసింది. ప్రస్తుతం అడిషనల్ డీఎంఈగా సేవలందిస్తున్న డాక్టర్ వాణికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌‌గా తాత్కాలిక ప్రాతిపదికన ప్రమోషన్ కల్పిస్తూ పోస్టింగ్ ఇచ్చారు. డాక్టర్ వాణి ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్‌‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.