న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన– గ్రామీణ (పీఎంఏవై–జీ) పథకం కింద తెలంగాణకు పెద్ద సంఖ్యలో ఇండ్లను మంజూరు చేయాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఎంపీలు కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రితో ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడం నగేశ్, డీకే అరుణ, ఎం.రఘునందన్ రావు, ఈటల రాజేందర్ సమావేశమయ్యారు.
తెలంగాణలో గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పేదల ఇండ్ల కోసం సహకారం అందించాలని కోరారు. తెలంగాణలో నేటికీ పల్లెలకు సరైన రోడ్లు లేవని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. గిరిజన, ఆదివాసీ ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ మెరుగుపరచాలని, మండలాల నుంచి పల్లెలకు రోడ్ల విస్తరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు అనంతరం ఎంపీలు మీడియాకు వెల్లడించారు. మరోవైపు ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసి రాష్ట్రానికి 11.56 లక్షల ఇండ్లను మంజూరు చేయాలని కోరారు.
