- రైజింగ్‌లో లోయర్ గోదావరి.. సమ్మక్కసాగర్ దగ్గర 14.60 లక్షల క్యూసెక్కులు
- భద్రాచలం వద్ద నీటి మట్టం 51.20 అడుగులు
- 13.21 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
- ఎల్లంపల్లికి తగ్గిన వరద.. 44 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- కృష్ణాలో స్థిరంగా కొనసాగుతున్న ఇన్‌ఫ్లో.. జూరాలకు 1.22 లక్షల క్యూసెక్కులు
నెట్వర్క్, వెలుగు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్రలోని విదర్భ, మరఠ్వాడా, చత్తీస్‌గఢ్‌లలో భారీ వర్షాలు కురుస్తుండడంతో గంటగంటకూ వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎగువ గోదావరిలో ప్రవాహాలు తగ్గుతున్నా.. ప్రాణహిత, వార్ధా, ఇంద్రావతి నుంచి వరద పోటెత్తుతుండడంతో దిగువ గోదావరి రైజింగ్‌లో ఉంది. కాళేశ్వరం నుంచి కింద భద్రాచలం వరకు వరద పోటెత్తుతున్నది.
ప్రాణహిత, ఇంద్రావతిల నుంచే అధిక వరద ప్రవాహాలు నమోదవుతున్నాయి. గూడెం దగ్గర ప్రాణహిత నదిలో 6.88 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా.. పాతగూడెం వద్ద ఇంద్రావతి నుంచి 8.31 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నది. ఈ రెండింటి ప్రభావంతో సమ్మక్కసాగర్ వద్ద 14.60 లక్షల క్యూసెక్కులతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఇటు భద్రాచలం వద్ద 13,21,984 క్యూసెక్కుల వరద ప్రవాహం చేరగా.. ప్రవాహ ఎత్తు 51.20 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
వాస్తవానికి శుక్రవారం మధ్యాహ్నానికే భద్రాచలం వద్ద గోదావరి 43 మీటర్ల ఎత్తులో ప్రవహించగా.. సాయంత్రానికి భారీగా పెరిగిపోయింది. అయితే, ప్రస్తుతం ఇంద్రావతిలో ప్రవాహం తగ్గుతున్నా.. వార్ధా నుంచి పెరుగుతుండడంతో వరద ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, అదే సమయంలో మేడిగడ్డ బ్యారేజీ వద్ద 10.62 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు అన్ని గేట్లు ఎత్తిపెట్టి కిందికి వదిలేస్తున్నారు.
గోదావరి ఉధృతికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్థానిక వాగులు వెనక్కితన్నడంతో చాలా ఊళ్లకు రాకపోకలు నిలిచిపోయాయి. లెంకల గడ్డ వద్ద బండలవాగును గోదావరి ప్రవాహం కమ్మేయడంతో రోడ్డుపైకి వరద చేరి పలిమెల, మహదేవపూర్ మండలాలకు రాకపోకలు బంద్అయ్యాయి. బండలవాగు ఎగపోటు కారణంగా పలిమెల మండలంలోని ఏజెన్సీ గ్రామాల ప్రజలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నిలకడగా 62 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. ఎల్లంపల్లికి వరద ప్రవాహం తగ్గిపోయింది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు 44,700 క్యూసెక్కుల వరద వస్తున్నది.
భద్రాచలం వద్ద గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక
భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి శుక్రవారం ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఉదయం 10.14 గంటలకు 43 అడుగులకు చేరుకోగానే మొదటి ప్రమాదహెచ్చరిక, సాయంత్రం 4 గంటలకు 48 అడుగులకు పెరగ్గా రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తూ జిల్లా కలెక్టర్అంకిత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎగువన సమ్మక్క బ్యారేజీ నుంచి 14లక్షల క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేయడంతో వరద 51 అడుగులను దాటే సింది.
ఈఈ జానీ నేతృత్వంలో భద్రాచలంలో ఇంజనీర్లు కరకట్టపై ఉన్న స్లూయిజ్‌ల వద్ద భారీ మోటార్లను రెడీ చేశారు. స్లూయిజ్‌లు మూసివేయడంతో వర్షపు నీరు భద్రాచలం పట్టణంలోని నీటిని ఎత్తిపోసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫ్లడ్ మ్యానువల్ ప్రకారం ముంపు మండలాల్లో పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని సెక్టోరియల్ ఆఫీసర్లను కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఎస్పీ రోహిత్‌రాజ్‌తో కలిసి ఆయన భద్రాచలంలో పర్యటించారు.
వరద పరిస్థితిని సమీక్షించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాలను అన్ని మండలాలకు పంపించాలని సూచించారు. వరద భద్రాచలం పట్టణంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 13.21లక్షల క్యూసెక్కుల మేర దిగువకు వరద ప్రవహిస్తోంది. స్నానఘట్టాల వద్ద భక్తులుబట్టలు మార్చుకునే గదులు, కల్యాణకట్టలోకి వరద ప్రవేశించింది. దీంతో డీఎస్పీ అరుణ్‌కుమార్, సీఐ నాగరాజులు స్నానఘట్టాలపై ఉన్న చిరు దుకాణాలను తరలించారు. భక్తులను నది వద్దకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. గజ ఈతగాళ్లు మైకుల ద్వారా హెచ్చరికలు చేస్తున్నారు. పోలీసు పార్టీలను కట్టపై ఉంచి బందోబస్తు నిర్వహిస్తున్నారు.
నాటుబోట్లు, లాంచీ సిద్ధం చేశారు. చర్ల మండలం వీరాపురం ఇసుక ర్యాంపు వద్ద మిషన్ఆపరేటర్లు, కూలీలు నది మధ్యలో చిక్కుకోవడంతో సీఐ రాజు వర్మ, ఎస్సై నర్సిరెడ్డిలు వారిని తెప్పల ద్వారా సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. చర్ల-వెంకటాపురం మధ్య ఆలుబాకా వద్ద వరద రోడ్డుపైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం,కొత్తగూడెంలలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. వాగులు, నది వద్దకు ఎవరినీ అనుమతించొద్దని, సెల్ఫీలు, వీడియోలను నిషేధించినట్లు స్థానిక పోలీసులకు ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు. ఆఫీసర్లంతా సమన్వయంతో పనిచేయాలని కోరారు.
కృష్ణాలో నిలకడగా ప్రవాహం..
కృష్ణా నదిలో కూడా వరద ప్రవాహం స్టడీగా కొనసాగుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో మన ప్రాజెక్టులకు నీళ్లొస్తున్నాయి. ఆల్మట్టికి 82 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 1.11 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌కు 1.11 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోస్ ఉండగా 29 గేట్ల ద్వారా 1.18 లక్షల క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టుకు 1.22 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ నుంచి 1.37 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడు, భీమా-1, భీమా-2, రెండు కోయిల్ సాగర్ లెఫ్ట్ కెనాల్స్, ప్యారలల్ కెనాల్ కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల హైడల్ ప్రాజెక్టు దగ్గర విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. 35,502 క్యూసెక్కుల నీటిని ఉపయోగించుకుంటూ ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నట్లు జూరాల హైడల్ జెన్కో ఆఫీసర్లు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 89 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది.
పునరావాస కేంద్రాలకు తరలింపు..
ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామం వద్ద శుక్రవారం రాత్రి 8 గంటలకు గోదావరి వరద నీటి మట్టం 19.500 మీటర్లకు చేరుకుంది. దీంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వాజేడు మండల కేంద్రంలోని శివాలయం వీధి దూలపురం, కోయ వీరపురం,చంద్రుపట్ట, టేకుల గూడెం, బొమ్మనపెళ్లి, ఏడుచర్లపల్లి గ్రామాలకు, వెంకటాపురం మండలంలో చర్చి పేట, కుమ్మరిగూడెం, టేకులబోరు, ఉప్పేడు, వీరభద్రవరం గ్రామ శివారుదాకా వరద నీరు చేరింది.
వాజేడు మండలంలో పేరూరు ఆసుపత్రి పరిధిలో ఒక గర్భిణికి పురిటి నొప్పులు రాగా.. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది బోట్ సహాయంతో ఆమెను ఒడ్డుకు చేశారు. అక్కడి నుంచి 108 వెహికల్‌లో ఎటునాగారం ఆసుపత్రికి తరలించారు. మంగపేట మండలంలోని పొదుమూరు, కమలాపురం లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు ముందు జాగ్రత్తగా శుక్రవారం రాత్రి పునరావాస కేంద్రానికి తరలించారు. మండలంలోని కమలాపురంలో గుడ్డేలుగుపల్లి వీధికి ముంపు పొంచి ఉండడంతో వీరిని సైతం పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
