హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ కార్మిక ఫ్రెండ్లీ పార్టీ అని ఆ పార్టీ చీఫ్ కవిత అన్నారు. టీఆర్ఎస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె హైదరాబాద్లోని టీఆర్ఎస్ ఆఫీసులో పార్టీ ట్రేడ్ యూనియన్లోగోను ఆవిష్కరించారు. తమ లోగోలో ఒక వైపు పెన్ను, మరో వైపు పాణా ఉందని, అన్ని రంగాల వారికి అండగా ఉంటామని కవిత చెప్పారు. మన దేశంలో లేబర్ చట్టాలు, కార్మికుల హక్కులను పూర్తిగా కాలరాస్తున్నారని విమర్శించారు.
యువశక్తి చదువుకు తగిన విధంగా అవకాశాలు కల్పించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులందరూ ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం లేబర్ చట్టాలను తుంగలో తొక్కి నాలుగు కొత్త లేబర్ చట్టాలను తెస్తోందని, దీని వల్ల కార్మికుల హక్కులు కోల్పోయే పరిస్థితి వస్తుందని చెప్పారు. ఈ చట్టాలను అమలు చేయబోమని బెంగాల్, తమిళనాడు లాంటి రాష్ట్రాలు స్పష్టం చేశాయని, మన రాష్ట్రంలో కూడా ఈ చట్టాలను అమలు చేసేది లేదని అసెంబ్లీలో తీర్మానం చేయాలని కవిత డిమాండ్ చేశారు.
