మేడిపల్లి: నకిలీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌‌తో విద్యుత్ కనెక్షన్లు..బిల్డర్ రిమాండ్

మేడిపల్లి: నకిలీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌‌తో విద్యుత్ కనెక్షన్లు..బిల్డర్ రిమాండ్

మేడిపల్లి, వెలుగు: నకిలీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సమర్పించి విద్యుత్ కనెక్షన్లు పొందిన కేసులో ఓ నిర్మాణ సంస్థ ప్రతినిధిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌‌కు తరలించారు. పీర్జాదిగూడ శంకర్‌‌నగర్‌‌లోని సువిని ఇన్‌‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ భవనానికి విద్యుత్ కనెక్షన్ల కోసం సమర్పించిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌‌ను ప్రభుత్వ వెబ్‌‌సైట్లలో పరిశీలించగా ఎలాంటి రికార్డులు లభించలేదు. దీంతో టీజీఎస్‌‌పీడీసీఎల్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ యసాని విజయ్‌‌కుమార్‌‌రెడ్డి గత ఏడాది డిసెంబర్ 20న ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిర్మాణ సంస్థ ప్రతినిధి చింతల ఉపేందర్‌‌రెడ్డి టీజీఎస్‌‌పీడీసీఎల్‌‌ను మోసం చేసి నకిలీ పత్రాలతో విద్యుత్ కనెక్షన్లు పొందినట్లు రుజువైంది. గురువారం అతడిని అరెస్టు చేసి రిమాండ్‌‌కు పంపించారు. నకిలీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌‌ను ఎక్కడ, ఎలా తయారు చేశారు? ఇందులో మరెవరి ప్రమేయం ఉంది? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.