థ‌‌ర్మల్ కేంద్రాల‌‌కు బొగ్గు కొర‌‌త రావద్దు.. ప్రతీరోజు 28 రేకుల బొగ్గును సరఫరా చేయాలి

థ‌‌ర్మల్ కేంద్రాల‌‌కు బొగ్గు కొర‌‌త రావద్దు.. ప్రతీరోజు 28 రేకుల బొగ్గును సరఫరా చేయాలి
  •     వ‌‌ర‌‌ద‌‌ల స‌‌మ‌‌యంలో లోకల్​ ఆఫీసర్లతో స‌‌మ‌‌న్వయం చేసుకోవాలి : సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి

హైదరాబాద్, వెలుగు : విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా సప్లై చేయాలని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి ఆదేశించారు. డిమాండ్ మేరకు రోజుకు 28 నుంచి 32 రేకుల ద్వారా నాణ్యమైన‌‌ బొగ్గు సరఫరా చేయాలని అన్ని ఏరియాల జీఎంల‌‌కు సూచించారు. 

బొగ్గు ఉత్పత్తి, ర‌‌వాణా, ఓవ‌‌ర్ బ‌‌ర్డెన్ తొల‌‌గింపు, నాణ్యత వంటి అంశాల‌‌పై హైదరాబాద్‌‌లోని సింగరేణి భవన్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌‌ ద్వారా సమీక్ష నిర్వమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల కారణంగా ఓపెన్‌‌ కాస్ట్‌‌ గనుల ఉత్పత్తిపై కొంత ప్రభావం పడినా, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని సూచించారు. వర్షాకాలంలో భూగర్భ గనుల ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని చెప్పారు.

 రాష్ట్ర విద్యుత్ అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇస్తూ 75-, 80 శాతం బొగ్గును థర్మల్ విద్యుత్ కేంద్రాలకు స‌‌ర‌‌ఫ‌‌రా చేస్తున్నట్లు చెప్పారు. వర్షాకాలంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ముప్పును దృష్టిలో ఉంచుకుని లోకల్​ఆఫీసర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సింగరేణి రెస్క్యూ బృందాలు, ఇతర విభాగాల అధికారులు వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనేలా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. 

ఏటా 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని, 500 మిలియ‌‌న్ క్యూబిక్ మీట‌‌ర్ల ఓవ‌‌ర్ బ‌‌ర్డెన్ తొల‌‌గింపు లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. సమీక్షలో డైరెక్టర్లు ఎల్‌‌వీ. సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, గౌత‌‌మ్ పోట్రు, ఎం. తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్‌‌ బి. వెంకన్న, టి. శ్రీనివాస్ పాల్గొన్నారు.