అక్రిడేషన్ కార్డుల కోసం హైదరాబాద్లో డెస్క్ జర్నలిస్టు సంఘాల ర్యాలీ

అక్రిడేషన్ కార్డుల కోసం హైదరాబాద్లో  డెస్క్ జర్నలిస్టు సంఘాల ర్యాలీ

అర్హులైన డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన 252 జీవోను రద్దుచేసి గతంలో ఇచ్చినట్టుగానే అక్రిడేషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం  (ఫిబ్రవరి 25) హైదరాబాద్ లో డెస్కు జర్నలిస్టు సంఘాలు ర్యాలీ నిర్వహించాయి.  గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన జర్నలిస్టులు.. డెస్క్ జర్నలిస్టులందరికీ న్యాయం జరగాలంటూ స్లొగన్స్ చేశారు. 

అనంతరం టీడబ్ల్యూజేఎఫ్,  టీయూడబ్ల్యూజే(143), కేబుల్ నెట్వర్క్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సంఘాల ప్రతినిధులు తెలంగాణ మీడియా అకాడమీ వరకు ర్యాలీ నిర్వహించారు. అకాడమీ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. మీడియా అకాడమీ సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డెస్క్ జర్నలిస్టుల సంఘం ప్రెసిడెంట్ బాదిని ఉపేందర్ మీడియాతో మాట్లాడారు. సవరణ జీవో 252 ప్రకారం అక్రిడేషన్లు జారీ చేస్తే డెస్క్ జర్నలిస్టులు అన్యాయానికి గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రిడేషన్లు తగ్గించడం అంటే జర్నలిస్టులకు సంక్షేమాన్ని  దూరం చేయడమే అవుతుందని అన్నారు. జర్నలిస్టులకు ఇస్తున్న హెల్త్ కార్డులైనా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

►ALSO READ | అది ఇల్లా.. నోట్ల కట్టల గోదామా.. ఆ ఇల్లంతా నోట్ల కట్టలే.. ప్రభుత్వ ఉద్యోగి అవినీతి రేంజ్ ఇదీ..!

అక్రిడేషన్ల సంఖ్యకు పత్రికల సర్కులేషన్ కు లింకు పెట్టడం సరికాదని టీడబ్ల్యూజేఎఫ్ ప్రెసిడెంట్ మామిడి సోమయ్య అన్నారు.   పత్రికల సర్క్యులేషన్ ఎంత ఉన్నప్పటికీ.. పని చేసే జర్నలిస్టుల సంఖ్య తగ్గట్లేదు కాబట్టి.. సర్క్యులేషన్ నిబంధనను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎన్ఐ గుర్తింపు ఉన్న పత్రికల్లో పనిచేస్తున్న డెస్క్  జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. 

రాష్ట్ర సర్కారు జర్నలిస్టుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తోందని టీయూడబ్ల్యూజే(143) ట్రెజరర్ యోగానంద్ ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని విషయాల్లోనూ జర్నలిస్టులను చిన్న చూపు చూస్తోందని మండిపడ్డారు. జిల్లా అక్రిడేషన్ కమిటీల్లో డెస్క్ జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని డీజేఎస్ ప్రధాన కార్యదర్శి రాజారాం కోరారు. కార్టూనిస్టులకు, డిజిటల్ మీడియా డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.