లంగ్స్ పైనే కాదు ..కిడ్నీ,హార్ట్, జీర్ణవ్యవస్థపైన కూడా కరోనా ఎఫెక్ట్

లంగ్స్ పైనే కాదు ..కిడ్నీ,హార్ట్, జీర్ణవ్యవస్థపైన కూడా కరోనా ఎఫెక్ట్

కరోనా అనగానే.. లంగ్స్​పైనే అది ఎటాక్​ చేస్తుందని చాలా మంది అనుకుంటున్నారు. నిజమే వైరస్​ ముందు ఎటాక్​ చేసేది శ్వాసకోశ వ్యవస్థపైనే. ఇప్పటిదాకా నమోదైన కేసుల్లో ఎక్కువ అవే ఉన్నాయి. అయితే, ఒక్క లంగ్స్​పైనే కాదు, గుండె, మూత్రపిండాలు, కాలేయం, కళ్లు, జీర్ణవ్యవస్థపైనా పెద్ద ప్రభావమే ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. శరీరంలో సైటోకైన్స్​ (శరీరంలోని కణాలు వివిధ అవయవాలకు సిగ్నల్స్​ ఇవ్వడంలో కీలకపాత్ర పోషించే చిన్న చిన్న ప్రొటీన్లే ఈ సైటోకైన్స్​) ఎక్కువగా తయారవడం వల్ల ఆ అవయవాలపై ఎఫెక్ట్​ పడుతుందని చెబుతున్నారు. దీని వల్ల కరోనా పేషెంట్​ కోలుకోవడం ఆలస్యమవుతుందని అంటున్నారు. మరి, ఏయే అవయవాలపై ఎలాంటి ఎఫెక్ట్​ ఉంటుందో ఒక్కసారి తెలుసుకుందాం.

మూత్రపిండాలకు ముప్పు

అమెరికాలోని సగం పేషెంట్లకు మూత్రంలో రక్తం లేదా ప్రొటీన్స్​ ఎక్కువగా పోవడాన్ని డాక్టర్లు గుర్తించారు. కిడ్నీలు దెబ్బతిని ఈ సమస్య వచ్చిందని తేల్చారు. న్యూయార్క్​లో 14% , వుహాన్​లో 30 శాతం మంది పేషెంట్లలో కిడ్నీలు పనిచేయడం ఆగిపోయాయి. డయాలసిస్​ లేదా కిడ్నీ మార్పిడి మాత్రమే వారికి  పరిష్కారమని చెబుతున్నారు. అయితే, మూత్రపిండాల కణాలపై వైరస్​ దాడి చేస్తుందన్నదానిపై ఇప్పటిదాకా ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కొందరు పేషెంట్ల కిడ్నీ కణాల్లో వైరస్​ పార్టికల్స్​ ఉన్నట్టు మాత్రం గుర్తించారు. దాని వల్ల కిడ్నీలు దెబ్బతిన్నట్టు తేల్చారు.

రక్తంలో గడ్డలు

చాలా మంది పేషెంట్లకు రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టిన సమస్యలు ఏర్పడ్డాయి. కొందరిలో రక్తనాళాలు పగిలిపోయి ఆ గడ్డలు ఊపిరితిత్తుల వరకు చేరాయట. కొంతమంది ఈ కారణం వల్లే చనిపోయారని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. వుహాన్​లోని 80 మంది పేషెంట్లపై స్టడీ చేస్తే 20 మందికి ఇదే సమస్య వచ్చినట్టు తేలింది. అందులో 8 మంది చనిపోయారు. ఈ సమస్యకు విరుగుడుగా న్యూయార్క్​ డాక్టర్లు పేషెంట్లకు రక్తాన్ని పలుచన చేసే మందులను ఇస్తున్నారు.

గుండెకు గుబులు

చైనా, న్యూయార్క్​లో కరోనా పేషెంట్ల గుండె దెబ్బతిన్నది. అంతేకాదు, గుండె కండరాల్లో వాపు వచ్చి పోటు వచ్చిన సందర్భాలున్నాయి. అంతేకాకుండా గుండె కొట్టుకునే తీరులోనూ (ఎరిత్మియాసిస్​) మార్పులను గుర్తించారు. చైనా పేషెంట్లలో 40 శాతం మందిలో ఎరిత్మియాసిస్​, 20 శాతం మందిలో గుండె దెబ్బతిన్న సమస్యలు బయటపడ్డాయి. దీనికి కరోనా వైరసే కారణమా అన్నది మాత్రం డాక్టర్లు తేల్చలేకపోతున్నారు.

కళ్ల కలకలొస్తయ్​

కరోనా ఎఫెక్ట్​ కళ్లపైనా పడుతోంది. చాలా మంది పేషెంట్లకు కళ్ల కలకల సమస్యలు వచ్చాయి. చైనా హ్యూబెయ్​ ప్రావిన్స్​లో 38 మంది పేషెంట్లపై స్టడీ చేస్తే అందులో 35 శాతం మందికి ఈ సమస్య ఉంది. వైరస్​ కళ్ల నుంచి ఒంట్లోకి చేరడం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

డయేరియా ప్రాబ్లం

వైరస్​ జీర్ణవ్యవస్థపైనా ప్రభావం చూపిస్తోంది. చైనాలో సగం మంది కరోనా పేషెంట్లు డయేరియా (అతిసార) సమస్యతో బాధపడినట్టు తేలింది. దాంతో పాటు వాంతుల సమస్య కూడా ఎక్కువగా ఉంది.

లివర్​ పాడవుతోంది

అమెరికా, చైనాల్లో కొంత మంది పేషెంట్లకు లివర్​ ఇన్​ఫెక్షన్​ ఉన్నట్టు తేలింది. కరోనా వైరస్​ వల్ల హెపటైటిస్​ సమస్య వచ్చినట్టు డాక్టర్లు చెబుతున్నారు.

వాసన రాదు.. రుచి తెల్వదు

కరోనా లక్షణాల్లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న కొత్త లక్షణం వాసన పసిగట్టలేకపోవడం, రుచి చూడ లేకపోవడం. రుచి, వాసనకు కారణమయ్యే ఆల్​ఫ్యాక్టరీ నరాల ఎండింగ్స్​పై వైరస్​ ఎటాక్​ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో వాసన పసిగట్టలేమంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ ఆల్​ఫ్యాక్టరీ నర్వ్​ ఎండింగ్స్​ నుంచి నాడీ వ్యవస్థకు మూలమైన సెంట్రల్​ నర్వస్​ సిస్టమ్​ వరకు వెళుతుందట. దీని వల్ల గందరగోళం, రక్తంలో ఆక్సిజన్​ స్థాయులు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల స్పృహ కోల్పోయే ముప్పు ఏర్పడుతుంది.