5 నుంచి తెరచుకోనున్న యోగా ఇన్‌స్టిట్యూట్‌లు, జిమ్‌లు.. గైడ్‌లైన్స్‌‌ విడుదల

5 నుంచి తెరచుకోనున్న యోగా ఇన్‌స్టిట్యూట్‌లు, జిమ్‌లు.. గైడ్‌లైన్స్‌‌ విడుదల

న్యూఢిల్లీ: అన్‌లాక్‌ మూడో ఫేస్‌లో భాగంగా జిమ్నాజియమ్‌లు, యోగా సెంటర్‌‌లను తెరవడానికి కేంద్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 5న వీటిని తిరిగి తెరిచేలా తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మినిస్ట్రీ ఆఫ్​ హోమ్ అఫైర్స్‌ (ఎంహెచ్‌ఏ) విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. కరోనా కంటోన్మెంట్ జోన్స్‌లో ఉన్న యోగా ఇన్‌స్టిట్యూట్స్, జిమ్నాజియమ్స్‌ మాత్రం మూసేసి ఉంచాల్సిందే. అలాగే 65 ఏళ్లకు పైబడిన వారు, ఏవైనా రోగాలతో బాధపడుతున్న వారు, గర్భిణీలు, 10 ఏళ్ల లోపు పిల్లలు క్లోజ్డ్‌ ప్లేసెస్‌లో ఉన్న జిమ్నాజియంలతోపాటు యోగా సెంటర్స్‌కు వెళ్లొద్దని గవర్నమెంట్ సూచించింది.

యోగా క్రియలను నివారించాలని లేదా ఖాళీ స్థలాల్లో ప్లాన్ చేయాలని కేంద్రం నిర్దేశించింది. పెద్ద మొత్తంలో ప్రజలు గుమికూడకుండా బ్యాచ్‌ల వారీగా టైమింగ్స్‌ ఫిక్స్ చేయాలని, ప్రతి బ్యాచ్‌కు ఇంకో బ్యాచ్‌కు మధ్య 15–30 నిమిషాల గ్యాప్ ఉండేలా చూడాలని సూచించింది. ఆక్సిజన్ సాట్యురేషన్ లెవల్ 95% కంటే తక్కువగా ఉన్న వారిని ఎక్సర్‌‌సైజ్‌లు చేయడానికి నిరాకరించాలని స్పష్టం చేసింది. ‘వ్యక్తిగతంగా 6 అడుగుల దూరం పాటించాలి. ముఖానికి మాస్కులు కట్టుకోవడం తప్పనిసరి. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ముఖాన్ని, ముక్కును టిష్యూ లేదా బట్టతో కవర్ చేసుకోండి. కార్డ్‌ బేస్డ్‌, కాంటాక్ట్‌లెస్ పేమెంట్‌ను ప్రమోట్ చేయండి’ అని కేంద్రం తన గైడ్‌లైన్స్‌లో పేర్కొంది.