కర్నూలు జిల్లాలో క్రైమ్ థ్రిల్లర్ ను మరిపించిన డెత్ మిస్టరీ

కర్నూలు జిల్లాలో క్రైమ్ థ్రిల్లర్ ను మరిపించిన డెత్ మిస్టరీ

అనాథ వికలాంగ వ్యక్తికి ఇన్సూరెన్స్ చేయించి.. చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన వైనం

చంపిన వారు ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసుకుని స్వాహా చేసేశారు

ఐదేళ్ల క్రితం హత్యకు గురైన వ్యక్తి అనాథ

హత్య జరిగింది 2015 డిసెంబర్ లో.. శవం కూడా దొరకలేదు..

మృతుడు అనాథ కాబట్టి అతని తాలూకు వారెవరూ లేరు

ఆకాశ రామన్న ఉత్తరాన్ని పట్టుకుని కేసు టేకప్ చేసిన జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప

ఎఫ్.ఐ.ఆర్ ను క్షుణ్ణంగా పరిశోధించి డెత్ మిస్టరీని చేదించిన కర్నూలు ఎస్పీ

ప్రత్యక్షంగా హత్య చేసిన నలుగురు నిందితుల అరెస్టు

హత్యకు కుట్ర.. సహకరించిన లాయర్.. ఇద్దరు ఇన్సూరెన్స్ ఉద్యోగుల పరారీ

పరారీలో ఉన్న నలుగురి కోసం స్పెషల్ టీమ్ ను రంగంలోకి దింపిన ఎస్పీ

హత్యకు ఉపయోగించిన ట్రాక్టర్.. అనాథను చంపే ముందు తీసుకెళ్లిన బైకు సీజ్..

కరుడుగట్టిన  ఫ్యాక్షన్ గడ్డ లాంటి కర్నూలు జిల్లా అవుకు మండలంలో క్రైమ్ థ్రిల్లర్ ను మరిపించే హత్య జరిగింది. ఐదేళ్ల క్రితం అనాథను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి అతని సోదరుడి పేరుతో ఇన్సూరెన్స్ సొమ్ము తినేశారు.  శవం లేదు.. అతని తాలూకు వారెవరూ లేరు.. ఇన్సూరెన్స్ సొమ్ము తీసుకున్న సోదరుడు.. ఏమయ్యాడో.. ఎక్కడకు వెళ్లిపోయాడో తెలియదు.  ఐదేళ్ల  క్రితం జరిగిన రోడ్డు ప్రమాదాన్ని హత్య అని ఆరోపిస్తూ వచ్చిన ఆకాశ రామన్న ఉత్తరం తప్ప ఎలాంటి ఆధారమూ లేదు. ఈ ఆకాశ రామన్న ఉత్తరాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప సవాల్ గా తీసుకుని.. రోడ్ యాక్సిడెంట్ గా మూసేసిన కేసు అసలు మిస్టరీని రెండు వారాల్లోనే ఛేదించారు.

శవం లేకున్నా.. హత్యకు గురైన వ్యక్తికి సంబంధించిన వారెవరూ లేకున్నా.. సవాల్ గా తీసుకుని అనుమానంతో కూపీలాగి డెత్ మిస్టరీని ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. డెత్ మిస్టరీని ఛేదించిన వైనాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప మీడియా సమావేశంలో వివరిస్తుంటే.. క్షణం.. క్షణం.. అనూహ్య మలుపులతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ ఈ కేసు ముందు బలాదూరేననిపిస్తుంది.

కర్నూలు జిల్లా అవుకు మండలంలో బయటపడిన ఈ కేసు క్రైమ్ థ్రిల్లర్లలోనే హైలైట్ గా చెప్పుకోవచ్చు. 2015లో డిసెంబర్ 5న తెల్లవారుజామున 4 గంటల సమయంలో అవుకు గ్రామం దగ్గర మెట్టుపల్లి రోడ్డులో.. రోడ్డు ప్రమాదంలో సుబ్బరాయుడు అనే పశువుల కాపరి చనిపోయాడు. గుర్తు తెలియని వాహనం డీకొన్నట్లు 108కు ఫోన్ వెల్లింది.  మృతుడి తలపై వాహనం టైరు ఎక్కివెళ్లడంతో ఛిద్రమై చనిపోయాడని గుర్తించిన 108 సిబ్బంది.. 100 క్రైమ్ సెల్ కు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి గుర్తు తెలియని వాహనం ఢీకొట్డంతో చనిపోయినట్లు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టంకు పంపారు. పోస్టుమార్టంలో కూడా అదే రిపోర్టు వచ్చింది. అనాథ కాబట్టి అతని వాళ్లెవరూ లేకపోవడంతో గ్రామ పంచాయతీ వారే అనాథల శవాలను పూడ్చే చోట పూడ్చేశారు. ఇదీ ఎఫ్.ఐ.ఆర్ లోని కేసు సారాంశం..

చనిపోయిన వ్యక్తి సుబ్బరాయుడు స్వగ్రామం కర్నూలు జిల్లాలోని  ప్యాపిలి మండలం గార్లదిన్నె గ్రామం. కాస్త వైకల్యం ఉన్న సుబ్బరాయుడు.. 30 ఏళ్ల వయసులో ఉండగా..  2001లో అవుకు మండలం మెట్టుపల్లికి చెందిన సి.జె.భాస్కర్ రెడ్డి వద్ద పశువుల కాపరిగా చేరాడు. ఇన్సూరెన్స్ చేయించుకున్న నెలరోజులకే అతడికి యాక్సిడెంట్ అయింది. 2015 డిసెంబర్ 5న చనిపోయిన సుబ్బరాయుడి సోదరుడిని అంటూ.. వడ్డె భాస్కర్ రూ.16లక్షల ఇన్సూరెన్స్ సొమ్ము తీసేసుకున్నాడు. ఆ తర్వాత.. ఏమయ్యాడో.. ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు.  పశువుల యజమాని భాస్కర్ రెడ్డిని ఈ ఘటన గురించి అడిగితే.. తనకేమీ తెలియదని.. తన వద్ద ఉన్నప్పుడు బాగానే చూసుకున్నానని చెప్పేవాడు.

జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఎఫ్.ఐ.ఆర్ ను క్షుణ్ణంగా పరిశోధించాక.. చనిపోయిన సుబ్బరాయుడు తాను పనిచేస్తున్న యజమాని భాస్కర్ రెడ్డికి చెందిన ట్రాక్టర్ కిందనే పడి చనిపోవడం యాదృచ్చికం అని అందరూ భావించారు. దీన్నే ఆధారంగా తీసుకుని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కర్నూలు సీసీఎస్ డీఎస్పీ వినోద్ కుమార్.. సీఐ జి.నిరంజన్ రెడ్డిలతో ప్రత్యేక టీమ్ ను రంగంలోకి దించారు.

స్పెషల్ టీమ్ బృందం.. బ్యాంకు ఖాతాలు, చనిపోయే ముందు ఎవరి బైకుపై వెళ్తూ యాక్సిడెంట్ కు గురయ్యాడనే వివరాలు ఆరా తీయగా.. తీగ దొరికింది. బైకుపై తీసుకెళ్లిన వ్యక్తి బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా డబ్బు వచ్చినట్లు గుర్తించి తమదైన శైలిలో ప్రశ్నించగా.. కేసు మిస్టరీ బయటకు వచ్చింది.

అనుమానితులుగా ఉన్న నిందితులకు సంబంధించిన పక్కా ఆధారాలను శాస్ర్తీయంగా సేకరించి వేట ప్రారంభించారు. మొదటి నలుగురు నిందితులు పట్టుబడగా.. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా.. నిందితులు నేరం అంగీకరించారు. మిగిలిన నిందితులైన కుట్ర దారుడు… లాయర్ మహేశ్వర్ రెడ్డి..  అనాథ పేరు మీద ఇన్సూరెన్స్ చేసి .. చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తే.. రెట్టింపు డబ్బులు వస్తాయని సలహా ఇచ్చిన నంద్యాలకు చెందిన లాయర్ మహేశ్వర రెడ్డి.. అతనికి సహకరించిన ఇద్దరు ఇన్సూరెన్స్ ఉద్యోగులతోపాటు.. మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.

పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఇలా సాగింది

మర్డర్ మిస్టరీని ఛేదించిన తర్వాత.. నిందితులను ముసుగులతో జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప వివరించారు. 2015లో నంద్యాలకు చెందిన మహేశ్వర్ రెడ్డి అనే లాయర్.. భాస్కర్ రెడ్డి ని కలసినప్పుడు అతని వద్ద పనిచేస్తున్న సుబ్బరాయుడు అనాథ కాబట్టి అతని పేరు మీద ఇన్సూరెన్స్ చేసి.. రోడ్డు యాక్సిడెంట్ లో చంపేస్తే.. రెట్టింపు డబ్బులు వస్తాయని సలహా ఇచ్చాడు. అతని సూచనలను నమ్మిన భాస్కర్ రెడ్డి మరో నలుగురి సహకారంతో పక్కా ప్లాన్ రెడీ చేశారు. ఇన్సూరెన్స్ కంపెనీ వారికి అనుమానం రాకుండా.. మొదల రూ.లక్ష ఇన్సూరెన్స్ చేసి దానికయ్యే ప్రీమియం చెల్లించారు. కొద్ది రోజల తర్వాత ఈసారి రూ.15 లక్షలకు ఇన్సూరెన్స్ చేసి.. రోడ్డు ప్రమాదంలో చనిపోతే.. రెట్టింపు వచ్చే స్కీం సెలెక్టు చేసుకున్నారు. ఇన్సూరెన్స్ పాలసీ ఓకే అయిన వెంటనే పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నారు.

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఘోరమైన హత్య ఇలా..

2015 డిసెంబర్ 5న భాస్కర్ రెడ్డి తన మిత్రులైన చంద్రశేఖర్ రెడ్డి.. పెట్నికోట షేక్షావలి, జీనుగ వెంకటకృష్ణ, జీనుగ శివశంకర్ లతో కలసి ప్లాన్ ను అమలు చేశారు. షేక్షావలి తన బైకుపై తెల్లవారుజామున సుబ్బరాయుడుని ఎక్కించుకుని మెట్టుపల్లి గ్రామ శివార్లలోకి తీసుకురాగా.. రోడ్డుపక్కన జమ్మిచెట్టు వద్ద ఆపి.. గొంతు నులిమి చంపేశారు. అయితే హత్య చేసినట్లు తెలుస్తుందని.. వెంటనే ముగ్గురు కలసి కాళ్లు చేతులు.. పట్టుకోగా.. ట్రాక్టర్ తో తలపైకి ఎక్కించి చంపేశారు. వారే అక్కడి నుండి.. 108కు ఫోన్ చేశారు. అటు తర్వాత సుబ్బరాయుడికి వడ్డె భాస్కర్ అనే సోదరుడు ఉన్నట్లు తప్పుడు ఓటరు కార్డు సృష్టించి.. అదే పేరుతో బ్యాంకులో అకౌంట్ తెరచి.. ఇన్సూరెన్స్ సొమ్ము తీసుకున్నారు. చనిపోయిన వ్యక్తి వికలాంగుడు కాబట్టి అతని తాలూకు వారికి రూ.నెలకు 15 వేలు పెన్షన్ రూపంలో వస్తోంది. దాన్ని కూడా సోదరుడు వడ్డె భాస్కర్ పేరుతో యజమాని భాస్కర్ రెడ్డి తీసుకుంటున్నాడు. చనిపోయిన సుబ్బారాయుడు.. తాను పనిచేస్తున్న యజమాని ట్రాక్టర్ కిందనే పడి చనిపోయాడన్న లాజిక్ తో.. పోలీసులు ఫీల్డ్ లోకి వెళ్లి పరిశోధిస్తే… రోడ్డు ప్రమాదం కాదు.. హత్య అన్న పక్కా ఆధారాలు లభించాయి. కేసు వివరాలు తెలిపిన జిల్లా ఎస్పీ.. నిందితులు రాజకీయ అండదండలతో.. బరితెగించారని.. అయితే నేరం ఎన్నటికీ దాగదన్న విషయాన్ని గుర్తించలేకపోయారని చెప్పారు.