డాక్ట‌ర్ల క‌మీష‌న్ల క‌క్కుర్తి..అవసరం లేకున్నా సీటీ స్కాన్‌..! కరోనా నిర్ధారణకు అనవసర పరీక్షలు

డాక్ట‌ర్ల క‌మీష‌న్ల క‌క్కుర్తి..అవసరం లేకున్నా సీటీ స్కాన్‌..! కరోనా నిర్ధారణకు అనవసర పరీక్షలు

కొన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాకాలు మరిచిపోకముందే మరో కొత్త కోణం వెలుగుచూసింది. అవసరం లేకున్నా కొన్ని ఆసుపత్రులు, ల్యాబొరేటరీలు సీటీ స్కాన్‌లు చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కమీషన్ల కోసం కొందరు వైద్యులు ఈ తరహా అక్రమాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇవి వైద్యారోగ్య శాఖ దృష్టికి రావడంతో విచారణ మొదలుపెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనవసరంగా సీటీ స్కాన్‌లు చేస్తున్న ల్యాబొరేటరీలను గుర్తించే పనిలో ఇప్పటికే నిమగ్నమైనట్లు తెలిసింది.

ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష ఫలితంలో ఆలస్యం ఆసరాగా..

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా నిర్ధారణకు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షతోపాటు ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే పలు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో తమ వద్దకు వచ్చే వారిని లాభాపేక్ష కోసం కొత్తగా సీటీ స్కాన్ల దిశగా ప్రోత్సహిస్తున్నానేది తాజా ఆరోపణ. సాధారణంగా ల్యాబొరేటరీల్లో ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష ప్రైవేటులో రూ.3 వేల లోపే అవుతోంది. అదే సీటీ స్కాన్‌కు అయితే రూ.5-6 వేల వరకు వసూలు చేస్తున్నారు. పీపీఈ కిట్ల ధర కలుపుతూ ఇప్పుడు మరింత ఎక్కువ తీసుకుంటున్నారు. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష అయితే ఫలితం కోసం కనీసం 24 గంటలు ఆగాల్సి ఉంటుంది. సీటీ స్కాన్‌ అయితే గంటలోనే ఫలితం వస్తుందని బాధితుల్ని ముగ్గులోకి లాగుతున్నారు. అసలే ఆందోళనతో ఉంటున్న రోగులు సులభంగానే వారి మాయలో పడిపోతున్నారు. ఆసుపత్రుల్లో ఇన్‌పేషంట్లుగా చేర్చుకోవడానికి కొన్ని ల్యాబొరేటరీల్లో సీటీ స్కాన్‌ నివేదికల్ని, ఫిల్మ్‌లనూ మార్ఫింగ్‌ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నా అధికారులు మాత్రం దీనిపై ఇప్పటివరకు స్పష్టతకు రాలేకపోతున్నారు. ఓ కీలక ఉన్నతాధికారి కుటుంబసభ్యుడి విషయంలో ఇలాంటి నిర్వాకానికి ఒడిగట్టారనే విషయంలో విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.

అనవసర సీటీ స్కాన్‌లతో దుష్ప్రభావాలు

ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షతోనే కొవిడ్‌ ఉందా..? అనేది నిర్ధారణ అవుతుంది. అదే ప్రామాణికం. అయితే కొన్నిసార్లు ఈ పరీక్షలో నెగిటివ్‌ వచ్చినా కరోనా లక్షణాలు కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు ఛాతీ ఎక్స్‌రే తీసి పరిశీలించాలి. అందులోనూ స్పష్టత లేకపోతేనే ఛాతీ సీటీ-స్కాన్‌ అవసరం. అయితే సీటీ స్కాన్‌లో రేడియేషన్‌ ఎక్కువ ఉంటుంది కాబట్టి అనవసరంగా చేస్తే ఆరోగ్యం దెబ్బతినేందుకు ఆస్కారముంటుంది. కొద్ది మందిలో ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా గుర్తించడం సీటీ స్కాన్‌ ద్వారా సాధ్యమవుతుంది. అయినా తప్పనిసరిగా గుర్తింపు పొందిన వైద్యుడి ధ్రువీకరణ ఉంటే తప్ప సీటీ స్కాన్‌ చేయొద్దు.