లాక్ డౌన్ : కరెంటు బిల్లులు చెల్లించని వినియోగదారులు

లాక్ డౌన్ : కరెంటు బిల్లులు చెల్లించని వినియోగదారులు

కరెంట్ బిల్లులపైనా  కరోనా దెబ్బ పడింది. లాక్ డౌన్ కారణంగా ఈ నెలలో విద్యుత్ రీడింగ్ తీయకపోవడంతో  గతేడాది మార్చిలో నమోదైన వాడకాన్ని యావరేజ్ చేసి ఈ మార్చి బిల్లు పంపించారు. దీనిని ఆన్ లైన్ లో కట్టాలని అధికారులు ప్రచారం చేస్తున్నా వినియోగదారుల నుంచి మాత్రం స్పందన రావడం లేదు. మీటర్రీడింగ్ నమోదు చేయకుండా బిల్లులు చెల్లించడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. పైగా ఆన్ లైన్ లో బిల్లులు చెల్లించే విధానంపై అందరికీ అవగాహన లేకపోవడంతో ఆశించిన స్థాయిలో బిల్లులు వసూలు కావడం లేదని అధికారులు చెప్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మార్చి నెలకు సంబంధించి విద్యుత్ శాఖకు రావాల్సిన మొత్తం రూ. 47.36 కోట్లు కాగా, ఇప్పటివరకు కేవలం రూ.1.59 కోట్లు మాత్రమే వసూలైంది. అంటే మొత్తం చెల్లించాల్సిన దాంట్లో కేవలం 3.38 శాతమే వసూలయ్యాయి.

కరోనా ఎఫెక్టే..

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని కేటగిరీల్లో కలిపి మొత్తం 13,73,819 స ర్వీసులు ఉన్నాయి. వీటికిగాను వసూలు కావాల్సిన బిల్లులు రూ.47.36 కోట్లు. ప్రతి నెల ఇప్పటికే 40 శాతం బిల్లులు వసూలు అయ్యేవి. కానీ ప్రస్తుతం 3.38 శాతం మాత్రమే వచ్చాయి. గత ఐదారు రోజుల నుంచి బిల్లులు వసూలు చేయడం ప్రారంభించారు. కానీ ఇప్పటివరకు కేవలం రూ.1.59 కోట్లు మాత్రమే వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో విద్యుత్ కనెక్షన్లలో గృహ వినియోగ సర్వీసులే 8,38,8 12 ఉన్నాయి. వీటికిగాను చెల్లించాల్సిన కరెంట్ బిల్లు రూ.22.35 కోట్లు కాగా, కేవలం రూ. 1. 22 కోట్లు మాత్రమే వసూలు కాగా, ఇంకా రూ.21.13 కోట్లు రావాల్సి ఉంది. కరోనా కారణంగా ఖర్చులు పెరగడంతో పాటు, ఉద్యోగుల జీతభత్యాల్లో ప్రభుత్వం కోత పెట్టడంతో కరెంట్ బిల్లులు చెల్లించేందుకు కూడా చేతిలో డబ్బు లేకుండా పోయిందని కొందరు చిరుద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే వైరస్వ్యాప్తి చెందకుం డా లాక్ డౌన్ ప్రకటించడంతో గత నెల 21 నుంచే వ్యాపారాలు పూర్తిగా బందయ్యాయి. దీంతో కమర్షియల్ కేటగిరీలోకి వచ్చే దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలకు సంబంధించిన కరెంట్ బిల్లులు కూడా వసూలు కావడం లేదు. ఈ కేటగిరి కింద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వసూలు కావాల్సిన బిల్లులు రూ.8.05 కోట్లు కాగా, ఇప్పటివరకు కేవలం రూ.26.48 లక్షలు మాత్రమే వచ్చాయి. పరిశ్రమల కేటగిరీ లో వసూలు కావాల్సిన విద్యుత్ బిల్లులు సుమారు రూ.3 కోట్లు కాగా, ఇప్పటివరకు కేవలం రూ.9 లక్షలు మాత్రమే చెల్లించారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో వీధిలైట్లు, వాటర్ వర్క్స్కు సంబంధించి విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన బిల్లులు రూ.11.72 కోట్లు కాగా, ఇప్పటి వరకు నయాపైసా చెల్లించలేదు.