జమ్మూకశ్మీర్‌లో డ్రోన్ల కలకలం.. దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ

జమ్మూకశ్మీర్‌లో డ్రోన్ల కలకలం.. దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ

జమ్మూ కశ్మీర్‌లో డ్రోన్ల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజామున రెండున్నర గంటల టైంలో కుంజ్వాని, రత్నుచుక్
ఏరియాలో డ్రోన్లు కనిపించాయి. అయితే కొద్ది సేపటి తర్వాత మళ్లీ అవి కనిపించలేదు. కుంజ్వాని ప్రాంతం సత్వారి ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు 6
కిలోమీటర్ల దూరంలో ఉంది. దాంతో ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు.

అంతకుముందు కలుచాక్ మిలిటరీ స్టేషన్ దగ్గర్లో ఆదివారం రాత్రి 11.45 గంటలకు ఒకటి, సోమవారం తెల్లవారుజామున 2.40 గంటలకు
మరొక డ్రోన్ ఎగురుతూ కనిపించాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వెంటనే డ్రోన్లను కూల్చేందుకు కాల్పులు జరిపారు. తర్వాత వెంటనే
రెండు డ్రోన్లు పాక్ వైపు వెళ్లిపోయాయి. ఆదివారం తెల్లవారుజామున జమ్మూ ఎయిర్ పోర్టులోని ఐఏఎఫ్ స్టేషన్‌పై డ్రోన్ల సాయంతో రెండు
బాంబులను వేశారు. ఈ దాడిలో ఇద్దరు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు. పాకిస్థాన్ బోర్డర్‌కు కేవలం 14 కిలోమీటర్ల దూరంలో
ఉన్న ఐఏఎఫ్ స్టేషన్‌పై పేలుళ్లు జరగడం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా చూస్తే.. గత మూడు రోజుల్లో మొత్తం 5 డ్రోన్లు భారత
భూభాగంలో కలకలం సృష్టించాయి.

ఆదివారం జమ్మూలోని ఐఏఎఫ్ స్టేషన్‌పై జరిగిన దాడి కేసు విచారణను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎన్ఐఏకు అప్పగించింది. పేలుడులో ఆర్డీఎక్స్
లేదా టీఎన్‌టీ ఉపయోగించినట్లు స్పెషల్ బాంబ్ స్క్వాడ్ టీం అనుమానిస్తుంది. పాకిస్తాన్‌కు చెందిన లష్కర్-ఇ-తోయిబా ఈ దాడికి పాల్పడినట్లు
అధికారులు భావిస్తున్నారు. కాగా.. డ్రోన్లను స్థానికులు ఎవరైనా ఆపరేట్ చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.