కర్నూలు జిల్లాలో పాదచారులపైకి దూసుకెళ్లిన డీసీఎం.. నలుగురు చిన్నారుల మృతి

కర్నూలు జిల్లాలో పాదచారులపైకి దూసుకెళ్లిన డీసీఎం.. నలుగురు చిన్నారుల మృతి

కర్నూలు: జిల్లాలోని శిరువెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రి క్రిస్మస్ ప్రార్థన కోసం చర్చికి నడుచుకుంటూ వెళ్తున్న వారిని డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో 15మంది గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

తెల్లవారుజామున పొగ మంచులో హెడ్ లైట్ల వెళ్తురులో సామూహిక ప్రార్థన కోసం రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారిని డీసీఎం డ్రైవర్ గుర్తించలేదు. గమనించేలోపే వాహనం వారిని ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ తన వాహనాన్ని ఆపినట్లే ఆపి.. వేగంగా వెళ్లిపోయాడు. గాయపడిన వారు ఆర్తనాదాలు చేయడంతో ..గుంపుగా నడుచుకుంటూ వెళ్తున్న వారు షాక్ నుండి కోలుకుని కేకలు వేస్తూ.. డీసీఎం ను ఆపే ప్రయత్నం చేశారు. డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా పరారయ్యాడు. దీంతో కోపోద్రికులైన గ్రామస్తులు.. అందుబాటులో ఉన్న వాహనాల్లో డీసీఎంను వెంబడించారు. బత్తులూరు వద్ద డీసీఎంను అడ్డగించి ఆపేసి పోలీసులకు సమాచారం అందించారు. మరో వైపు గాయపడిన వారిని హుటాహుటిన అంబులెన్స్ లు.. ఆటోలలో నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన నలుగురు చిన్నారులు  శిరువెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన సుజాత, హర్షవర్థన్‌, ఝాన్సీ, వంశీగా గుర్తించారు.

బాధితులను పరామర్శించిన కలెక్టర్ వీరపాండియన్

ఎర్రగుంట్ల దగ్గర రోడ్డు ప్రమాదంలో గాయపడి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను.. బాధితుల కుటుంబాలను జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ పరామర్శించారు. పెద్దాసుపత్రిలోని అత్యవసర వార్డులో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ కు ఆదేశాలిచ్చారు. ప్రమాదం జరిగిన తీరును బాధితులతో కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. బాధితులకు అన్నివిధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రిక్రిస్మస్ వేడుకలో భాగాం  తెల్లవారు జామున సామూహిక ప్రార్థనల కోసం చర్చికి బయలుదేరిన సుమారు 40 మంది రోడ్డు దాటేందుకు వేచి ఉండగా.. హైదరాబాద్ నుంచి మైదుకూరు వెళ్తున్న డీసీఎం వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు గుర్తించామన్నారు. ముగ్గురు స్పాట్ లోనే చనిపోగా..  నంద్యాల ఆస్పత్రిలో చికిత్సకు చేర్చిన అరగంటలోనే మరొకరు చనిపోయారని వివరించారు. సుమారు 15 మంది గాయపడగా.. వారిలో 8 మందికి మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడం జరిగిందన్నారు. ప్రమాదం గురించిన సమాచారం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప.. జాయింట్ కలెక్టర్ హుటాహుటిన బయలుదేరి సంఘటనా స్థలానికి వెళ్లారని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ వివరించారు. బాధితుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.