నడుము లోతు వరదలో డెడ్‌బాడీ తరలింపు

నడుము లోతు వరదలో డెడ్‌బాడీ తరలింపు
  • నీళ్లలోనే పాడె మోస్తూ..
  • మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లాలో సంఘటన
  • వరదలకు రాష్ట్రం అతలాకుతలం
  • 1,250 గ్రామాలు జలమయం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న వానలకు ఊర్లు, నగరాలు జలమయమైపోయాయి. ఎక్కడ చూసినా నడుము లోతు నీళ్లతో జనం ఇబ్బంది పడుతున్నారు. గునా జిల్లాలోని ఓ ఊర్లో ఓ వ్యక్తి చనిపోగా నడుము లోతు నీళ్లలోనే డెడ్‌బాడీని శ్మశాన వాటికకు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది.  

నీళ్లు తగ్గకపోవడంతో..
గునా జిల్లాలోని భదౌరా గ్రామంలో కమర్లాల్‌ షక్యవర్‌ అనే వ్యక్తి శుక్రవారం మరణించారు. వరదల వల్ల ఆ గ్రామం అప్పటికే నీట మునిగిపోయింది. నీళ్లు తగ్గిపోతాయేమోనని బంధువులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కానీ ఎన్ని గంటలైనా తగ్గకపోవడంతో నడుము లోతు నీళ్లలోనే ఆ డెడ్‌బాడీని శ్మశానవాటికకు తరలించాలని నిర్ణయించారు. ఈత వచ్చిన కొందరు నడుము లోతు నీళ్లలోనే శ్మశాన వాటికకు డెడ్‌ బాడీని మోసుకెళ్లారు. ఊర్లోని శ్మశాన వాటిక దగ్గర మాత్రం నీళ్లు లేవని తెలిసింది. డెడ్‌బాడీని మోసుకెళ్తున్న వీడియోను కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఊర్లల్లో కనీస డెవలప్‌మెంట్‌ జరగట్లేదని, రోడ్లు కూడా సరిగా ఉండట్లేదని మండిపడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన పథకాలు అమలవట్లేదని, ఎక్కడో ఓ చోట అమలు చేసినా పని మాత్రం అంతంతే జరుగుతోందని విమర్శిస్తున్నారు. 

కేంద్ర మంత్రి తోమర్‌కు నిరసన సెగ
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌, శివ్‌పురి, గునా, షియోపూర్‌, దటియా, అశోక్‌నగర్‌, భీండ్‌, మోరెనా జిల్లాల్లోని 1,250 గ్రామాలను వరదలు ముంచెత్తాయి. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ మధ్య 24 మంది వరదల్లో మరణించారు. ఇటీవల షియోపూర్‌లో పర్యటనకు వచ్చిన కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ను స్థానికులు నిలదీశారు. మంత్రి కాన్వాయ్‌పై బురదను చల్లారు. నల్ల జెండాలతో నిరసన తెలిపారు.