ఇంకా కొన్ని అప్పులు తెస్తం.. కొంపలేమి మునిగిపోవు: సీఎం

ఇంకా కొన్ని అప్పులు తెస్తం.. కొంపలేమి మునిగిపోవు: సీఎం
  • ఉప సర్పంచ్​లకు జాయింట్​ చెక్​ పవర్​ ఉంటది
  • వీఆర్వోలను తొలగించాల్సి వస్తే తొలగిస్తం
  • రెవెన్యూ ఉద్యోగులు పిచ్చి సమ్మెలు చేస్తే రోడ్డునపడుతరు
  • కౌలుదారులు కిరాయిదారులే.. వారిని గుర్తించేది లేదు
  • 25న కానిస్టేబుల్ ఎగ్జామ్‌‌ రిజల్ట్స్​ విడుదల
  • దుర్మార్గాలకు బ్రీడింగ్ సెంటర్ కాంగ్రెస్
  • రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదని విమర్శ
  • అసెంబ్లీలో భట్టి విమర్శలపై కేసీఆర్​ అసహనం

హైదరాబాద్‌‌, వెలుగు:

అవసరమైతే ఇంకా అప్పులు చేస్తామని, కొంపలేమీ మునిగిపోవని, రాష్ట్రం బాగుపడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. అభివృద్ధి కోసం అప్పులు తేక తప్పదని, తాము మాత్రమే అప్పులు చేయలేదని, గత ప్రభుత్వాలు కూడా అప్పులు చేశాయని పేర్కొన్నారు. అప్పులు ఎందుకు తెచ్చామో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తన మీద ఉందని, కేంద్రంలో కాంగ్రెస్‌‌, బీజేపీ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌, టీడీపీ పాలన తాలూకు దుష్ట అనుభవాలను తాము సర్దలేక సచ్చిపోతున్నామని కేసీఆర్​ అన్నారు. గతంలో పాలించిన వాళ్లు ఇంటికో ఉద్యోగం ఇచ్చి ఉంటే తాము ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితే తలెత్తేది కాదని తెలిపారు. రైతులు బ్యాంకుల్లో తీసుకున్న అప్పులను ముందే కట్టేసుకోవాలని, నాలుగు విడతల్లో లక్షలోపు రుణాల మాఫీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు.  సర్పంచ్‌‌, ఉపసర్పంచ్‌‌లకు జాయింట్ చెక్‌‌పవర్ కొనసాగుతుందని, వీఆర్వోలను తొలగించాల్సి వస్తే.. తొలగిస్తామని, ఎవరికీ భయపడమని తేల్చిచెప్పారు. ద్రవ్యవినిమయ బిల్లుపై ఆదివారం అసెంబ్లీలో జరిగిన చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్​ సుదీర్ఘంగా బదులిచ్చారు. కాంగ్రెస్​, బీజేపీపై విరుచుకుపడ్డారు.ఆదివారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్​ సుదీర్ఘంగా ప్రసంగించారు. కేసీఆర్​ ఏమన్నారంటే..

అప్పులు చీకట్ల తెస్తమా?

భట్టి విక్రమార్క రాష్ట్రానికి ఏదో ప్రమాదం పొంచి ఉందని మాట్లాడుతున్నరు. రాష్ట్రానికి , ప్రజలకు కాదు.. కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం ఉంది. రాష్ట్రానికి ఏం ప్రమాదం లేదు. మీరు మాట్లాడే అప్పులు అనేది 1940 మోడల్‌‌.. మీ(కాంగ్రెస్) పార్టీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు ఆర్థిక సంస్కరణలు తెస్తే డైమెన్షన్‌‌ మారిపోయింది. అర్థం చేసుకున్నోళ్లు క్యాచ్‌‌ చేసుకొని ముందుకు పోతా ఉన్నరు.. అర్థం చేసుకోలేనోళ్లు ఆగమాగమైతున్నరు.. నేనే కుండబద్దలు కొట్టినట్టు లెక్కలు ఇచ్చిన. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చే అప్పులు రహస్యంగా ఉంచజాలదు కదా? అఫీషియల్‌‌గా తేవాలే అప్పులు. చీకట్లో తెస్తమా? అవసరమైతే ఇంకా కూడా అప్పులు తెస్తం. కొంపలేమి మునిగిపోవు. బాగుపడతరు. చాలా మందికి తెలియదు.. అర్థం కూడా కాదు.. మీలెక్క లేం మేం.. రిజల్ట్స్‌‌ రావాలె. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌‌ ట్యాక్స్‌‌ను 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించడంతో రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో రూ.1,400 కోట్లు కోల్పోతున్నం. కాళేశ్వరం ప్రాజెక్టుతో 40, 45 లక్షల ఎకరాల్లో పంట పండుతుంది. ప్రాజెక్టుకు తెచ్చిన అప్పు  రెండు పంటలతో తీరుతది. మాంద్యంలోనూ మంచి బడ్జెట్‌‌ ప్రవేశపెట్టినమని నాకు వందల మంది ఫోన్లు చేసి చెప్పిన్రు.

భూములు అమ్ముతం

రూ. 10వేల కోట్లతో  స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్ )  సీఎం దగ్గరే ఉంటది. గ్రోత్ తగ్గితే సర్దుబాటు చేయటానికే సీఎం దగ్గర ఉంచినం. నీటి పారుదల ప్రాజెక్టులను ఆపబోం. పేదల సంక్షేమ పథకాలను కూడా ఆపబోం. బడ్జెట్ లో ఉన్నది ఉన్నట్లు చెప్పినం. అంచనా వేసిన దాని కంటే ఎక్కువ రావొచ్చు, తక్కువ రావొచ్చు. భూముల అమ్మకాల ద్వారా ఆదాయం వస్తుందనే ఎస్డీఎఫ్ పెట్టినం. కోకాపేటలో 100 ఎకరాల భూమిని డెవలప్ చేస్తున్నం. పుప్పాలగూడలో 150 ఎకరాల భూమి పై సుప్రీం కోర్టులో వాదనలు ముగిసినయి. కోర్టు తీర్పు అనుకూలంగా ఉంటే ఆ భూమిని అభివృద్ధి చేసి వచ్చిన ఆదాయాన్ని ఎస్డీఎఫ్‌‌లో చేరుస్తం. ఇలా రూ.136 కోట్ల ఆదాయం వస్తుందని ఆశిస్తున్నం. సభ అప్రూవ్‌‌ చేస్తేనే ఆ నిధులను ఖర్చు చేస్తం. ఈ ఏడాది ఆర్థిక మాంద్యం తీవ్రంగా ఉంది. పరిస్థితుల్లో మార్పు వస్తే ప్రతిపాదనలు పెంచుకోవచ్చు. లేకపోతే సర్దుకోవాలె. కేంద్రం కార్పొరేట్‌‌ ట్యాక్స్‌‌ 10 శాతం తగ్గించినా ఫలితంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నులవాటా ఇంకా తగ్గొచ్చు. భూములు అమ్మితే రూ.10 వేల కోట్లు వస్తాయని ఆశిస్తున్నం. ఒకవేళ రాకపోతే ప్రజలకు చెబుతం. దేశాన్ని చుట్టుముట్టిన మాంద్యం ప్రభావం రాష్ట్రాలన్నింటిపై ఉంది. రేపుమాపు ఎట్లుంటదో తెల్వదు. అప్పులు ఎందుకు తెచ్చామో చెప్పాల్సిన బాధ్యత నామీద ఉంది. కాంగ్రెస్‌‌ విధానాలతోనే రాష్ట్రాలన్నీ చతికిలపడ్డయి. పాలకులు మారితే పథకాల పేర్లు మారుతయి తప్ప ప్రజల తలరాతలు మారలేదు.

జాయింట్​ చెక్​ పవర్​ కొనసాగుతది

పీఎం, సీఎంకు కూడా లేని చెక్‌‌పవర్‌‌ ఇన్నాళ్లు సర్పంచ్‌‌లకు ఉండేది. పంచాయతీలను బాగుచేసేందుకే కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చినం.  సర్పంచ్‌‌, ఉపసర్పంచ్‌‌లకు జాయింట్ చెక్‌‌పవర్ కొనసాగుతది. ఉప సర్పంచ్‌‌లను కలుపుకొని వెళ్లాలని సర్పంచ్‌‌లను కోరినం. టీఆర్‌‌ఎస్ నుంచే 90 శాతం సర్పంచ్‌‌లు ఉన్నరు. అయినా డబ్బులు మంచిగా ఖర్చు చేయాలనే ఇలా చేసినం. మంత్రికి ఉండే స్టే అధికారం తీసేసినం. కొత్త పంచాయతీరాజ్‌‌ చట్టం ప్రకారం కేటాయించిన నిధులను ఖచ్చితంగా పంచాయతీలకు ఇవ్వాల్సిందే. ఒక సంవత్సరం నిధులు ల్యాప్స్‌‌ అయితే వాటిని ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌‌లాగే తర్వాతి సంవత్సరానికి ఫార్వార్డ్‌‌ చేయాల్సిందే. 500 జనాభా ఉన్న చిన్న గ్రామాలకు కూడా కనీనం రూ.8 లక్షలు వస్తాయి.

ముస్లిం రిజర్వేషన్లకు మరో సారి తీర్మానం

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయమై గత ప్రభుత్వంలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపినం. ఇంతవరకు కేంద్రం ఆ తీర్మానంపై స్పందించలేదు. ఇంకోసారి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.అవసరమైతే అఖిలపక్ష నేతలతో ఢిల్లీ వెళ్దాం.

రైతులు అప్పు కట్టుకోండి..మేం విడతల్లో డబ్బులిస్తం

రైతులకు 4 విడతల్లో లక్షలోపు రుణాలు మాఫీ చేస్తమని చెప్పినం. కాంగ్రెస్‌‌ ఒక్క విడతలో రూ.2 లక్షల రుణమాఫీ అని చెప్పింది. అయినా జనం మాకే ఓట్లేసిన్రు. కటాఫ్‌‌ డేట్‌‌ వరకు రైతుల అప్పుల లెక్కంతా మా దగ్గర ఉంది. త్వరలోనే ఎంత అప్పు మాఫీ అవుతుందో చెప్తూ లేఖలు పంపుతం. రైతులు తమ అప్పులు ముందే కట్టుకోవాలె. 4 విడతల్లో ఆ డబ్బును నేరుగా అందజేస్తం.

25న కానిస్టేబుల్ రిజల్ట్స్​

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏనాడు జరగని విధంగా ఒకేసారి 18 వేల మంది పోలీస్‌‌  రిక్రూట్‌‌మెంట్‌‌కు నోటిఫికేషన్‌‌ ఇచ్చినం. కానిస్టేబుల్ పరీక్షల తుది ఫలితాలను దాదాపు ఈ నెల 25వ తేదీన విడుదల చేస్తం. వీళ్లందరికి మన రాష్ట్రంలో ట్రైనింగ్‌‌ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌‌తో మాట్లాడితే అక్కడ నాలుగు వేల మందికి ట్రైనింగ్‌‌ ఇచ్చేందుకు అంగీకరించిన్రు. మిగతా 14 వేల మందికి ఇక్కడే ట్రైనింగ్‌‌ ఇస్తం.

కౌలుదారులు.. కిరాయిదారులే

ఇది మోడ్రన్‌‌ ఎరా. 1940 నాటి మాటలు మాట్లాడుతమంటే చెల్లవ్‌‌. జాగీర్దార్ వ్యవస్థ ఉన్నప్పుడు కౌలుదారులు వేరు. ఇప్పుడున్నవాళ్లు కౌలుదారులు కాదు. కిరాయిదారులు. కౌలుదారు మారుతుంటాడు. భూమికి, కౌలురైతుకు పర్మనెంట్ రిలేషన్ ఉండదు. రైతుల సూచనలతోనే ఈ నిర్ణయం తీసుకున్నం. ఇది చెప్పే ఎన్నికలకు పోతే మమ్మల్ని ఇక్కడ, మిమ్నల్ని అక్కడ కూర్చోబెట్టిన్రు.

వాళ్లే ఉద్యోగాలు ఇచ్చి ఉంటే..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులు, రైతులు, మైనార్టీలు, బీసీలను విస్మరించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కేంద్రంలో బీసీలకు శాఖను ఏర్పాటు చేయాలని నేను అప్పటి ప్రధాని మన్మోహన్‌‌సింగ్‌‌, ఇప్పటి ప్రధాని నరేంద్రమోడీని కలిసి రిప్రంజంటేషన్‌‌ ఇచ్చిన. మహిళా రిజర్వేషన్‌‌ బిల్లు, కార్మికుల్లో అసంతృప్తి, ఆర్థికమాంద్యం.. ఇవన్నింటికీ కేంద్ర ప్రభుత్వాలే కారణం. గతంలో పాలించిన వాళ్లు ఇంటికో ఉద్యోగం ఇచ్చి ఉంటే మేం  ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితే తలెత్తేది కాదు.

అనుభవదారు కాలమ్‌‌ నేనే తీయించిన

పాస్​పుస్తకాల్లో అనుభవదారు కాలమ్‌‌ను తీసేయాలని సీఎంగా నేనే ఆదేశించిన. అనుభవదారు కాలమ్‌‌ ఉండాల్సిన అక్కర్లేదు. ఇది చాలా దుర్మార్గమైందని చెప్పిన. కౌలుదార్లను మేం గుర్తించదల్చుకోలేదు. కౌలు అనేది రైతుకు, కౌలుదారుకు సంబంధించినది. కౌలు అంటే రెంట్‌‌ తీసుకునేది. నేను కూడా కాపోన్నే.. నాకు కూడా భూమి ఉంది. మేము అగ్వకు దొరికినమా రైతులం. బంజారాహిల్స్‌‌లో ఇచ్చే బంగ్లాకు ఎందుకు రాయరు అనుభవదారుడి పేరు. వరంగల్‌‌, కరీంనగర్‌‌ పట్టణాల్లో రెంట్‌‌కు  ఇచ్చే బిల్డింగ్‌‌లో ఎందుకు రాయరు కిరాయిదారుడి పేరు?. అక్కడ లేనిది ఇక్కడ ఎందుకు రాస్తరు. భూసంస్కరణల అమలు జరగని రోజుల్లో భూమంతా  భూస్వాములు, జమీందార్ల గుప్పిట్లో ఉన్నప్పుడు కౌలుదారుల చట్టం తెచ్చి.. వాళ్లకు ఆ రక్షణ ఉండాలని అనుభవదారుల కాలమ్‌‌ పెట్టిన్రు. ఇప్పుడు బడా భూస్వాములు ఎక్కడున్నరు?  కేవలం 20 శాతం భూముల్లోనే అప్పర్‌‌ క్యాస్టోళ్లు ఉన్నరు. 80 శాతం భూముల్లో దళిత, గిరిజన, బీసీ వర్గాల చేతుల్లోనే ఉన్నయి. లెక్కలు కూడా ఇస్తం.

వీఆర్వోలేమైనా ఆకాశంల నుంచి వచ్చిండ్రా?

ఎక్కడ చట్టాలు మార్చాలో అక్కడ మారుస్తం. ఎవలకు భయపడం. వీఆర్వోలను మేం ఉంచుతామని చెప్పినమా? తీసేస్తమని చెప్పినమా ? ప్రభుత్వమే  ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. వీఆర్వోలను తొలగించాల్సి వస్తే.. తొలగిస్తం. ఎవలకు భయపడం. వీఆర్వోలేమైనా ఆకాశంల నుంచి వచ్చిండ్రా? పటేల్, పట్వారీ వ్యవస్థ పోలేదా? ఆ వ్యవస్థ పోతే వీళ్లొచ్చిండ్లు. ఆ వ్యవస్థ ఫ్యూడలిజానికి మార్క్‌‌గా ఉంది. ప్రజలను పీడిస్తున్నరనే డైలాగ్‌‌లు కదా పట్వారీ వ్యవస్థ తీసేసినప్పుడు చెప్పింది. మరి వీళ్లు అంతకంటే డబుల్‌‌, త్రిబుల్‌‌ అయితే అప్పుడేం చేయాలె? చట్టాలను రూపొందించాల్సింది శాసనసభే. ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిక్టెట్ చేస్తామంటే ఊరుకోం. కుక్క తోకను ఊపుతుందా.. తోక కుక్కను ఊపుతుందా? అర్థం చేసుకోవాలి. ఉద్యోగులు చెప్పినట్టే చేసే దానికి చట్టసభలు దేనికి? ఎవరో చెప్పింది నమ్మి పిచ్చి సమ్మెలు చేస్తే రెవెన్యూ ఉద్యోగులే రోడ్డునపడుతరు. ధరణి వెబ్‌‌సైట్ ఇప్పటివరకు లాంచ్‌‌ కాలేదు. దిస్‌‌ అండర్‌‌ డిస్కషన్‌‌.

ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిక్టేట్​ చేస్తామంటే ఊరుకోం. ప్రపంచంలో ఎక్కడా ఇట్ల లేదు. కుక్క తోకను ఊపుతుందా.. తోక కుక్కను ఊపుతుందా? అర్థం చేసుకోవాలి. ఉద్యోగులు చెప్పినట్టే చేసే దానికి చట్టసభలు దేనికి? చట్టం చేసే ముందు ఉద్యోగులతో మాట్లాడుతం. ఎవరో ఏదో చెబితే ఆ మాటలు నమ్మి పిచ్చి సమ్మెలు చేస్తే రెవెన్యూ ఉద్యోగులే రోడ్డునపడుతరు.

మీకు తెల్వదు మా కథ.. మా దగ్గర ఇంకో రెండు, మూడు స్కీమ్‌‌లు ఉన్నయి.  అవి కానీ పెడితే ఇక మీ(ప్రతిపక్షాల) పని ఖతమే. నేను ఆషామాషీగా చెప్పలేదు. వాస్తవాలతో కూడుకున్న విషయాలను చెప్పిన. ఇప్పుడున్న టర్మ్‌‌ కాక మరో రెండు టర్మ్‌‌లు మేమే గెలుస్తం. ఎవ్వలకు అనుమానం అవసరం లేదు. అందులో ఏం భ్రమలేదు. భ్రమపడుతున్నది భట్టి విక్రమార్క అంతే.