ముంబైలోని కొన్ని క్లస్టర్లలో థర్డ్ వేవ్

ముంబైలోని కొన్ని క్లస్టర్లలో థర్డ్ వేవ్
  •    దేశ రాజధానితో పాటు ముంబైలోని కొన్ని క్లస్టర్లలో థర్డ్ వేవ్
  •     8 రాష్ట్రాల్లో 10 శాతంపైనే పాజిటివిటీ రేటు నమోదు 
  •     కరోనా కట్టడికి ఆయా రాష్ట్రాలు చర్యలు తీస్కోవాలె: కేంద్రం

న్యూఢిల్లీ/ముంబై: మన దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైనట్టు కనిపిస్తోందని మహారాష్ట్ర కొవిడ్ టాస్క్ ఫోర్స్ మెంబర్ డాక్టర్ రాహుల్ పండిట్ చెప్పారు. ఇప్పటికే ఢిల్లీ, ముంబైలోని కొన్ని క్లస్టర్లలో థర్డ్ వేవ్ మొదలైందని తెలిపారు. దేశంలో కరోనా సిచువేషన్ పై గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలో కేసులు రెట్టింపు అవుతున్న తీరు చూస్తుంటే, అది ఒమిక్రాన్ వల్లేనని అర్థమవుతోంది. కానీ మనం ఒమిక్రాన్ వ్యాప్తిని తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్టుల మీదనే ఆధారపడుతున్నాం. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే ఒమిక్రాన్, డెల్టా రెండింటి వల్ల కేసులు పెరుగుతున్నట్టు అనిపిస్తోంది” అని రాహుల్ చెప్పారు. కేసులు పెరుగుతున్నప్పటికీ, హాస్పిటలైజేషన్ రేటు తెలుసుకోవడానికి 10 రోజుల వరకు వేచి చూడాల్సి ఉంటుందని తెలిపారు. హాస్పిటళ్లపై ఒత్తిడి పెరిగినప్పుడే లాక్ డౌన్ పై రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. జనం కరోనా రూల్స్ పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. కాగా, ముంబైలో గత 24 గంటల్లోనే 198 ఒమిక్రాన్​ కేసులు, 3,671 డైలీ కేసులు నమోదయ్యాయి.  బుధవారం (2510) కంటే ఒక్కరోజులోనే 46 శాతం ఎక్కువయ్యాయి. వారం రోజుల్లోనే ఐదు రెట్లు పెరిగాయి.

ఢిల్లీలో కమ్యూనిటీ స్ర్పెడ్ 
దేశ రాజధాని ఢిల్లీలో ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేనోళ్లకూ ఒమిక్రాన్ సోకిందని హెల్త్ మినిస్టర్ సత్యేందర్ జైన్ గురువారం మీడియాతో చెప్పారు. ఇటీవల జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపిన శాంపిళ్లలో 46 శాతం ఒమిక్రాన్ కేసులు ఉన్నట్లు తేలిందని వెల్లడించారు. దీన్ని బట్టి ఢిల్లీలో కమ్యూనిటీ స్ర్పెడ్ మొదలైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఒమిక్రాన్ సహా కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం 923 కరోనా కేసులు నమోదు కాగా, గురువారం 1,313 కేసులు నమోదయ్యాయి. 6 నెలల తర్వాత పాజిటివిటీ రేటు 1.29 శాతానికి పెరిగింది. ఇక ఒమిక్రాన్ కేసులు 263కు పెరిగాయి. 

తీవ్రత తగ్గించేందుకే థర్డ్ డోస్: ఐసీఎంఆర్ 
కరోనా తీవ్రతను తగ్గించడానికే వ్యాక్సిన్ బూస్టర్‌‌ డోసు ఉపయోగపడుతుందని ఐసీఎంఆర్  డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ చెప్పారు. బూస్టర్ డోస్ వల్ల ఇన్‌ఫెక్షన్, ఆసుపత్రిలో చేరికలు, మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టే చాన్స్ ఉందన్నారు. వ్యాక్సిన్ ఇమ్యూనిటీ 9 నెలల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్నా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఏ దేశంలో తయారైన వ్యాక్సిన్ అయినా ఇన్‌ఫెక్షన్‌ రాకుండా ఆపలేవన్నారు. అయితే, బూస్టర్ డోస్ తీసుకుంటే ఇన్‌ఫెక్షన్‌ తీవ్రతను, మరణాలను తగ్గించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.