- గాంధీభవన్‌లో మెదక్ నేతల ఆందోళన
- కమిటీలను రద్దు చేయాలని డిమాండ్
- తనకు ఎలాంటి షోకాజ్ రాలేదన్న మల్లు రవి
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో మండల కమి టీల లొల్లి ఆగడం లేదు. మూడు రోజులుగా వివాదం కొనసాగుతున్నది. శనివారం మెదక్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో గాంధీభవన్‌కు తరలివచ్చారు. నియోజకవర్గంలో నియమించిన మండల కమిటీలను వెంటనే రద్దు చేయాలంటూ ధర్నాకు దిగారు. మెదక్ డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డిని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. కోవర్ట్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఆయన్ను తొలగించాలన్నారు. ‘సేవ్ కాంగ్రెస్’ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడిని తొలగించాలని శుక్రవారం పలువురు నేతలు డిమాండ్ చేయగా.. శనివారం మరికొందరు నేతలొచ్చి తమ డిమాండ్‌ను వెనక్కు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షుడినే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవికి ఈ మేరకు వినతి పత్రం ఇచ్చారు.
ఖానాపూర్ ఆర్డర్‌పై మల్లు రవి క్లారిటీ
ఖానాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాల విషయంలో నెలకొన్న వివాదంపై మల్లు రవి స్పందించారు. తొలుత వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఆర్డర్ ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే అందులో మార్పులు చేయాలన్న సూచనల మేరకే.. నియామకాలను మారుస్తూ రెండో ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. అందరితో కో ఆర్డినేట్ చేసుకునే ఈ ఆర్డర్‌ను జారీ చేశామన్నారు. తనకు ఏఐసీసీ నుంచి షోకాజ్ నోటీసులొచ్చాయన్న వార్తలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి షోకాజ్ నోటీసు రాలేదని చెప్పారు.

