పాట్నా: బీహార్ రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. నితీష్ కుమార్ 20 ఏళ్ల అధికార పరంపరకు తెరదించుతూ నూతన అధ్యాయం మొదలైంది. నితీష్ కుమార్ స్థానంలో బీజేపీ నేత, మాస్ లీడర్‌గా పేరొందిన సామ్రాట్ చౌదరీ బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2026, ఏప్రిల్ 15న నితీష్ కుమార్ వారసుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తద్వారా బీజేపీ నుంచి బీహార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్న తొలి నేతగా సామ్రాట్ రికార్డు సృష్టించబోతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా సామ్రాట్ చౌదరి గురించి చర్చ మొదలైంది. అసలేవరి సామ్రాట్ చౌదరి..? ఆయన రాజకీయ, వ్యక్తిగత బ్యాగ్రౌండ్ ఏంటి..? బీహార్‌కు తమ తొలి సీఎంగా బీజేపీ అతడినే ఎంపిక చేయడానికి గల కారణమేంటి..? అన్న రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
సామ్రాట్ చౌదరి బ్యాగ్రౌండ్:
మాస్ లీడర్‌గా పేరుగాంచిన సామ్రాట్ చౌదరి బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో 1968 నవంబర్‌లో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి శకుని, తల్లి పార్వతి ఇద్దరూ ఎమ్మెల్యేలుగా పని చేశారు. తారాపూర్ నియోజకవర్గం సామ్రాట్ చౌదరి ఫ్యామిలీకి కంచుకోట. ఇక్కడి నుంచి ఆయన తండ్రి శుకుని ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, అతడి తల్లి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో తమ కుటుంబానికి కంచుకోటైన తారాపూర్ నుంచే సామ్రాట్ చౌదరి కూడా పోటీ చేసి ఘన విజయం సాధించారు.
సామ్రాట్ చౌదరి రాజకీయ జీవితం:
1999లో సామ్రాట్ చౌదరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)తో తన పొలిటికల్ కెరీర్‌ను స్టార్ట్ చేశారు. 2000 సంవత్సరంలో ఖగారియాలోని పర్బట్టా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రబ్రీ దేవి ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆర్జీడీ హైకమాండ్‌తో విభేదాలు రావడం, ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో 2014లో ఆర్జేడీకి రాజీనామా చేసి నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూలో చేరారు. జితన్ రామ్ మాంఝీ కేబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు.
చేరిన మూడేళ్లకే జేడీయూకు గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత 2017లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. ఇక్కడి నుంచి ఆయన పొలిటికల్ కెరీర్ మరో స్థాయికి వెళ్లింది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ఆపై 2023లో బీహార్ బీజేపీ అధ్యక్షుడిగా అంచెలంచలుగా ఎదిగారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో సీఎం నితీష్ కుమార్ డిప్యూటీగా సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టారు. రాజ్యసభకు ఎన్నిక కావడంతో నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్నారు.
సామ్రాట్ చౌదరినే ఎందుకు..?
బీహార్ అంటేనే కుల రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్. ఇక్కడ వెనుకబడిన తరగతుల ఓట్లు అత్యంత కీలకం. బీహార్‌లోని కీలక సామాజిక వర్గమైన కుష్వాహా (కోయిరీ) ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తే సామ్రాట్ చౌదరి. రాష్ట్రంలో యాదవుల తర్వాత అతిపెద్ద వెనుకబడిన వర్గం ఇదే. ఈ వర్గాన్ని దగ్గర చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ సామ్రాట్ చౌదరిని ఎంపిక చేసింది. ఎన్డీఏ మిత్రపక్షమైన జేడీయూ కూడా కుష్వాహాల నుంచి ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలని ప్రతిపాదించింది. అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకున్న బీజేపీ బీహార్ రాష్ట్రానికి తమ పార్టీ తొలి సీఎంగా సామ్రాట్ చౌదరికి అవకాశం కల్పించింది.
శపథం చేశాడు.. దించేశాడు.. గెలిచాడు:
బీహార్ రాజకీయాల్లో సామ్రాట్ చౌదరికి మాస్ లీడర్‌గా పేరుంది. తనదైన విమర్శలు, సవాళ్లు, కౌంటర్లతో రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాడు. ముఖ్యంగా బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం నితీష్ కుమార్‌పై విమర్శల వర్షం కురిపించేవాడు. ఈ క్రమంలోనే 2022లో సామ్రాట్ చౌదరి ఓ శపథం చేశాడు. నితీష్ కుమార్‌ను అధికారం నుంచి గద్దె దించే వరకు తాను తన కాషాయ తలపాగాను (బీహార్‌లో దీనిని మురేఠా అని పిలుస్తారు) తొలగించబోనని సవాల్ చేశాడు.
2024 జూలైలో బీహార్‌లో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్యను సందర్శించి శ్రీరామునికి తలపాగా సమర్పించి, గుండు చేయించుకుని, సరయూ నదిలో ఆచారబద్ధంగా స్నానం చేసి శపథం నెగ్గించుకున్నాడు సామ్రాట్ చౌదరి. చివరకు సీఎం నితీష్ కుమార్ వారసుడిగా బీహార్ సీఎంగా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాడు.

