హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్‌‌‌‌‌‌‌‌లో దారుణం..చంపి.. చెత్తకుండీలో వేసి తగలబెట్టారు

హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్‌‌‌‌‌‌‌‌లో దారుణం..చంపి.. చెత్తకుండీలో వేసి తగలబెట్టారు
  •     హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్‌‌‌‌‌‌‌‌లో దారుణం
  •     95 శాతానికి పైగా కాలిపోయిన మహిళ శవం 
  •     వేరే చోట మర్డర్​చేసి ఇక్కడ పడేసినట్టు అనుమానం  
  •     ఏడాది కింద పక్కనే ఉన్న డీబీఆర్ మిల్స్ లో మహిళ అస్థి పంజరం లభ్యం 
  •     ఆ మిస్టరీ వీడకముందే మరో భయానక ఘటన

హైదరాబాద్ సిటీ/ముషీరాబాద్, వెలుగు: హైదరాబాద్​లోని లోయర్ ట్యాంక్ బండ్‌‌ ఏరియాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను చంపేసి చెత్త కుండీలో వేసి తగలబెట్టారు. బుధవారం రాత్రి 10:30 నుంచి 11:30 గంటల మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. చెత్త కుండీలో నుంచి మంటలు వస్తుండడాన్ని గమనించిన స్థానికులు దగ్గరకు వెళ్లి చూడగా కాలిపోతున్న శవం కనిపించింది. దీంతో దోమలగూడ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఫైర్​సిబ్బందితో వచ్చి మంటలను ఆర్పారు. ఆ డెడ్​బాడీ మహిళదిగా పోలీసులు గుర్తించారు. అప్పటికే 95 శాతం కాలిపోయింది. మృతురాలి వయసు 35 నుంచి 45 ఏండ్ల మధ్య ఉంటుంది. మహిళ పండ్లకు పాన్, గుట్కా తిన్న ఆనవాళ్లు ఉన్నాయి. కాలిపోయిన ఒక చీర, లో దుస్తులు చెత్తకుండీలో ఉన్నాయి. డెడ్ బాడీని పోలీసులు గాంధీ మార్చురీకి తరలించారు. మహిళను వేరే ప్రాంతంలో చంపి.. ఆనవాళ్లు దొరకకుండా ఇక్కడ పడేసి నిప్పు పెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మహిళ డెడ్​బాడీని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారన్న విషయాలు తెలుసుకోవడానికి పలు చోట్ల సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్​ రిపోర్ట్​ వస్తే మరణంపై పూర్తి వివరాలు చెప్పగలమని పోలీసులు స్పష్టం చేశారు.  

అస్తి పంజరం కేసు ఇంకా తేలలే..

మహిళ డెడ్​బాడీ దొరికిన ప్రాంతానికి కేవలం 500 మీటర్ల దూరంలోని డీబీఆర్‌‌‌‌ మిల్స్ ప్రాంగణంలో గల వాటర్ సంప్‌‌లో 2025 జూన్​లో గుర్తు తెలియని మహిళ అస్థిపంజరం బయటపడింది. ఆ మహిళ వయస్సు 25 నుంచి 30 ఏండ్ల మధ్య ఉంటుందని, మృతదేహం అక్కడ పడేసి దాదాపు ఆరు నెలలు దాటి ఉంటుందని పోలీసులు గుర్తించారు. అస్తిపంజరంపై ఉన్న షర్ట్​జేబుపై ‘శ్రీ వివేకానంద హెచ్ఎస్’ అని ఉంది. అది వివేకానంద​హైస్కూల్​అని భావించిన పోలీసులు ఆ పేరుపై ఉన్న స్కూళ్లలో ఎంక్వైరీ చేయగా ఎక్కడా మిస్సింగ్​కేసులు ఉన్నట్టు తేలలేదు. ఫోరెన్సిక్​ రిపోర్ట్ నూ పోలీసులు వెల్లడించలేదు. ఏడాది దాటినా ఈ కేసులో మృతురాలు ఎవరో ఇప్పటికీ గుర్తించకలేకపోయారు. ఇంతలోనే గురువారం మరో మహిళ లోయర్ ట్యాంక్ బండ్ ఏరియాలో చెత్త కుండీలో  కాలిన శవంగా కనిపించింది. 

ఇక్కడే ఎందుకు జరుగుతున్నాయి ?

లోయర్ ​ట్యాంక్​బండ్ ​ప్రాంతంలో రాత్రి ఏడు దాటితే చిమ్మ చీకటి అలుముకుంటుంది. పక్కనే ఉన్న డీబీఆర్​మిల్స్ మూతపడి నిర్మానుష్యంగా మారింది. దీంతో రాత్రయితే ఈ ఏరియా నుంచి నడిచి వెళ్లాలంటేనే చాలా మంది భయపడుతారు. పెట్రోలింగ్​పోలీసులు కూడా తక్కువగానే వస్తుంటారని.. దీంతో బయటి వ్యక్తులు అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా దగ్గర్లోని బస్తీలు, నాలా వెంబడి ఉండేవారు రాత్రి పూట మద్యంమత్తులో తరచూ గొడవలకు దిగుతుంటారు. చిన్న చిన్న ఆర్థిక లావాదేవీలు, పాత కక్షలతో ఒకరిపై ఒకరు కత్తులు, రాళ్లతో దాడి చేసుకున్న సంఘటనలూ ఉన్నాయి. ఈ ఘర్షణల్లో తీవ్రంగా గాయపడి మృతి చెందిన వారిని లేదా స్పృహ కోల్పోయిన వారిని సమీపంలోని నాలాల్లోకి  లేదా నిర్మానుష్య ప్రదేశాలకు లాకెళ్లి పడేసిన ఉదంతాలు పోలీసు రికార్డుల్లో ఉన్నాయి.