MBBS ఫీజులపై జోక్యం చేసుకోం.. టీఏఎఫ్‌‌‌‌ఆర్సీని ఆశ్రయించండి..విద్యార్థులకు హైకోర్టు సూచన

MBBS ఫీజులపై జోక్యం చేసుకోం.. టీఏఎఫ్‌‌‌‌ఆర్సీని ఆశ్రయించండి..విద్యార్థులకు హైకోర్టు  సూచన

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఎంబీబీఎస్‌‌‌‌ కోర్సుకు సంబంధించి ఐదేళ్ల ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తున్నారంటూ దాఖలైన రిట్ పిటిషన్‌‌‌‌లో తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఈ అంశం ఇప్పటికే సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ప్రస్తుతం విచారణ సాధ్యం కాదని జస్టిస్ జువ్వాడి శ్రీదేవి స్పష్టం చేశారు. 

అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌‌‌‌ఆర్సీ)ని ఆశ్రయించవచ్చని సూచించారు. వచ్చిన ఫిర్యాదులను చట్టప్రకారం వీలైనంత త్వరగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ పిటిషన్‌‌‌‌ను ముగించారు. మెడికల్ విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం ఈ పిటిషన్ దాఖలు చేసింది. 

కోర్సు వ్యవధి నాలుగున్నరేళ్లే కాబట్టి అదనంగా పూర్తి ఫీజు వసూలు చేయడం చట్టవిరుద్ధమని వాదించారు. జీవో-5 ప్రకారం మొత్తం ఫీజును ఐదు సమాన విడతల్లో చెల్లించే విధానమే అమల్లో ఉందని, దీనిపై సుప్రీంకోర్టులో స్టే కొనసాగుతోందని విశ్వవిద్యాలయం, కాలేజీల తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు.