- అన్ని రోడ్లను ఒకే గొడుగు కిందకి తేవాలి: సీఎం రేవంత్
- టీడీఆర్‌పై ప్రత్యేక కమిటీ.. మానవ ప్రమేయం లేకుండా అంతా ఆన్‌లైన్
- ల్యాండ్ పూలింగ్‌లో మధ్యవర్తుల జోక్యాన్ని సహించం
- ఓఆర్ఆర్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ఆగ్రహం.. కఠిన పర్యవేక్షణకు ఆదేశాలు
- హెచ్ఎండీఏ, హెచ్ఆర్‌డీసీఎల్ అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మహానగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి తగ్గట్టుగా రోడ్డు నెట్‌వర్క్‌ను సమగ్రంగా ప్రక్షాళన చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. గురువారం ఎంసీహెచ్‌ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో హెచ్ఎండీఏ, హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌ఆర్‌డీసీఎల్) అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగర భవిష్యత్ ప్రగతి అంతా ఇక్కడి రోడ్ల అభివృద్ధిపైనే ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. రోడ్లకు సంబంధించిన ప్లానింగ్, నిర్మాణం, నిర్వహణ, భూసేకరణ, బ్యాంకింగ్ రుణాలు తదితర అంశాలన్నింటినీ ఒకే ఏకీకృత డిజిటల్ సిస్టమ్‌లోకి తీసుకురావాలని ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డులతోపాటు నగరం లోపల ఉన్న ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, ఇతర అన్ని కనెక్టివిటీ రోడ్లు ఈ నూతన వ్యవస్థ పరిధిలోకి వచ్చేలా పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. సమీక్ష సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్వహణ తీరుపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ సరిగా లేదని, కాంట్రాక్టర్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓఆర్ఆర్‌పై ఎక్కడపడితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నిలపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యాన్ని ఏమాత్రం ఉపేక్షించవద్దని, ఓఆర్ఆర్ నిర్వహణను అధికారులు ఎప్పటికప్పుడు ఫీల్డ్ లెవెల్‌లో పర్యవేక్షించాలని ఆదేశించారు.
దళారుల ప్రమేయం లేకుండా
పారదర్శకంగా పనులు..
టౌన్ ప్లానింగ్‌లో పారదర్శకత పెంచేందుకు టీడీఆర్ వ్యవస్థపైన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇకపై ప్రభుత్వం సేకరించిన భూములకు మాత్రమే టీడీఆర్ జారీ చేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను మొత్తం మానవ జోక్యం లేని విధంగా ఆన్‌లైన్ చేయాలని, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా టెక్నాలజీ ఆధారిత వ్యవస్థను రూపొందించాలని సూచించారు. ల్యాండ్ పూలింగ్‌లో మధ్యవర్తుల జోక్యాన్ని ఎంతమాత్రం సహించవద్దని, దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
రేడియల్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి..
నగర విస్తరణకు తగ్గట్టుగా రేడియల్ రోడ్ల నిర్మాణాన్ని అత్యంత వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా కొంగరకలాన్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు నిర్మిస్తున్న రేడియల్ రోడ్– 1 పనులను ఎలాంటి అలసత్వం వహించకుండా డిసెంబర్ 9 నాటికి కచ్చితంగా పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించారు. రేడియల్ రోడ్ల నిర్మాణంలో ఎదురవుతున్న భూసేకరణ విచారణలు, ఇతర అడ్డంకులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ చిక్కులను నివారించేందుకు బద్వేల్ ఇంటర్చేంజ్ ట్రంపెట్ అత్యంత కీలకం కానుందని, అక్కడ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. నగరంలో ఎలివేటెడ్ కారిడార్స్ 1, 11 పనులను వేగవంతం చేయాలని, ఎలివేటెడ్ కారిడార్ 111 బంజారా హిల్స్ నుంచి శిల్పా లేఅవుట్ రోడ్ పనులను త్వరగా మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, అధికారులు ఎక్కడా అలసత్వం చూపించవద్దని సీఎం హెచ్చరించారు. రోడ్ల ప్లానింగ్, డిజైనింగ్ నిర్మాణంలో ట్రాఫిక్ విభాగాన్ని కూడా భాగస్వాములను చేయాలని, వారి సూచనలతోనే ప్రణాళికలు ఖరారు చేయాలని చెప్పారు.
