- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కూసుమంచి/ఖమ్మం రూరల్, వెలుగు : నకిలీ పాస్ పుస్తకాలను త్వరలోనే రద్దు చేసి, అర్హులైన ప్రతి రైతుకు న్యాయబద్ధంగా పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. కలెక్టర్ దివాకర టీఎస్, కమిషనర్ సునీల్ దత్ తో కలిసి గురువారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో తాళ్లగడ్డతండా, పాలేరు, చౌటపల్లి, లింగారంతండా, ఎదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా లింగారం తండాలో రైతు బానోతు రూప్లాకు చెందిన చేనులోకి దిగి అరకపట్టి దున్నారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గతంలో తాను ఎంపీగా ఉన్న సమయంలో చౌటుపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని అనేక అభివృద్ధి పనులు చేశానని, ఇప్పుడు మంత్రిగా మిగిలిన పనులనూ పూర్తి చేసే బాధ్యత తనదేనని అన్నారు. పాలేరు నియోజకవర్గ పరిధిలో భూ రీ-సర్వే ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు.
పేదల సంక్షేమంతో పాటు గ్రామాలు, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల అభివృద్ధే ప్రభుత్వ లభ్యమని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ వెంకట్‌రెడ్డి, డీఎస్ వో చందన్‌కుమార్, డీవైఎస్‌వో సునీల్‌రెడ్డి, ఏదులాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కమీషనర్ శ్రీనివాస్, ఆర్డీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
