మా నాన్న చంపాలని చూస్తున్నడు.. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే  ప్రకాశ్ గౌడ్‌‌పై కొడుకు ఆరోపణలు

మా నాన్న చంపాలని చూస్తున్నడు.. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే  ప్రకాశ్ గౌడ్‌‌పై కొడుకు ఆరోపణలు
  •    ప్రేమించిన యువతిని పెండ్లి చేసుకోవడం ఆయనకు ఇష్టం లేదు  
  •     పోలీసులకు కంప్లయింట్​ ఇచ్చినా తీసుకోవట్లేదని వెల్లడి
  •     సంతోష్ ​ప్రేమించిన యువతి తల్లి అరెస్ట్​ 

గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్​గౌడ్​ తనను చంపించాలని చూస్తున్నాడని సొంత కొడుకు సంతోష్ ​గౌడ్ ​సంచలన ఆరోపణలు చేశాడు. తాను ప్రేమించిన అమ్మాయిని పెండ్లి చేసుకోవడం ఇష్టం లేకనే తన తండ్రి ఇలా చేస్తున్నాడని తెలిపాడు. తనకు, తాను పెండ్లి చేసుకోబోయే అమ్మాయికి, కాబోయే అత్తకు ఆయన నుంచి ప్రాణ హానీ ఉందని రక్షించాలంటూ నార్సింగి పోలీస్ ​స్టేషన్ ​మెట్లెక్కాడు. పోలీసులు ఫిర్యాదు ​తీసుకోకపోవడంతో సీపీ ఆఫీసులో కంప్లయింట్​ఇస్తానని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా, ఈ కేసులో పెట్టుబడుల పేరుతో డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిందనే ఆరోపణలతో సంతోష్​ గౌడ్​ ప్రేమించిన యువతి తల్లిని పోలీసులు అరెస్ట్​ చేయడం చర్చనీయాంశంగా మారింది.

రౌడీలతో దాడి చేయించాడు

గురువారం పుప్పాల్‌‌గూడలో తనకు కాబోయే అత్తమ్మ రూపారెడ్డి ఇంట్లో సంతోష్ ​మీడియాతో మాట్లాడారు. రూపారెడ్డి కుమార్తెను తాను ప్రేమించానని, ఆమెను వివాహం చేసుకోవాలన్న తన నిర్ణయాన్ని కుటుంబసభ్యులు అంగీకరించడం లేదన్నారు. దీంతో గత నెలలో ఆ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నానని, అప్పటి నుంచి అత్తగారింట్లోనే ఉంటున్నట్టు చెప్పాడు. ఇది నచ్చని తన తండ్రి ప్రకాశ్​గౌడ్ కాబోయే అత్తమ్మ రూపారెడ్డి ఇంటిపై 40 మంది రౌడీలతో దాడి చేయించాడని ఆరోపించాడు. ఇంటి డోర్లు పగలగొట్టించాడని, తమను చంపేస్తామని బెదిరించారని ఆ ఆడియోలు తన వద్ద ఉన్నాయన్నారు. ఎటాక్ చేసిన వారితో పాటు తన తండ్రిపై బుధవారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే తీసుకోలేదన్నారు. తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని అందుకే మీడియా ముందుకు రావాల్సి వచ్చిందన్నారు. తమకు పోలీసు రక్షణ కల్పించి, ఘటనపై విచారణ జరిపించాలని కోరారు.

రూపారెడ్డిపై మోసం కేసు..

పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి పలువురి నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసి మోసం చేసిందంటూ సంతోష్​గౌడ్​ ప్రేమించిన యువతి తల్లిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం పలువురు బాధితులు రూపారెడ్డికి ఇంటికి వెళ్లగా, ఆమె డోర్​వేయడంతో తలుపులు తోసుకుని లోపలకు వెళ్లినట్టు సమాచారం. దీనిపై ఇరు వర్గాలు పోలీస్ ​స్టేషన్‌‌కు వెళ్లాయి. అయితే, అక్కడ రూపారెడ్డి తన ఫిర్యాదును తీసుకోవడం లేదని కమిషనర్‌‌‌‌కు కంప్లయింట్ ​చేస్తానని వెళ్లిపోయారు. తర్వాత కొద్దిసేపటికే రూపారెడ్డిని పోలీసులు అరెస్ట్​ చేశారు. బాధితుల వివరాలను సేకరిస్తున్నామని, మోసం చేసిన మొత్తం ఎంత అనే విషయాన్ని నిర్ధారించి చెప్తామన్నారు. రూపారెడ్డిని న్యాయస్థానం ముందు హాజరుపరిచామని, కోర్టు ఆదేశాల మేరకు చంచల్​గూడకు 14 రోజులు రిమాండ్‌‌కు పంపించామన్నారు.