మోడల్ స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్!..విద్యాశాఖ సరికొత్త ప్రణాళిక

మోడల్ స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్!..విద్యాశాఖ సరికొత్త ప్రణాళిక
  • ప్రీప్రైమరీ నుంచి ఐదో తరగతి వరకు క్లాసులు నిర్వహించాలని యోచన
  • ప్రభుత్వానికి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారుల ప్రతిపాదన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లకు కొత్త కళను తీసుకొచ్చేందుకు విద్యాశాఖ సరికొత్త ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా వీటిని తీర్చిదిద్దేందుకు, ప్రస్తుతం ఉన్న స్టేట్ సిలబస్‌‌‌‌ను మార్చి సీబీఎస్ఈ సిలబస్‌‌‌‌ను అమలు చేయాలని యోచిస్తోంది. అంతేకాకుండా, ప్రస్తుతం ఆరో తరగతి నుంచి ప్రారంభమవుతున్న ఈ బడుల్లో ప్రీప్రైమరీ నుంచి ఐదో తరగతి వరకు కూడా క్లాసులు నిర్వహించాలని భావిస్తోంది. 

తాజాగా ఈ ప్రతిపాదనలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 194 మోడల్ స్కూళ్లు ఉండగా, వీటిలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన సాగుతోంది. దాదాపు 1.10 లక్షల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఒకప్పుడు మోడల్ స్కూళ్లలో సీటు కోసం తీవ్రమైన పోటీ ఉండేది. కానీ, కాలక్రమేణ గురుకులాల సంఖ్య పెరగడం, ప్రైవేట్ స్కూళ్ల వైపు తల్లిదండ్రులు మొగ్గుచూపడంతో అడ్మిషన్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

దీంతో తల్లిదండ్రులను ఆకర్షించాలంటే సీబీఎస్ఈ సిలబస్ ఒక్కటే మార్గమని అధికారులు భావిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియంతోపాటు నేషనల్ సిలబస్ అందుబాటులోకి వస్తే కార్పొరేట్ ఫీజులు భరించలేని మధ్యతరగతి కుటుంబాలు మోడల్ స్కూళ్ల వైపు వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మోడల్ స్కూళ్లు కేవలం హైస్కూల్, ఇంటర్ స్థాయిలోనే ఉన్నాయి. 

అయితే, ప్రైవేట్ స్కూళ్లలో ఎల్‌‌‌‌కేజీ నుంచే పిల్లలను చేరుస్తుండటంతో మోడల్ స్కూళ్లకు ఆరో తరగతి వచ్చేసరికి ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు రావడం లేదు. దీంతో ప్రీప్రైమరీ నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక విభాగాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. అధికారుల ఆలోచన బాగానే ఉన్నా.. దీని అమలుపై ఉపాధ్యాయ వర్గాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.