- తాగునీటి అవసరాల లెక్కలు తీయాలని ఆదేశం..15 రోజుల్లో మరోసారి భేటీ
- ప్రాజెక్టులకు వచ్చే వరదలను బట్టి సాగు అవసరాలపై నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో సరిపడా నీటి లభ్యత లేకపోవడంతో వ్యవసాయానికి సాగునీరిచ్చే పరిస్థితి లేదు. దీంతో ప్రస్తుతం తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఇరిగేషన్శాఖ కార్యదర్శి శ్రీధర్ఆదేశించారు. గురువారం జలసౌధలో సమీకృత జల ప్రణాళిక, నిర్వహణ రాష్ట్ర స్థాయి కమిటీ (స్కివమ్) సమావేశం సెక్రటరీ నేతృత్వంలో జరిగింది.
అందరు సీఈలు తమ అవసరాలను సెక్రటరీ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే చాలా చోట్ల వరి నాట్లు పడిన నేపథ్యంలో నీళ్లివ్వాలని పలువురు సీఈలు అడిగారు. కానీ, ప్రస్తుతం ఎల్లంపల్లి మినహా అన్ని ప్రాజెక్టుల్లోనూ నీటి లభ్యత ఎక్కువగా లేకపోవడంతో.. కొద్దిరోజులు సాగు అవసరాలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉందని కమిటీ అభిప్రాయపడింది. కాబట్టి ఇప్పుడున్న నీళ్లను కేవలం తాగునీటికే ఇవ్వాలని స్పష్టం చేసింది. వచ్చే ఎండా కాలం వరకు తాగునీటి అవసరాలపై అన్ని లెక్కలు సిద్ధం చేయాలని అధికారులను సెక్రటరీ ఆదేశించారు. తాగునీటి అవసరాల కోసం చెరువులను నింపాలని సూచించారు. ప్రాజెక్టులకు వచ్చే వరదలను బట్టి సాగు అవసరాలపై నిర్ణయం తీసుకుందామని స్పష్టం చేశారు. 15 రోజుల్లో మరోసారి మీటింగ్ నిర్వహిద్దామని సూచించారు. ఈలోపు డేటా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
ప్రాజెక్టులు ఇంకా నిండట్లే
ప్రస్తుతం గోదావరి, కృష్ణా బేసిన్‌లలోని ప్రాజెక్టులకు మొన్నటిదాకా వరద బాగానే వచ్చినా.. క్రమంగా తగ్గుతున్నది. ముఖ్యంగా గోదావరి బేసిన్‌లో వరద ప్రవాహం తగ్గిపోయింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు అత్యంత కీలకమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇప్పటికీ చెప్పుకోదగిన స్థాయిలో వరద రాలేదు. ఆ ప్రాజెక్టులో కేవలం 38.8 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. బేసిన్‌లో ప్రస్తుతం మిడ్‌మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లోనే సరిపడా నీళ్లున్నాయి. కానీ, వాటి నుంచి హైదరాబాద్‌సిటీ సహా వరంగల్, కరీంనగర్వంటి జిల్లాలకు తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20.18 టీఎంసీలకుగానూ 17 టీఎంసీల నీళ్లున్నాయి. మిడ్‌మానేరులో 27.55 టీఎంసీలకుగానూ 18.57 టీఎంసీలున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుల్లోని నీటిని ఆచితూచి వాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక, కృష్ణా బేసిన్‌లోనూ దాదాపు అదే పరిస్థితి ఉన్నది. జూరాల ప్రాజెక్టుకు ప్రస్తుతం వరద 2.30 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు లిఫ్ట్‌ల ద్వారా నీటిని ఎత్తిపోస్తూనే దిగువకూ నీటిని వదులుతున్నారు. శ్రీశైలానికి 2.2 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులో 215 టీఎంసీలకుగానూ.. 144 టీఎంసీలే ఉన్నాయి. నాగార్జునసాగర్అయితే డెడ్‌స్టోరేజ్‌కు అతిదగ్గరగా ఉన్నది. ప్రాజెక్టులో ప్రస్తుతం 312 టీఎంసీలకుగానూ.. 137.52 టీఎంసీల నీళ్లున్నాయి. ఇటు కృష్ణాలోనూ జలాలను జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
