నిషేధిత భూముల జాబితా అప్డేట్ షురూ..సర్కారు ఆదేశాలతో కసరత్తు మొదలుపెట్టిన కలెక్టర్లు

నిషేధిత భూముల జాబితా అప్డేట్ షురూ..సర్కారు ఆదేశాలతో కసరత్తు మొదలుపెట్టిన కలెక్టర్లు
  •     సర్కారు ఆదేశాలతో కసరత్తు మొదలుపెట్టిన కలెక్టర్లు
  •     హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలపై మరింత ఫోకస్

హైదరాబాద్/యాదాద్రి, వెలుగు: నిషేధిత భూముల జాబితా (22ఏ) సవరణకు రెవెన్యూ యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. నిషేధిత జాబితాలో ఉన్న భూములు, ఆస్తుల విషయంలో ఏ ఒక్క పేదవారికి, నిజమైన భూహక్కుదారుడికీ అన్యాయం జరగొద్దని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించడంతో కలెక్టర్లు కదిలారు. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు, వివరాలు తెప్పించుకుని నిషేధిత జాబితాను సవరించేందుకు శ్రీకారం చుట్టారు. 22ఏ జాబితాలో అర్హం కాని వాటిని వీలైనంత త్వరగా తొలగించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల శాఖ రికార్డుల ప్రకారం దాదాపు 41.94 కోట్ల చదరపు గజాల వ్యవసాయేతర (నాన్-అగ్రికల్చర్) భూములు, ఆస్తులు 22ఏ నిషేధిత జాబితాలోనే కొనసాగుతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం పేద ప్రజలకు గతంలో కేటాయించిన అసైన్డ్ ఇండ్లు, ప్లాట్లు, శతాబ్దాలుగా నివాసాలు ఉంటున్న గ్రామకంఠం జాగలు, ప్రైవేటు వ్యక్తుల కొనుగోలు పట్టా భూములు కూడా ఈ రికార్డుల్లో నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఎక్కువగా జరుగుతూ, భూముల విలువలు అమాంతం పెరిగిన ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఈ తరహా సమస్యలు అత్యధికంగా నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం ఈ కీలక జిల్లాలపైనే ప్రత్యేక దృష్టి సారించి, సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. సదరు జిల్లాల్లోని కలెక్టర్ల పర్యవేక్షణలో స్పెషల్ టీమ్‌‌‌‌లు ఏర్పాటై, పెండింగ్‌‌‌‌లో ఉన్న దరఖాస్తులను వర్గాల వారీగా వర్గీకరిస్తూ పరిశీలన ప్రక్రియను శరవేగంగా పూర్తి చేస్తున్నాయి.

క్షేత్రస్థాయిలో వెరిఫై చేస్తున్న అధికారులు

ప్రభుత్వ ఆదేశాల మేరకు తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పహాణీలు, పాత సేత్వార్ రికార్డులు, లింక్ డాక్యుమెంట్లు, టైటిల్ డీడ్లను క్షుణ్ణంగా వెరిఫై చేస్తున్నారు. గ్రామకంఠం పరిధిలోకి వచ్చే ఇండ్లు, కాలనీలను సరిచూడటంతో పాటు, గతంలో లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చిన పట్టా కాపీలను ప్రభుత్వ రికార్డులతో సరిపోల్చి చూస్తున్నారు. ఈ తనిఖీల్లో ప్రైవేట్ పట్టా భూములని, లేదా నిబంధనల ప్రకారం క్లియరెన్స్ పొందిన ఆస్తులని తేలితే, వాటి యజమానుల వివరాలను, ఇంటి నంబర్లను 22ఏ జాబితా నుంచి తొలగించడానికి వీలుగా ప్రత్యేక నివేదికలు తయారు చేస్తున్నారు. ధరణి పోర్టల్, రిజిస్ట్రేషన్ల డేటాబేస్ రెండింటిలోనూ ఒకే రకమైన సమాచారం ఉండేలా రికార్డులను అప్‌‌‌‌డేట్ చేస్తున్నారు. దశాబ్దాలుగా ఉన్న భూ వివాదాలకు, రిజిస్ట్రేషన్ల అవరోధాలకు స్వస్తి పలికి, ప్రజలకు తమ సొంత ఆస్తిపై పూర్తి చట్టబద్ధమైన హక్కులు కల్పించడమే ఈ రీ-వెరిఫికేషన్ ప్రక్రియ ప్రధాన లక్ష్యమని అధికారులు వెల్లడిస్తున్నారు. అర్హులైన బాధితులు సమర్పించిన పత్రాలను మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి సబ్‌‌‌‌ డివిజనల్ అధికారుల వరకు ప్రతీ దశలోనూ పునఃపరిశీలన చేస్తున్నారు. ఏ ఒక్క ప్రభుత్వ లేదా సీలింగ్ భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతూనే, నిజమైన లబ్ధిదారులు, ప్రైవేట్ భూ యాజమానులకు ఎలాంటి నష్టం జరగకుండా తుది జాబితాలను క్రమబద్ధీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే వేలాది కుటుంబాలకు తమ ఆస్తులను అమ్ముకునేందుకు లేదా బ్యాంకు రుణాలు పొందేందుకు మార్గం సుగమం కానుంది. జిల్లాల వారీగా సేకరించిన ప్రతిపాదనలను కలెక్టర్ల ద్వారా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ (సీసీఎల్​ఏ) కార్యాలయానికి పంపి, ఆమోదం పొందిన వెంటనే రిజిస్ట్రేషన్ల శాఖ పోర్టల్ నుంచి 22ఏ ఆంక్షలను తొలగించడానికి చర్యలు వేగవంతం చేశారు.