నర్సంపేట, వెలుగు: ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న రూ.14 లక్షల విలువైన 28 కిలోల ఎండు గంజాయిని నర్సంపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి తెలిపారు. నర్సంపేట శివారులోని మహబూబాబాద్ హైవేపై వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయితో వస్తున్న బొలెరో వాహనాన్ని పట్టుకున్నారు. వాహనం అడుగు భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్స్‌లో గంజాయి ప్యాకెట్లను దాచి తరలిస్తున్నట్లు గుర్తించారు.
ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా నుంచి గంజాయిని తీసుకొస్తున్న అమృత బైద్వాయ్, పుజూర్ రాయ్‌ను అరెస్ట్ చేశారు. తహసీల్దార్ రవిచంద్రారెడ్డి సమక్షంలో పంచనామా నిర్వహించి నిందితులను కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు తరలించారు.
మరిపెడలో ఐదుగురు అరెస్ట్..
మరిపెడ: ఒడిశా నుంచి నల్గొండకు గంజాయి తరలిస్తున్న ఐదుగురిని మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ఎల్.పవన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో వస్తున్న ఐదుగురు యువకులు పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేశారు.
కారును ఆపి తనిఖీ చేయగా డ్రైవర్ సీటు కింద రూ.1.12 లక్షల విలువైన 2.240 కిలోల గంజాయి లభించింది. నిందితులు గండికోట వంశీ, చిత్రం రాకేష్, చింతల తిరుమలేశ్, కంచి మహేశ్, మదసు మహేశ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
