- ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి: టీజీసీహెచ్ఈ మాజీ చైర్మన్ ప్రొ.లింబాద్రి
ట్యాంక్ బండ్, వెలుగు: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడుదామని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. గురువారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ రిసోర్స్ సెంటర్ లో మాల మేధావులు, మాల ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఉద్యోగ నోటిఫికేషన్ల తాత్కాలిక నిలిపివేత, ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ల సవరణ పూర్తయ్యే వరకు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు వేయొద్దని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఎస్సీ వర్గీకరణపై లీగల్ గా పోరాడాలని తీర్మానించారు.
అనంతరం తెలంగాణ ఉన్నత విద్యా మండలి(టీజీసీహెచ్ఈ) మాజీ చైర్మన్ ప్రొ.లింబాద్రి మాట్లాడుతూ.. వర్గీకరణతో మాలలకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నారు. లీగల్ అంశాలు, మాల సామాజిక వర్గం ఏవిధంగా పోరాటం చేయాలి అనే అంశాలపై మల్లేపల్లి లక్ష్మయ్య దిశానిర్దేశం చేశారు. మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేర బాలకిషన్, గౌరవ చైర్మన్ చెరుకు రామ్ చందర్ మాట్లాడుతూ.. మాల సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయంపై రెండేళ్లుగా పోరాటం చేస్తున్నట్లు తెలిపారు.
మాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పందించాలి
రాబోయే రోజుల్లో మంత్రివర్గ ఉపసంఘం, ముఖ్యమంత్రిని కలవాలని, ఉమ్మడి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 9 మంది మాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాలల సమస్యలపై స్పందించకపోతే.. మొదటి కార్యాచరణగా వారి ఇళ్ల ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు.
మంత్రి నర్సింహయ్య, దాసరి శ్యామ్, మనోహర్, సేపూరి ప్రణయ్ కుమార్, మాదాసు రాహుల్ రావు, నామా సైదులు, భానుతేజ, బత్తుల రమేశ్, బత్తుల దిలీప్, దాసరి రవి, దామల్ల సర్వయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్లు పట్టా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
