- ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం ఎఫ్ఎఫ్ఎస్ అమలు :
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, వెలుగు : జొన్న రైతుల ఖాతాల్లో రూ.994 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. గురువారం సెక్రటేరియట్లో వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన రివ్యూలో మంత్రి మాట్లాడారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో జొన్నలు కొనుగోలు చేసిందన్నారు. కనీస మద్దతు ధరతో జొన్నలు కొని 1,01,376 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు తెలిపారు. మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులతో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం పూర్తి బాధ్యతతో కొనుగోళ్లు చేపట్టిందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించామన్నారు. పంట సాగు నుంచి అమ్మకం వరకు రైతుకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ఎరువుల పంపిణీలో పారదర్శకత, సమర్థత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్స్(ఎఫ్ఎఫ్ఎస్) అమలును మరో పది జిల్లాలకు విస్తరిస్తున్నామని చెప్పారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లో ఈ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఆధార్‌తో ఎరువులను అమ్ముతున్నామని చెప్పారు. రియల్ టైమ్ స్టాక్ సమాచారం అందుబాటులో ఉందన్నారు.
బ్లాక్ మార్కెట్ కు తరలకుండా ఎఫ్ఎఫ్ఎస్ వ్యవస్థ చెక్ పెడుతుందని చెప్పారు. రైతులు, డీలర్లు ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగును విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని, గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ఆఫీసర్లు, ఆయిల్ పామ్ కంపెనీలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
అనంతరం హ్యాండ్లూమ్ హ్యకథాన్-–2026 విజేతను సన్మానించారు. జాతీయ స్థాయి ప్రథమ బహుమతి సాధించిన ఐఐహెచ్‌టీ స్టూడెంట్ వగ్గు శ్రీరామ్‌కు అభినందనలు తెలిపారు. నేతన్నల కోసం రూపొందించిన ‘ఎర్గోనామిక్ బ్యాక్ సపోర్ట్’ ను మంత్రి ఆవిష్కరించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ స్పెషల్ సెక్రటరీ కె. సురేంద్ర మోహన్, డైరెక్టర్ బి. గోపి పాల్గొన్నారు.
