ప్రజాపాలనలో చేనేతకు మహర్దశ... నేతన్నల భవిష్యత్తుకు కొండంత భరోసా కల్పిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక రైతు అయితే... భారతీయ సంస్కృతికి రంగులు అద్దేది నేతన్న. తెలుగు నేలపై మగ్గం చప్పుడు వినిపిస్తే అది కేవలం నూలు అల్లిన శబ్దం కాదు. అది శ్రమకు సంగీతం, కళకు రూపం, సంస్కృతికి చిరునామా. మగ్గం గుంటలో కూర్చుని రంగురంగుల దారాలను అల్లే నేతన్న చేతుల్లో ఒక వస్త్రం మాత్రమే కాదు, తెలంగాణ సంస్కృతి, భారతీయ సంప్రదాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అల్లుకుపోయి ఉంటాయి.
అందుకే చేనేత కేవలం ఒక వృత్తి కాదు. అది ఈ నేల చరిత్రలో, సంస్కృతిలో, ఆర్థిక వ్యవస్థలో విడదీయరాని భాగం. పోచంపల్లి ఇక్కత్ ప్రపంచ ఖ్యాతిని గడించింది. గద్వాల పట్టు రాజసానికి ప్రతీకగా నిలిచింది. నారాయణపేట చీరలు సంప్రదాయ సొబగులను చాటాయి. సిద్దిపేట గొల్లభామ చీరలు కళాత్మకతకు చిరునామాగా నిలిచాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ లక్షలాది కుటుంబాలకు జీవనాధారంగా మారింది. ఈ చేనేత వైభవమే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.
నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా...
అయితే ప్రపంచీకరణ, యాంత్రీకరణ, ముడిసరుకుల ధరల పెరుగుదల, విద్యుత్ వ్యయం, మార్కెట్ అస్థిరత, మధ్యవర్తుల ఆధిపత్యం వంటి అనేక సమస్యలు చేనేత రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. ఒకప్పుడు రాత్రింబవళ్లు మోగిన మగ్గాలు మూగబోయాయి. నేత కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. అనేకమంది ప్రత్యామ్నాయ ఉపాధి కోసం వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత రంగాన్ని కేవలం సంక్షేమ అంశంగా కాకుండా తెలంగాణ ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధికి కీలకమైన సంప్రదాయ పరిశ్రమగా గుర్తించి పలు నిర్మాణాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఉపాధి, సంక్షేమం, -మార్కెట్,- సాంకేతికత అనే నాలుగు స్తంభాలపై చేనేత పునరుజ్జీవనానికి కార్యాచరణ చేపట్టింది. గత రెండేళ్లలోనే చేనేత, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి రూ.1,360 కోట్లకు పైగా నిధులు వెచ్చించడం ఈ రంగంపై ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. గతంలో పేరుకుపోయిన బకాయిలను దశలవారీగా విడుదల చేసి, ఇప్పటికే కోట్లాది రూపాయల బిల్లులు చెల్లించడం ద్వారా సహకార సంఘాలకు, వేలాది నేత కుటుంబాలకు ఆర్థిక ఊరట కల్పించింది.
ఉపాధే అతిపెద్ద సంక్షేమం
6.80 కోట్ల మీటర్ల చీరల వస్త్ర ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వడం ద్వారా సిరిసిల్లతోపాటు వేలాది నేత కుటుంబాలకు దాదాపు ఎనిమిది నెలలపాటు ప్రభుత్వం ఉపాధి కల్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6 కోట్ల మీటర్ల ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వగా, ఇప్పటికే దాదాపు ఒక కోటి మీటర్ల ఉత్పత్తి పూర్తయింది. అవసరమైతే మరో 3 కోట్లకు పైగా మీటర్ల ఉత్పత్తికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉండటం నేతన్నల్లో కొత్త ఆశలను నింపుతోంది. ప్రభుత్వ అవసరాల కోసం పాఠశాల యూనిఫారాలు, సంక్షేమ పథకాల చీరలు, ఇతర వస్త్రాల తయారీ ఆర్డర్లను హ్యాండ్‌లూమ్, పవర్‌లూమ్ రంగాలకు కేటాయించడం ద్వారా నిరంతర ఉపాధికి బాటలు వేస్తోంది.
విద్యుత్ సబ్సిడీ
చేనేత పరిశ్రమలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు 25 హెచ్‌పీ వరకు పవర్‌లూమ్ యూనిట్లకు యూనిట్‌కు రూ.2 విద్యుత్ సబ్సిడీ అమలు చేయడం పరిశ్రమకు ఊపిరిపోసింది. ముడి నూలు కొరత, ధరల హెచ్చుతగ్గులను నియంత్రించేందుకు వేములవాడలో రూ.50 కోట్లతో యార్న్ బ్యాంక్ ఏర్పాటు చేసింది. యార్న్ డిపోలు, కామన్ ఫెసిలిటీ సెంటర్లు, డిజైన్ అభివృద్ధి కేంద్రాలు, సహకార సంఘాల బలోపేతం ద్వారా చిన్న నేతన్నలకు ఆధునిక సాంకేతిక సదుపాయాలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఇందిరా మహిళాశక్తి చీరలతో ఉపాధి కల్పన
ఇందిరా మహిళా శక్తి చీరల తయారీ ద్వారా మహిళలకు నాణ్యమైన చీరలు అందుతుండగా, వేలాది నేత కుటుంబాలకు నిరంతర ఉపాధి లభిస్తోంది. చేనేత సహకార సంఘాలను బలోపేతం చేయడం, ఈ-కామర్స్ వేదికల ద్వారా తెలంగాణ చేనేత ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. సిరిసిల్ల, ఉమ్మడి కరీంనగర్ ప్రాంత చేనేత సమస్యలపై లోతైన అవగాహన ప్రభుత్వం కలిగి ఉంది.
చేనేత రంగానికి కొత్త దిశ లభిస్తోంది. నేతన్నల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వ ఆర్డర్లను విస్తరించడం, యార్న్ డిపోలు ఏర్పాటు చేయడం, మార్కెటింగ్ అవకాశాలు పెంచడం, సహకార సంఘాలను బలోపేతం చేయడం వంటి చర్యల్లో ఎప్పటికప్పుడు జిల్లా మంత్రులతో కలిసి ముందుకు తీసుకెళ్తున్నాం. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, గొల్లభామ చీరల మాదిరిగానే సిరిసిల్ల వస్త్రాలకు కూడా ప్రత్యేక బ్రాండ్ గుర్తింపు
తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యం అభినందనీయం.
ప్రజల ఆదరణ ముఖ్యం..
ప్రభుత్వం ఎన్ని పథకాలు తీసుకొచ్చినా, చేనేతను శాశ్వతంగా నిలబెట్టేది ప్రజల ఆదరణే. ప్రతి కుటుంబం నెలకు కనీసం ఒక చేనేత వస్త్రం కొనుగోలు చేసినా, ప్రతి ఉద్యోగి వారానికి ఒకరోజు చేనేత దుస్తులు ధరించినా, ప్రతి పండుగకు చేనేత చీరను బహుమతిగా ఇచ్చినా వేలాది నేత కుటుంబాల్లో వెలుగులు నిండుతాయి. చేనేతను కొనడం అంటే కేవలం వస్త్రాన్ని కొనడం కాదు. ఒక కళాకారుడి శ్రమను గౌరవించడం. ఒక కుటుంబ భవిష్యత్తును ఆదుకోవడం. తెలంగాణ సంస్కృతిని తరతరాలకు అందించడం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మనమందరం ఒక సంకల్పం చేద్దాం. మగ్గం మోగితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.
నేతన్న నవ్వితేనే తెలంగాణ సంస్కృతి సజీవంగా ఉంటుంది. ప్రజాపాలనలో చేనేతకు అందుతున్న ప్రోత్సాహం, ఉపాధి భరోసా, సబ్సిడీలు, యార్న్ బ్యాంకులు, మార్కెటింగ్ అవకాశాలు, భారీ ప్రభుత్వ ఆర్డర్లు ఈ రంగానికి కొత్త జీవం పోస్తున్నాయి. ఈ కృషికి ప్రజల భాగస్వామ్యం తోడైతే తెలంగాణ చేనేత ప్రపంచ మార్కెట్‌లో మరింత ఉన్నత స్థానాన్ని అందుకోవడం ఖాయం. చేనేతను ధరిద్దాం...నేతన్నను గౌరవిద్దాం. తెలంగాణ ఆత్మను తరతరాలకు అందిద్దాం.
- పొన్నం ప్రభాకర్, రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
