V6 News

తమన్నాతో బ్రేకప్ పై మౌనం వీడిన విజయ్ వర్మ.. అంతా రివర్స్ అయిపోయిందంటూ ఆవేదన!

తమన్నాతో బ్రేకప్ పై మౌనం వీడిన విజయ్ వర్మ.. అంతా రివర్స్ అయిపోయిందంటూ ఆవేదన!

విజయ్ వర్మ, తమన్నా భాటియా.. ఈ పేర్లు వినగానే ఒకప్పుడు వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ గుర్తొచ్చేది. 'లస్ట్ స్టోరీస్ 2' సెట్స్‌లో మొదలైన వీరి ప్రేమాయణం, రెండేళ్ల పాటు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. అయితే, ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట 2025 మార్చిలో విడిపోవడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఈ బ్రేకప్ గురించి ఇప్పటివరకు ఈ ఇద్దరూ అధికారికంగా మాట్లాడకపోయినా.. లేటెస్ట్ గా విజయ్ వర్మ సోషల్ మీడియాలో ఎదురవుతున్న నెగటివిటీపై స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

విమర్శలపై విజయ్ ఆవేదన

బ్రేకప్ తర్వాత సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోలింగ్‌పై విజయ్ వర్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎవరినైనా బహిరంగంగా విమర్శించడం అనేది ఒక తప్పుగా భావించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఎవరైతే ఎదుటివారిని దూషిస్తున్నారో వారిని ఎవరూ ప్రశ్నించడం లేదు. కానీ బాధితులను మాత్రం మరింత వేధిస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రజలు తమ వ్యక్తిగత జీవితంపై అతిగా జోక్యం చేసుకుంటున్నారని, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అందుకే, పని కంటే తన వ్యక్తిగత విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో, కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని విజయ్ నిర్ణయించుకున్నారు.

కుటుంబానికి దగ్గరగా..

సోషల్ మీడియా విరామం తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని విజయ్ వెల్లడించారు. ఇటీవలే నేను ఒక పెద్ద ఇంటికి మారాను. పని ఒత్తిడిలో ఇన్నాళ్లూ నా కుటుంబానికి, స్నేహితులకు సమయం కేటాయించలేకపోయాను. ఇప్పుడు వారిని తరచుగా కలుస్తున్నాను. ఈ గ్యాప్ నాకు నేను రీకనెక్ట్ అవ్వడానికి సహాయపడింది అని ఆయన వివరించారు.

తమన్నా ఆశలు.. 

మరోవైపు తమన్నా కూడా తన భవిష్యత్తు భాగస్వామి గురించి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  త్వరలోనే తను ఒక మంచి  లైఫ్ పార్టనర్‌గా మారాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. నా భాగస్వామి తన గత జన్మలో ఏదో మంచి పుణ్యం చేయడం వల్లే నేను అతడి జీవితంలోకి వచ్చానని భావించేలా ఉండాలనుకుంటున్నాను. ఆ అదృష్టవంతుడి కోసం వేచి చూస్తున్నాను అని తమన్నా సరదాగా వ్యాఖ్యానించారు.  వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ఇద్దరూ తమ వృత్తిపరమైన బాధ్యతల్లో బిజీగా ఉన్నారు. విజయ్ వర్మ త్వరలో 'మట్కా కింగ్' అనే సిరీస్‌తో అలరించనున్నారు. అటు తమన్నా కూడా వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో దూసుకుపోతోంది.