V6 News

ఓఆర్ఎస్ లేబులింగ్ వివాదం..ఐఏపీ నుంచి తప్పుకున్న చిన్న పిల్లల డాక్టర్ శివరంజని సంతోష్

ఓఆర్ఎస్ లేబులింగ్ వివాదం..ఐఏపీ నుంచి తప్పుకున్న చిన్న పిల్లల డాక్టర్ శివరంజని సంతోష్

ఓఆర్ఎస్ లేబులింగ్ లోపాలపై పోరాటం చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ చిన్న పిల్లల డాక్టర్ శివరంజని సంతోష్‌..ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) కి రాజీనామా చేశారు. చిన్న పిల్లలకు ఇచ్చే ఓరల్ రీహైడ్రేషన్ ఉత్పత్తుల్లో లోపాలను ప్రశ్నిస్తూ తాను చేసిన బహిరంగ వ్యాఖ్యలపై ఫార్మాస్యూటికల్ కంపెనీల నుంచి లీగల్ నోటీసు అందుకున్న తర్వాత, ఐఏపీ మద్దతు కొరవడిందని పేర్కొంటూ ఆమె రాజీనామా చేసినట్లు చెప్పారు. 

ఓఆర్ఎస్ఎల్ ,దాని రీబ్రాండెడ్ వెర్షన్ అయిన ఈఆర్జెడ్ఎల్ వంటి ఉత్పత్తుల మార్కెటింగ్, పొజిషనింగ్‌ను తీవ్రంగా తప్పుబట్టారు డాక్టర్ శివరంజని సంతోష్. అయితే తమ కంపెనీ ఉత్పత్తులపై తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆమెకు ఫార్మా కంపెనీలు నోటీసులిచ్చాయి. తన పోరాటానికి ఐఏపీ అండగా నిలవకపోవడంతోనే పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 

డాక్టర్ శివరంజని చేస్తున్న పోరాటానికి  ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ( FAIMA ) కూడా అప్పట్లో మద్దుతు తెలిపింది. డాక్టర్ శివరంజని లేవనెత్తిన అంశాలు పూర్తిగా రోగుల భద్రత, శిశువుల ఆరోగ్యానికి సంబంధించినవని స్పష్టం చేసింది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన ఓఆర్ఎస్‌కు బదులుగా.. కేవలం గ్లూకోజ్ కలిపిన ఉత్పత్తులను విక్రయించడం వల్ల అనర్థాలు జరుగుతాయని హెచ్చరించటం ఒక వైద్యురాలిగా ఆమె బాధ్యత అని ఫైమా స్పష్టం చేసింది. ఇలాంటి నోటీసుల ద్వారా వైద్యులను భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడింది.

ఏంటీ  వివాదం?

కన్వ్యూ, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి కంపెనీలు తయారు చేసే ఓరల్ రీహైడ్రేషన్ ఉత్పత్తులలో లోపాలను బహిరంగంగా ప్రశ్నించారు డాక్టర్ శివరంజని.  పిల్లలలో ఎలక్ట్రోలైట్ పానీయాలను విచక్షణారహితంగా వాడటం, ముఖ్యంగా వాటిని రోజువారీ హైడ్రేషన్ ఉత్పత్తులుగా యధావిధిగా ఉపయోగించడంపై అవగాహన కల్పించడమే తన వ్యాఖ్యల లక్ష్యమని డాక్టర్ సంతోష్ వాదించారు. అయితే ఆమె తమ ఉత్పత్తులపై తప్పుడు, తప్పుదారి పట్టించేవిధంగా, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపించాయి.  గత కొద్ది రోజులుగా ఈ వివాదం సంచలనంగా మారింది. 

ఓఆర్ఎస్ లేబులింగ్ లోపాలపై చాలా గత కొద్ది సంవత్సరాల ముందు నుంచి ఐఏపీకి తన ఆందోళన వ్యక్తం చేశానని చెప్పారు డాక్టర్ శివరంజని సంతోష్. పిల్లల ప్రయోజనాలకు హాని కలిగించే నిర్ణయాలను ఎత్తి చూపడం తప్పు అయితే నికి కట్టుబడి ఉంటానని అన్నారామే.