డేవిడ్ ధావన్ మార్క్ కామెడీ అంటేనే వినోదాల విందు. ఇప్పుడు అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి వరుణ్ ధావన్ సిద్ధమయ్యాడు. ఆయన నటిస్తున్న రామాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' (Hai Jawani Toh Ishq Hona Hai) మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కలర్‌ఫుల్ విజువల్స్, ఫన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ టీజర్ బాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.
ట్విస్ట్‌తో మొదలైన టీజర్
ఈ టీజర్ ప్రారంభమే చాలా విభిన్నంగా ఉంది. ఇద్దరు AI-జనరేటెడ్ పసిపిల్లలు అమాయకంగా మాట్లాడుకుంటూ కనిపించారు. తమ తల్లిదండ్రుల గురించి చర్చించుకుంటూ, మా అమ్మలు వేరైనా.. మా నాన్న మాత్రం ఒక్కడే అని వారు మాట్లాడుకునే సన్నివేశాలు నవ్వులు పూయిస్తుంది. ఈ ఒక్క పాయింట్‌తోనే సినిమా ఎంతటి గందరగోళమైన కామెడీతో సాగనుందో అర్థమవుతోంది.
వరుణ్ మార్క్ కామెడీ
వరుణ్ ధావన్ ఇందులో 'జస్' అనే చలాకీ యువకుడిగా కనిపిస్తున్నాడు. ఒకవైపు మృణాల్ ఠాకూర్ (బాణి), మరోవైపు పూజా హెగ్డే (ప్రీత్) మధ్య నలిగిపోయే ప్రేమికుడిగా వరుణ్ నటన ఆకట్టుకుంటోంది. ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లతో వరుణ్ జోడీ కట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం. గతంలో డేవిడ్ ధావన్ - వరుణ్ ధావన్ కాంబినేషన్‌లో వచ్చిన మై తేరా హీరో, జుడ్వా 2, కూలీ నంబర్ 1 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఇప్పుడు ఈ కొత్త చిత్రంతో వారు మరోసారి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడానికి సిద్ధమయ్యారు.
'ఇష్క్ సోనా హై' సాంగ్ రీమిక్స్..
1999లో సల్మాన్ ఖాన్ నటించిన 'బీవీ నంబర్ 1' చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ 'ఇష్క్ సోనా హై'ను ఈ సినిమా కోసం రీమిక్స్ చేశారు. టీజర్ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ఈ మ్యూజిక్ పాత రోజులను గుర్తుకు తెస్తూ, సినిమాకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. తండ్రీకొడుకుల హ్యాట్రిక్ కాంబో కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
కేవలం లీడ్ పెయిర్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలో సపోర్టింగ్ కాస్ట్ కూడా చాలా బలంగా ఉంది. చంకీ పాండే, మనీష్ పాల్ తమదైన కామెడీ టైమింగ్‌తో అలరించనున్నారు. జిమ్మీ షెర్గిల్, మౌనీ రాయ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. టిప్స్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పక్కా 'మసాలా ఎంటర్టైనర్' అని చెప్పొచ్చు. ఆధునిక AI టెక్నాలజీని వాడుకుంటూనే, పాతకాలపు 'కన్ఫ్యూజన్ కామెడీ'ని జోడించి డేవిడ్ ధావన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వెండితెరపై మళ్ళీ ఆ సందడి చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే మరి.

