ఖైరతాబాద్ బీజేపీలో విబేధాలు

ఖైరతాబాద్ బీజేపీలో విబేధాలు

హైదరాబాద్, వెలుగు: ఖైరతాబాద్ నియోజకవర్గ బీజేపీలో విభేదాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రా రెడ్డి వర్గం, హిమాయత్ నగర్ బీజేపీ కార్పోరేటర్ మహాలక్ష్మి భర్త రామన్ గౌడ్ వర్గాల మధ్య మంగళవారం గొడవ జరిగింది. కార్పొరేటర్ హాజరుకాకముందే చింతల రాంచంద్రా రెడ్డి విఠల్ వాడీలో జాతీయ జెండా ఎగరేసి వెళ్లడం ఇందుకు కారణమైంది. దీనిపై పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తానని రామన్ గౌడ్ మీడియాకు చెప్పారు. బీసీని అయినందుననే నన్ను తొక్కేయాలని చూస్తున్నారని, మూడు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొని ఉన్నానని ఆయన మీడియా ముందు కంటతడి పెట్టారు. ఈ దాడిలో తన చేయి విరిగిందని చెప్పారు. 

ఈ గొడవపై పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఇదిలా ఉంటే రామన్ గౌడ్ ఆరోపణలను చింతల ఖండించారు. హిమాయత్ నగర్ పార్టీ నేతలను ఎవరిని అడిగినా ఇందులో వాస్తవాలు చెపుతారన్నారు. తను కాని, తన వర్గం వారు కానీ ఎవరిపై దాడి చేయలేదని, వాస్తవాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ గొడవలపై కిషన్ రెడ్డి ఇద్దరి నేతలపై ఫైర్ అయ్యారని సమాచారం. ఎన్నికల వేళ ఇలా బజారునపడి కొట్లాడుకోవడం ఏంటని ఇద్దరిని ప్రశ్నించినట్లు తెలిసింది.