మెదక్ లో ఓసీ వర్సెస్ బీసీ

మెదక్ లో ఓసీ వర్సెస్ బీసీ
  • ట్రయాంగిల్ ఫైట్ లో ఎవరి నినాదం వారిదే
  • బీసీ ఓట్ల కోసం అందరి ప్రయత్నాలు
  • ముదిరాజ్ ఓట్ల పై నీలం' ప్రత్యేక గురి

సిద్దిపేట, వెలుగు: మెదక్ పార్లమెంట్​స్థానంలో ఓసీ వర్సెస్ బీసీ అన్నట్లుగా ప్రచారాలు సాగుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీల తరఫున ఓసీ అభ్యర్థులు, కాంగ్రెస్ తరఫున బీసీ అభ్యర్థి పోటీలో నిలిచారు. నిర్వాసితుల సమస్యలు, 6 గ్యారంటీల అమలు వంటి అంశాల్ని  బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రచార అస్త్రాలుగా మార్చుకోగా బీసీ బిడ్డను ఆశీర్వదించాలని కోరుతూ  కాంగ్రెస్ అభ్యర్థి  ప్రజల్లోకి వెళ్తున్నారు. మెదక్ పార్లమెంట్ స్థానంలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 18.28 లక్షల ఓటర్లు ఉండగా వీరిలో 50 శాతం మంది బీసీ ఓటర్లే ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు బరిలో ఉన్నారు. 

బీసీ అస్త్రంతో నీలం మధు  

కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు బీసీ అస్త్రంతో ప్రజల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు సైతం బీసీ బిడ్డను ఆశీర్వదించాలని కోరుతున్నారు. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లో దాదాపు 9 లక్షల పై చిలుకు బీసీ ఓటర్లు ఉన్నారు. ఇందులో 5 లక్షల వరకు ముదిరాజ్ ఓటర్లుంటారు. వీరిని ప్రసన్నం చేసుకునే దిశగా అభ్యర్థులు ప్రయత్నాలు ప్రారంభించారు. నీలం మధుకు మద్దతుగా అటు ముదిరాజ్ వర్గంతో పాటు బీసీ సంఘాలు సైతం తమదైన రీతిలో ప్రచారం చేస్తున్నాయి. రెండు పార్టీలు ఓసీలకు టికెట్లిచ్చాయని, కాంగ్రెస్ బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. 

ముదిరాజ్ ల మద్దతు కోసం ప్రయత్నాలు

బీసీల్లో మెజార్టీ ఓటర్లుగా ఉన్న ముదిరాజ్​ల మద్దతు కోసం అన్ని పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లో ముదిరాజ్ నేతలను రంగంలోకి దింపి తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో జరిగే పెద్దమ్మ ఉత్సవాలకు వెళ్తూ తమ అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు దుబ్బాక లో నియోజకవర్గ స్థాయి ముదిరాజ్ సమ్మేళనం నిర్వహించగా రానున్న రోజుల్లో మరికొన్ని సమావేశాలు నిర్వహించడానికి ప్లాన్​ చేస్తున్నారు. 

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. 

మెదక్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ బీసీ నినాదంతో ఓట్లకు గండిపడుతుందేమోననే భయంతో  బీఆర్ఎస్, బీజేపీ లు బీసీల సంక్షేమానికి తీసుకున్న చర్యలను ప్రతి చోట వివరిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా వెంకట్రామిరెడ్డి మూడు ప్రాజెక్ట్​ల ముంపు గ్రామాల ఉసురు పోసుకుని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని  ఓట్లడగడానికి వస్తుండని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శిస్తున్నారు. 

పరిహారాల చెల్లింపులో ఆయన బాధను భరించలేక వేముటఘట్ నిర్వాసితుడు ఇంట్లో చితి పేర్చుకుని చనిపోయిన ఉదంతాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. బీసీ వర్గాల మద్దతు పొందేందుకు బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు బీసీ నేతలను రంగంలోకి దించి ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ట్రయాంగిల్​ఫైట్​లో  ఏ పార్టీ బీసీల మద్దతు పొందుతుందో ఆ పార్టీ విజయం సాధిస్తుందని పొలిటికల్​ అనలిస్టులు చెబుతున్నారు.