Meenakshi Chaudhary: పుట్టినరోజు వేడుకల్లో 'వృషకర్మ' బ్యూటీ.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు.

Meenakshi Chaudhary: పుట్టినరోజు వేడుకల్లో 'వృషకర్మ' బ్యూటీ.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు.

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న డెహ్రాడూన్ సొగసరి మీనాక్షి చౌదరి. అందం, అభినయం కలగలిసిన ఈ అమ్మడు ఈ రోజు (మార్చి 5) తన 29వ పుట్టినరోజు జరుపుకుంది.  వెండితెరపై గ్లామర్ పండించడమే కాదు, అంతకు మించి అద్భుతమైన నేపథ్యం ఉన్న ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.  లేటెస్ట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. అభిమానులు బర్త్‌డే విషెస్ చెబుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

డాక్టర్ టు యాక్టర్

1997, మార్చి 3న జన్మించిన మీనాక్షి చౌదరి.. కేవలం గ్లామర్ ప్రపంచానికే పరిమితం కాలేదు. చదువులోనూ ఆమె టాపర్. పంజాబ్‌లోని నేషనల్ డెంటల్ కాలేజీ నుండి దంతవైద్య విద్యను (BDS) పూర్తి చేసి 'డాక్టర్ మీనాక్షి'గా గుర్తింపు పొందారు. చదువుతో పాటు క్రీడల్లోనూ ఆమెది అందెవేసిన చేయి. రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతగా నిలిచి తనలోని క్రీడాకారిణిని చాటుకున్నారు.

అందాల కిరీటంతో వెండితెర ఎంట్రీ

మీనాక్షి ప్రయాణంలో 2018 సంవత్సరం ఒక మలుపు అని చెప్పాలి.. ఆ ఏడాది 'మిస్ గ్రాండ్ ఇండియా' కిరీటాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో 'మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్'లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి భారత్ గర్వించేలా చేశారు. మోడలింగ్ రంగంలో మెరిసిన అనంతరం వెబ్ సిరీస్‌ల ద్వారా నటనలో ఓనమాలు నేర్చుకున్నారు. 2021లో సుశాంత్ హీరోగా వచ్చిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో టాలీవుడ్ వెండితెరకు పరిచయమయ్యారు.

వరుస ఆఫర్లతో.. 

తొలి సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా, మీనాక్షి అందం దర్శకుల దృష్టిని ఆకర్షించింది. రవితేజతో 'ధమాకా', అడివి శేష్‌తో 'హిట్-2' సినిమాలతో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం'లో మెరిసిన ఈ భామ, గత ఏడాది  వెంకటేష్ సరసన 'సంక్రాంతికి వస్తున్నాం', 'అనగనగా ఒక రాజు' వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది .  ప్రస్తుతం ఈ బ్యూటీ అక్కినేని నాగచైతన్య సరసన ప్రతిష్టాత్మక పీరియాడిక్ డ్రామా 'వృషకర్మ'లో కథానాయికగా నటిస్తోంది.