- జీవన్ దాన్ స్కోరింగ్ లో అదనంగా ‘+2’ పాయింట్లు
- రాష్ట్ర సర్కార్ ఉమెన్స్ డే గిఫ్ట్.. మార్చి 8 నుంచి కొత్త రూల్
- వెయిటింగ్ లిస్ట్ లో సుమారు రెండేండ్లు ముందుకు రానున్న పేషెంట్లు
- అమలు చేయాలని మంత్రి దామోదర ఆదేశాలు
- ఆర్గాన్స్ కోసం ఎదురుచూస్తున్న 1,131 మంది మహిళలు
హైదరాబాద్, వెలుగు: అవయవాల కోసం ఏండ్ల తరబడి పడిగాపులు కాస్తున్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కిడ్నీ, లివర్, గుండె వంటి అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న వారికి ఇకపై ప్రయారిటీ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానుకగా జీవన్ దాన్ లో కొత్త రూల్ తీసుకురాబోతున్నది. అవయవాల కోసం రిజిస్టర్ చేసుకున్న మహిళలకు స్కోరింగ్ లో అదనంగా 2 పాయింట్లు కలపనున్నారు.
ఫలితంగా వెయిటింగ్ లిస్ట్‌లో వెనకబడి ఉన్నవారు ఒక్కసారిగా ముందుకు వచ్చే చాన్స్ ఉంది. కేంద్ర సంస్థ ‘నొట్టో’ (నేషనల్ఆర్గాన్అండ్టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ఆర్గనైజేషన్) గైడ్ లైన్స్ ప్రకారం ఈ పాలసీని తీసుకొస్తున్నారు. ఇప్పటికే అమల్లో గుజరాత్, మహారాష్ట్ర అమల్లో ఉన్న ఈ విధానాన్ని మన రాష్ట్రంలో కూడా తీసుకురావాలని జీవన్ దాన్ అధికారులకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఈ నేపథ్యంలోనే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పాలసీని అమల్లోకి తీసుకొస్తున్నారు.
జెండర్ఆధారంగా 2 పాయింట్లు
అవయవ మార్పిడి కోసం పేషెంట్లు జీవన్ దాన్ లో రిజిస్టర్ చేసుకుంటే కొన్ని రూల్స్ ప్రకారం వారికి పాయింట్లు ఇస్తారు. పేషెంట్ వయసు, ఎంతకాలం నుంచి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు, ఎంతకాలం నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నారనే అంశాల ఆధారంగా ఈ స్కోర్ ఉంటుంది. ఎవరికి ఎక్కువ స్కోర్ ఉంటే.. వారికి బ్రెయిన్ డెడ్ అయినవారి నుంచి సేకరించిన ఆర్గాన్ ను అమరుస్తారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో మహిళలకు కేవలం జెండర్ ఆధారంగానే అదనంగా 2 పాయింట్లు కలుపుతారు.
ఒక పురుషుడు, ఒక మహిళ ఒకే రకమైన అనారోగ్యంతో సమానమైన స్కోరుతో ఉంటే.. ఈ కొత్త రూల్ వల్ల మహిళ స్కోరు 12 అవుతుంది. దీంతో ఆర్గాన్ పొందే అవకాశం ఆ మహిళకే మొదట దక్కుతుంది. ఈ రెండు పాయింట్లు పెరగడం వల్ల.. ఐదేండ్ల తర్వాత జరగాల్సిన ఆపరేషన్, రెండు మూడేండ్లకే పూర్తయ్యే అవకాశం ఉంటుందని ఆఫీసర్లు చెప్తున్నారు.
మహిళల విషయంలో నిర్లక్ష్యం
సమాజంలో భర్తకో, కొడుక్కో జబ్బు చేస్తే భార్య లేదా తల్లి కిడ్నీ ఇవ్వడానికి ముందుకొస్తారు. కానీ అదే మహిళకు జబ్బు చేస్తే ఆమెకు అవయవం ఇచ్చేవారు కరువవుతున్నారు. కనీసం రిజిస్ట్రేషన్ కూడా చేయించట్లేదు. ఈ కొత్త రూల్ తో రిజిస్టర్ అయిన కొద్ది మంది మహిళలకైనా త్వరగా ఆపరేషన్ జరిగి ప్రాణం నిలబడుతుందని మంత్రి దామోదర అధికారులకు సూచించినట్లు సమాచారం. అయితే, ఏండ్ల తరబడి క్యూలో ఉన్న పురుష పేషెంట్లకు ఇది కాస్త నిరాశ కలిగించే అంశమే.
మహిళల ఆరోగ్యంపై చిన్నచూపు తొలిగేలా..
సమాజంలో మహిళల ఆరోగ్యం పట్ల ఇంకా వివక్ష పోలేదు. ఇంట్లో పురుషులకు కిడ్నీనో, లివరో పాడైతే.. ఆస్తులు అమ్మైనా సరే వైద్యం చేయిస్తారు. అవసరమైతే తమ అవయవాలు ఇచ్చేందుకు భార్య, తల్లి ముందుకొస్తున్నారు. కానీ.. అదే పరిస్థితి ఆ ఇంట్లో మహిళలకు వస్తే మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆమెకు అవయవం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కనీసం జీవన్ దాన్ లో రిజిస్ట్రేషన్ చేయించడంలేదు.
అందుకే పురుషులతో పోలిస్తే వెయిటింగ్ లిస్ట్ లో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ వివక్షను తగ్గించి, ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు నొట్టో పాలసీని అడాప్ట్ చేసుకోవాలని అధికారులకు మంత్రి దామోదర సూచించారు. ఈ పద్ధతి ద్వారానైనా జీవన్ దాన్ లో ఆర్గాన్స్ కోసం మహిళల రిజిస్ట్రేషన్లు పెరుగుతాయని మంత్రి అభిప్రాయపడినట్లు అధికారులు చెబుతున్నారు.
అత్యధికంగా కిడ్నీ సమస్యలు
జీవన్ దాన్ తాజా లెక్కలు ప్రకారం అవయవాల కోసం మొత్తం 4,256 మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఇందులో పురుషులు 3,125 మంది ఉండగా, మహిళలు 1,131 మంది ఉన్నారు. మహిళల్లో అత్యధికంగా 865 మంది కిడ్నీ కోసం, 184 మంది లివర్ కోసం వెయిట్ చేస్తున్నారు. గుండె కోసం 23 మంది, ఊపిరితిత్తుల కోసం 55 మంది క్యూలో ఉన్నారు. ఇందులో కొందరికి ఆర్గాన్ దొరకాలంటే.. పదేండ్ల సమయం కూడా పట్టొచ్చు. ఆడవాళ్లకు తొందరగా ఆర్గాన్ లభించి, ట్రాన్స్ ప్లాంట్స్ జరగాలనే ఉద్దేశంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఆడవారి ఆరోగ్యంపై నిర్లక్ష్యం పోవాలి
మహిళల ఆరోగ్యం పట్ల ఇంకా వివక్ష కొనసాగుతోంది. సమాజంలోని ఈ అసమానతలను సరిచేయడానికే ప్లస్ 2 పాలసీని తెస్తున్నాం. ఫలితంగా ఎక్కువ మంది మహిళలకు ట్రాన్స్ ప్లాంట్ జరిగే అవకాశం ఉంది. అవయవం అవసరమయ్యే మహిళలను వెంటనే రిజిస్టర్ చేయించడానికి కుటుంబాలు ముందుకు రావాలి.
- డాక్టర్.భూషణ్ రాజు,
నోడల్ ఆఫీసర్, జీవన్ దాన్
