ప్రాపర్టీ ట్యాక్స్ లో 20 కోట్ల విలువైన చెక్కులు బౌన్స్..జీహెచ్ఎంసీ లీగల్ నోటీసులు

ప్రాపర్టీ ట్యాక్స్ లో 20 కోట్ల విలువైన చెక్కులు బౌన్స్..జీహెచ్ఎంసీ  లీగల్ నోటీసులు
  • చెక్కులు బౌన్స్ అయిన పన్నుదారులపై అధికారులు సీరియస్
  •  వారిపై కంప్లయింట్ చేయడంతో పోలీసులు కేసులు ఫైల్ 
  •  బౌన్స్ అయిన చెక్కుల విలువ రూ. 20 కోట్లు 

హైదరాబాద్, వెలుగు: ప్రాపర్టీ ట్యాక్స్ కింద జీహెచ్ఎంసీకి ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో అధికారులు సీరియ స్ గా ఉన్నారు. చెక్కుల రూపేణ ఇచ్చిన వారిపై  పోలీసులకు కంప్లయింట్ చేశారు.  ఇప్పటికే పలువురిపై ఎఫ్ఐఆర్ లు కూడా నమోదు అయ్యాయి. 2023–-24 ఆర్థిక ఏడాదికి బల్దియాకు మొత్తం రూ.1, 921కోట్లు ఆస్తిపన్ను వసూలు కావాల్సి ఉంది. పన్ను చెల్లింపుల కింద చెక్కులుగా వచ్చినవాటిలో రూ.20 కోట్ల విలువైనవి బౌన్స్ అయ్యాయి. దీంతో పన్ను చెల్లింపుదారులు ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని, లేకపోతే కేసులు ఎదుర్కొవాల్సి ఉంటుందని అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే 1200 మందికి లీగల్ నోటీసులు కూడా జారీ చేశారు. వీటికి స్పందించి కొందరు పన్ను చెల్లిస్తున్నారు.  

చెల్లించని వారిపై లోక్ సభ ఎన్నికల తర్వాత లీగల్ గా చర్యలు తీసుకోనున్నారు. అయితే.. పన్ను వసూలుకు వెళ్లినప్పుడు వెంటనే  చెల్లించాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఆ సమయంలో పన్నుదారులు తప్పించుకునేందుకు  తేదీ వేసి  చెక్కులను ఇస్తున్నారు. వాటిని బల్దియా అధికారులు సంబంధిత బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుండగా బౌన్స్ అవుతున్నాయి. పన్నుచెల్లింపుదారులు ఇలా జీహెచ్ఎంసీని మోసగిస్తుండడంతో కమిషనర్ రోనాల్డ్ రాస్  సీరియస్ అయ్యారు. అలాంటివారిపై తగు చర్యలకు ఆదేశించారు. 

చెక్కులు పూర్తిగా బంద్ పెట్టేందుకు నిర్ణయం 

బౌన్స్ అయిన చెక్కులపై అధికారులు కొత్త ఆలోచన చేశారు.  చెక్కులను పూర్తిగా బంద్ పెట్టాలని నిర్ణయించారు. చెల్లింపుదారులు ఆన్ లైన్ లేదా మీసేవా లేదా నగదుగా ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇకముందు పన్ను వసూలులో చెక్కుల పరేషాన్ లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు బల్దియావర్గాలు చెప్పాయి.  

కమర్షియల్ భవనాలవే ఎక్కువ.. 

చెక్కులు బౌన్స్ అయ్యేవాటిలో ఎక్కువగా కమర్షియల్ ప్రాపర్టీదారులవే ఉంటున్నాయి. కమర్షియల్ భవనాల ట్యాక్స్ లు రూ. లక్షలు, రూ. కోట్లలో ఉంటున్నాయి. అధికారులు కూడా వాటి కలెక్షన్ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు.  రెసిడెన్షియల్ పర్పస్ లో ఉన్న ప్రాపర్టీదారులను పెద్దగా పట్టించుకోరు. కానీ కమర్షియల్ బిల్డింగ్ ట్యాక్స్​కలెక్షన్ పై స్పెషల్ గా ఫోకస్ చేస్తున్నారు. దీంతో వారిపై ఒత్తిడి తీసుకొచ్చి మరి పన్ను వసూలు చేస్తుండగా.. ఆ క్రమంలోనే కొందరు ఖాతాల్లో నగదు లేకున్నా చెక్కులు ఇస్తుండగా బౌన్స్ అవుతున్నాయి.