ప్రపంచ్ కప్ అయినా కూడా ఇలా తొండి చేయొద్దు: రనౌట్ వివాదంపై కైఫ్ సంచలన కామెంట్స్

ప్రపంచ్ కప్ అయినా కూడా ఇలా తొండి చేయొద్దు: రనౌట్ వివాదంపై కైఫ్ సంచలన కామెంట్స్

పాక్-బంగ్లా మధ్య జరిగిన వండే మ్యాచ్ లో రనౌట్ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. పాకిస్తాన్ బ్యాటర్ అలీ ఆఘా ఔటైన విధానంపై క్రికెట్ సర్కిల్ లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్ కెప్టెన్ మెహ్దీ హాసన్ మిరాజ్ చేసిన పని గల్లీ క్రికెట్ కంటే ఘోరంగా ఉందని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదంపై ఇండియన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

బంగ్లా కెప్టెన్ మెహ్దీ హాసన్ చేసింది క్రీడాస్ఫూర్తికే విఘాతం కలిగించేలా ఉందని సీరియస్ కామెంట్స్ చేశారు కైఫ్. ఇది జరగాల్సింది కాదు. వికెట్స్ పడటం లేదనే నిరాశలో ఇంతకు దిగజారటం కరక్టేనా..? వికెట్లు పడటం లేదని ఇలాంటి రనౌట్ సమర్ధించాలా..? అది కూడా ఒక కెప్టెన్ చేయడమేంటి..? యంగ్స్ స్టర్స్ నేర్చుకోండి.. ప్రపంచ కప్ ఉన్న కూడా బంగ్లా కెప్టెన్ చేసినపని చేయకండి. నిజాయితీ లేని ఆటలు అవి ఆటలే కావు.. అంటూ మండిపడ్డారు కైఫ్

వివాదం ఏంటి..?

పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య శుక్రవారం (మార్చి 13) జరిగిన మ్యాచ్ లో రనౌట్ తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ధాకాలోని షేర్-ఇబంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. 
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేయగా.. మహమ్మద్ రిజ్వాన్‌(44)తో కలిసి సల్మాన్ అలీ ఆఘా (64) నాలుగో వికెట్‌కు 109 పరుగుల పాట్నర్ షిప్ నెలకొల్పాడు. వికెట్ పడకుండా ఆడుతూ బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. 

►ALSO READ | ముందుంది ముసళ్ల పండుగ: గంభీర్కు దాదా వార్నింగ్

ఎంతకూ వికెట్ పడటం లేదనో ఏంటో కానీ.. అవకాశం వచ్చింది కదా అని క్రీడాలోకం నవ్వుకునే పని చేశాడు బంగ్లా కెప్టెన్ మెహ్‌దీ హసన్ మిరాజ్. 39వ ఓవర్‌లో మహమ్మద్ రిజ్వాన్ బౌలర్‌వైపు షాట్ ఆడాడు. బంతి కాస్త నాన్‌స్ట్రైకర్‌లో ఉన్న సల్మాన్ అలీ అఘా బ్యాట్‌‌కు తాకింది. దాంతో ఆ బంతిని సల్మాన్ అలీ అఘా బౌలర్‌కు అందించే ప్రయత్నం చేశాడు.

కానీ మెహ్‌దీ హసన్ మిరాజ్ వేగంగా బంతిని అందుకొని నాన్‌స్ట్రైకర్ వికెట్లను కొట్టి రనౌట్ కోసం అప్పీల్ చేశాడు. దాంతో సల్మాన్ అఘా అవాక్కయ్యాడు. బంతిని అందించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలనుకున్న అతనికి ఈ అనూహ్య ఘటన తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్ రివ్యూ కోరగా బ్యాటర్ క్రీజు బయటే ఉన్నాడని ఔటిచ్చాడు.

దాంతో తీవ్ర అసహనానికి గురైన సల్మాన్ అఘా.. బంగ్లా ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు. పెవిలియన్ చేరుతూ బ్యాట్, గ్లౌజులను నేలకు కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది.