Allu Sirish : నగలు వేసుకుంటే తప్పేంటి? ట్రోలర్లలకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన అల్లు శిరీష్!

Allu Sirish : నగలు వేసుకుంటే తప్పేంటి? ట్రోలర్లలకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన అల్లు శిరీష్!

యుంగ్ హీరో అల్లు శిరీష్, నయనిక రెడ్డి వివాహం మార్చి 6న హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన సంగంతి తెలిసిందే.  అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, ఈ ఫోటోలలో శిరీష్ ధరించిన భారీ నెక్లెస్, చోకర్ , వజ్రాభరణాలు చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు శిరీష్ స్టైల్‌ను మెచ్చుకోగా, మరికొందరు 'స్త్రీలు ధరించే నగలను మగవారు ధరించడం ఏంటి?' అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.

జెండర్ నార్మ్స్ పై శిరీష్ రియాక్షన్..

ఈ ట్రోలింగ్‌పై అల్లు శిరీష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "అబ్బాయిలకు నీలం, అమ్మాయిలకు గులాబీ రంగులు.. అబ్బాయిలు ప్యాంట్లు, అమ్మాయిలు నగలు.. ఇవన్నీ మనం సృష్టించుకున్న కొత్త నియమాలు మాత్రమే. మన ప్రాచీన సంస్కృతిని ఒక్కసారి పరిశీలిస్తే, పురుషులు కూడా భారీ ఆభరణాలు ధరించేవారు. వంద సంవత్సరాల క్రితం వరకు పెర్ఫ్యూమ్స్‌లో కూడా మగ, ఆడ అనే తేడా ఉండేది కాదు అని శిరీష్  చెప్పుకొచ్చారు.

నేను ప్రయత్నించకపోతే.. ఇంకెవరు చేస్తారు?

శిరీష్ తన నిశ్చితార్థం వేళ ఒక సంక్లిష్టమైన 'చోకర్' ధరించినప్పుడు ఆయన చుట్టుపక్కల వారు కూడా సందేహాన్ని వ్యక్తం చేశారట. నువ్వు నిజంగానే నెక్లెస్ వేసుకోవాలనుకుంటున్నావా? అన్న ప్రశ్నకు మనం ఇప్పుడు ప్రయత్నించకపోతే, ఇంకెవరూ చేయరు ..  అప్పుడు మరో 20 ఏళ్ల వరకు పరిస్థితి ఇలాగే ఉండిపోతుంది అని అన్నారు. కేవలం నగలే కాదు, శిరీష్ తన చేతికి నయనిక పేరుతో మెహందీ కూడా పెట్టుకున్నారు. పురుషులు తమ దుస్తులతో ప్రయోగాలు చేయడానికి పెద్దగా స్కోప్ ఉండదని, కేవలం యాక్సెసరీస్ ద్వారానే తమ స్టైల్‌ను చాటుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

►ALSO READ | రూ. 33 వేలతో 'మన్ పిశాచ్' మూవీ నిర్మాణం.. రికార్డులు సృష్టిస్తున్న రాహి అనిల్ బార్వే మాయాజాలం!

ఆత్మవిశ్వాసమే నా అలంకారం

గత ఏడాది నవంబర్ (2025)లోనే శిరీష్ తన ఎక్స్ ఖాతాలో.. "చోకర్స్ కేవలం మహిళలకే" అనే ఆలోచన తప్పు అని, మన భారతీయ సంప్రదాయ ఆభరణాలను అందరూ ఆస్వాదించాలని ట్వీట్ చేశారు. "నేను నా గురించి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఏది మగతనం, ఏది ఆడతనం అని ఇతరులు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏం ధరించాలి అనేది నేనే నిర్ణయించుకుంటాను" అని ఆయన ఖరాకండిగా చెప్పారు. కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలో కూడా మూస పద్ధతులను బద్దలు కొడుతూ శిరీష్ చేస్తున్న ఈ ప్రయత్నం ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చగా మారింది. నెట్టింట శిరీష్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.