ఒకే కాన్పులో పుట్టిన కవలలు వాళ్లు. ఒకే ప్లేట్ లో తిన్నారు.. ఒకే స్కూల్ కు వెళ్లారు. ఒక్కటిగా పెరిగారు. అన్నా చెల్లెలి బంధం చూసి.. పేరెంట్స్ ఎంతో మురిసిపోయేవాళ్లు. కానీ పెద్దయ్యాక వాడు సైకో అవుతాడని వాళ్లు ఊహించలేకపోయారు. తనతో పాటే భూమి మీద కాలుమోపిన చెల్లిని ఒకటి కాదు రెండు కాదు.. 84 కత్తి పోట్లతో పొడిచి చంపాడు ఈ శాడిస్ట్ ట్విన్ బ్రదర్. అంతే కాదు.. జన్మనిచ్చిన తల్లిని కూడా పొట్టన పెట్టుకోవాలని చూశాడు. అంత ఘోరంగా చంపడానికి.. అంత పెద్ద కారణం ఏమైనా ఉందా అంటే.. అదేదో మీరే చదవండి.
ఉత్తరప్రదేశ్ లో జరిగింది ఈ క్రూర హత్య. మొరదాబాద్ కు చెందిన హిమాన్షిక (25) ఇంజినీరింగ్ అనే ఇంజినీరింగ్ స్టూడెంట్ ను హార్దిక్ (25) అనే ఆమె అన్న అత్యంత కిరాతకంగా చేసిన హత్య దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. చెల్లిని చంపి.. తల్లి నీలిమ ఆఫీసుకు వెళ్లి.. నీకొక సర్ప్రైజ్ చూపిస్తానని ఇంటికి తీసుకొచ్చి ఆమెపై కూడా హత్యా ప్రయత్నం చేశాడు. ఇంట్లో రక్తపు మడుగులో పడిన కూతురును చూసి నీలిమ షాక్ అయ్యేలోపే ఆమెపై కూడా అటాక్ చేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు కవలల మధ్య కరీర్ గురించి, రిలేషన్ షిప్ గురించి వివాదం ఏర్పడింది. ఇద్దరూ గురుగ్రాంలో ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. జాబ్ చేస్తూనే హిమాన్షిక ఎంబీఏ చేస్తోంది. కొన్నాళ్ల తర్వాత హార్దిక్ జాబ్ మానేసి.. ఏడాదిన్నర నుంచి సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యాడు. హోలీ పండుగ కోసం మొరాదాబాద్ కు వచ్చారు. మళ్లీ గురుగ్రాం వెళ్లే లోపే ఇంతటి దారుణం జరిగిపోయింది.
సోషల్ మీడియాలో పరిచయం అయిన లవర్ కోసం..
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. హార్దిక్ కు పుణెకు చెందిన యువతితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. దీంతో జాబ్ మానేసి ఫోన్ కు బానిసై పోయాడు. ఎప్పుడు చూసినా చాటింగ్, ఫోన్ కాల్స్ లో మునిగిపోయేవాడు. దీంతో కెరీర్ పైన ఫోకస్ చేయాలని అతని తల్లి, చెల్లి సలహా ఇచ్చారు. మార్చి 6న జరిగిన చర్చ అన్నా చెల్లెలి మధ్య వాగ్వాదానికి దారి తీసింది.
►ALSO READ | ప్రయాణీకుల్లాగే ఆటో ఎక్కుతారు.. కానీ ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లి.. సూర్యపేట జిల్లాలో ఏం జరిగిందంటే..
నాకే చెప్తావా అని.. చెల్లిపై కక్ష్య పెంచుకున్న హార్దిక్.. కూరగాయల కత్తితో పొడిచి చంపేశాడు. పోస్ట్ మార్టం రిపోర్టులో 84 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
హార్దిక్ తల్లి నీలిమ ఇన్సురెన్స్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. చెల్లిని చంపిన తర్వాత తల్లి నీలిమ ఆఫీస్ కు వెళ్లిన హార్దిక్.. ఆమెను ఇంటికి తీసుకొచ్చి అటాక్ చేశాడు. ఆమెను గాయాలతో వదిలేసి కార్ లో పారిపోయాడు. నీలిమ చావు బతుకుల మధ్య అరువటం చూసిన స్థానికులు.. ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
అందుకే చంపేశా..
ఇంతటి ఘాతుకానికి తెగబడ్డ హార్దిక్ ను 24 గంటల్లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కెరీర్ పై ఫోకస్ చేయాలని పదే పదే సలహాలు ఇవ్వటం.. రొమాంటిక్ రిలేషన్ షిప్ ను వదిలేయమని చెప్పడంతో చిరాకుతోనే ఈ పనిచేశానని విచారణలో చెప్పాడు.
