రూ. 80 కోట్లు చెల్లిస్తేనే మందులు సప్లయ్

రూ. 80 కోట్లు చెల్లిస్తేనే మందులు సప్లయ్
  • ప్రభుత్వానికి ట్విన్‌‌‌‌‌‌‌‌ సిటీస్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌ సప్లయర్స్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ అల్టిమేటం
  •     2022 నుంచి పెండింగ్‌‌‌‌‌‌‌‌ లోనే డీసెంట్రలైజ్డ్‌‌‌‌‌‌‌‌ బకాయిలు
  •     టీజీఎంఐడీసీ నుంచి కూడా మరో రూ.70 కోట్లు బాకీ.. 
  •     ఇప్పటికే గాంధీకి సరఫరా బంద్‌‌‌‌‌‌‌‌.. నేటి నుంచి ఉస్మానియాకు నిలిపివేత
  •     హాస్పిటల్స్ లో మందుల కొరత లేదన్న వైద్యారోగ్య శాఖ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ప్రభుత్వ హాస్పిటల్స్ కు మందులు, సర్జికల్‌‌‌‌‌‌‌‌ పరికరాలు సరఫరా చేసే ఏజెన్సీలు సమ్మె బాట పట్టాయి. ఏండ్ల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ‘ట్విన్‌‌‌‌‌‌‌‌ సిటీస్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌ సప్లయర్స్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌’ అల్టిమేటం జారీ చేసింది. తమకు రావాల్సిన రూ.80 కోట్ల పాత బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని, ఆ నిధులు చెల్లిస్తేనే హాస్పిటల్స్ కు మందులు, ఇతర వైద్య పరికరాలను సరఫరా చేస్తామని తేల్చిచెప్పింది.

2022 నుంచి బిల్లులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. సీఎం, హెల్త్ మినిస్టర్, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని సప్లయర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నుంచే గాంధీ హాస్పిటల్ కు సప్లై నిలిపివేశామని, గురువారం నుంచి ఉస్మానియాకు కూడా ఆపేస్తున్నామని అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ రామచంద్ర ప్రకటించారు. 

ఉస్మానియా హాస్పిటల్ రూ.35 కోట్లు బాకీ

సప్లయర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల్లో అత్యధికంగా ఉస్మానియా  హాస్పిటల్ నుంచే రూ.35 కోట్లు రావాల్సి ఉందని అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ సభ్యులు తెలిపారు. గాంధీ హాస్పిటల్ నుంచి రూ.18 కోట్లు, నీలోఫర్‌‌‌‌‌‌‌‌ రూ.15 కోట్లు, సరోజినీదేవి కంటి హాస్పిటల్ రూ.5 కోట్లు, ఈఎన్‌‌‌‌‌‌‌‌టీ రూ.3 కోట్లు, నయాపూల్‌‌‌‌‌‌‌‌ రూ.2 కోట్లు, సుల్తాన్‌‌‌‌‌‌‌‌ బజార్‌‌‌‌‌‌‌‌ మెటర్నిటీ హాస్పిటల్ నుంచి రూ.కోటి బకాయిలు రావాల్సి ఉందని వెల్లడించారు. ఈ బిల్లుల చెల్లింపు కోసం 2024 నుంచి పలుమార్లు అధికారులకు, 2025లో ఏకంగా సీఎంకు వినతిపత్రాలు సమర్పించినా ఎలాంటి స్పందన లేదని వాపోయారు. 

డయాగ్నొస్టిక్స్‌‌‌‌‌‌‌‌ బడ్జెట్‌‌‌‌‌‌‌‌ ఎత్తివేత

2022, 2023, 2024 సంవత్సరాలకు సంబంధించి డీసెంట్రలైజ్డ్‌‌‌‌‌‌‌‌ బడ్జెట్‌‌‌‌‌‌‌‌(211, 212, 503) కింద తమకు ఎలాంటి నిధులు విడుదల కాలేదని సప్లయర్లు ఉస్మానియా హాస్పిటల్ కు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. ఇక 2025లో రెండు క్వార్టర్లకు సంబంధించి కేవలం మెడికల్, సర్జికల్‌‌‌‌‌‌‌‌ బడ్జెట్‌‌‌‌‌‌‌‌ మాత్రమే ఇచ్చారని, 503 డయాగ్నొస్టిక్స్‌‌‌‌‌‌‌‌ బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా తొలగించారని వివరించారు. దీనికి తోడు 2025 జనవరి నుంచి ఆరోగ్యశ్రీ చెల్లింపులు కూడా నిలిచిపోయాయన్నారు. రేట్‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ కింద డయాగ్నొస్టిక్స్, సర్జికల్స్‌‌‌‌‌‌‌‌ సరఫరా చేసినందుకు గాను టీజీఎంఐడీసీ నుంచి కూడా తమకు మరో రూ.70 కోట్లు రావాల్సి ఉందని వెల్లడించారు. 

20 శాతం సప్లై వీరిదే..

ప్రభుత్వ హాస్పిటల్స్ కు అవసరమైన మందుల్లో 80 శాతం టీజీఎంఐడీసీ సరఫరా చేస్తుండగా.. మిగతా 20 శాతాన్ని హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ ద్వారా ఈ సప్లయర్ల నుంచే సమకూర్చుకుంటాయి. అన్ని రకాల డిస్పోజబుల్స్‌‌‌‌‌‌‌‌ తో పాటు, సూపర్‌‌‌‌‌‌‌‌ స్పెషాలిటీకి సంబంధించిన స్టంట్స్, వాల్వ్స్, ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ సర్జరీ ఇంప్లాంట్స్, డయాలసిస్‌‌‌‌‌‌‌‌ పరికరాలు, యూరాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ పరికరాలను వీరే సరఫరా చేస్తుంటారు. రూల్స్ ప్రకారం వస్తువులు సరఫరా చేసిన 30 నుంచి 45 రోజుల్లోగా ప్రభుత్వం బిల్లులు చెల్లించాలి, లేదంటే వడ్డీతో సహా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఏండ్ల తరబడి బిల్లులు నిలిచిపోవడంతో ఇక సప్లై చేయలేమంటూ సప్లయర్లు ప్రకటించారు.

ఆందోళన వద్దు.. మందుల కొరత లేదు: వైద్యారోగ్య శాఖ

సప్లయర్లు సమ్మెకు దిగుతున్నారన్న వార్తల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ స్పందించింది. హాస్పిటల్స్ లో మందులకు ఎలాంటి కొరతా లేదని, రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ‘‘మెడికల్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ ద్వారా సరఫరా చేసిన అన్ని రకాల అత్యవసర, సాధారణ మందులు హాస్పిటల్స్ లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల కోసం అదనపు నిల్వలను కూడా ఉంచాం. మందుల సరఫరా, లభ్యతకు ఎలాంటి ఆటంకం కలగలేదు. ప్రజలు ఆందోళన చెందొద్దు’’ అని వైద్యారోగ్య శాఖ అధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.