- షెడ్యూల్ కుదించాలని డిమాండ్లు
- మార్చి 13న డీఈఓలతో అధికారుల అత్యవసర రివ్యూ !
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌పై ‘గ్యాస్’ నీడలు ముసురుకుంటున్నాయి. 10, 12 రోజుల్లో పూర్తికావాల్సిన పరీక్షలను.. విద్యాశాఖ ఉన్నతాధికారులు ఏకంగా 34 రోజులకు పెంచారు. ఈ నెల 14 నుంచి వచ్చే నెల 16 వరకు అంటే సుమారు నెల రోజుల పాటు పరీక్షలు నిర్వహించేలా విద్యాశాఖ ఆఫీసర్లు షెడ్యూల్ రూపొందించారు.
ఒక్కో పరీక్షకు మధ్య 3 నుంచి 5 రోజుల సుదీర్ఘ విరామం ఇచ్చారు. ఈ సాగదీత వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవడమే కాకుండా, హాస్టళ్లలో ఉండేవారు తీవ్ర ఇబ్బందులు పడ్తారని, షెడ్యూల్ మార్చాలని అప్పట్లోనే విద్యార్థి, టీచర్ల సంఘాలు కోరినా ఉన్నతాధికారులు పెడచెవిన పెట్టారు. తాజాగా రాష్ట్రంలో మొదలైన గ్యాస్ సంక్షోభంతో మరోసారి టెన్త్ పరీక్షల షెడ్యూల్అంశం తెరపైకి వచ్చింది.
సిలిండర్ల కొరతతో గురుకులాలు, ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లలో వంట కష్టాలు మొదలుకావడంతో టెన్త్ షెడ్యూల్ కుదించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో నేడు డీఈవోలతో అధికారులు అత్యవసర రివ్యూ ఏర్పాటుచేయడం
ఆసక్తి రేపుతోంది.
హాస్టళ్లపై తీవ్ర ప్రభావం
రాష్ట్రవ్యాప్తంగా 11,674 హైస్కూళ్లలో 5,17,727 మంది టెన్త్ రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు రెడీ అయ్యారు. ఇందులో కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల గురుకులాలు, ఆశ్రమ స్కూళ్లు, వివిధ శాఖల పరిధిలోని హాస్టళ్లలో సుమారు లక్ష మంది వరకు ఉన్నారు. మరోపక్క ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో 2,50,015 మంది చదువుతున్నారు.
వీరిలో సుమారు సగం మంది హాస్టళ్లలో ఉండి చదువుకుంటుండగా, చాలా మంది పరీక్షల సమయంలో నెల, రెండు నెలల పాటు హాస్టళ్లలో ఉండి చదవడం చేస్తారు. వీరందరిపై ప్రస్తుతం గ్యాస్ ఎఫెక్ట్ పడుతోంది.
ప్రభుత్వం భరోసా ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సరిపడా సిలిండర్లు దొరక్కపోవడంతో వంట కష్టాలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయా విద్యార్థులకు సకాలంలో భోజన ఏర్పాట్లు చేయడం స్కూల్మేనేజ్మెంట్లకు సవాల్‌గా మారింది. ఇప్పటికే పలు హోటళ్లు, ప్రైవేటు హాస్టళ్లలో గ్యాస్కష్టాలు మొదలయ్యాయి. కొన్ని మూతపడ్తుండగా, మరికొన్నింటి మెనూలో కూరలు తగ్గించేశాయి.
యుద్ధం ఇప్పట్లో ముగిసే పరిస్థితి కనిపించడం లేదు. ఇటు పరీక్షల సమయం నెల రోజులకు మించి ఉండడంతో అంతకాలం విద్యార్థులకు భోజనం కల్పించడం కష్టమని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు పరీక్షల సమయంలో టెన్త్ విద్యార్థులకు స్పెషల్ క్లాసులు తీసుకోవాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో సర్కారు స్కూళ్లలోని విద్యార్థులకూ బడుల్లో మిడ్డే మీల్స్, అల్పాహారం అందించాలన్నా.. ఇబ్బందులు తప్పేలా లేవని టీచర్లు చెప్తున్నారు.
మార్చి 13న అధికారుల సమీక్ష..
పరిస్థితి తీవ్రతను గమనించిన స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్యాస్ కొరత నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్కుదింపు సాధ్యాసాధ్యాలపై నేడు అత్యవసర సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. హాస్టళ్లలో ఉన్న పరిస్థితులు, గ్యాస్ నిల్వలు, గ్యాస్ సరఫరాపై నివేదికలు తీసుకోవాలని భావిస్తున్నారు.
ఒకవేళ ఇబ్బందులు తప్పవని భావిస్తే, సమస్యను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకుపోవాలని యోచిస్తున్నారు. సమస్య తీవ్రత దృష్ట్యా షెడ్యూల్‌ను కుదించి త్వరగా ముగించడంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
