బీఆర్​ఎస్​ ఎన్నికల ప్రచారానికి మాజీ ఎమ్మెల్యేలు దూరం!

బీఆర్​ఎస్​ ఎన్నికల ప్రచారానికి మాజీ ఎమ్మెల్యేలు దూరం!
  • అభ్యర్థుల గెలుపు కోసం అష్టకష్టాలు
  • పార్టీ క్యాడర్ వలస పోవడంతో ప్రచారానికి నేతలు కరువు
  • కొత్త అభ్యర్థులతో నానా తంటాలు

నల్గొండ, వెలుగు : పార్లమెంట్​ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్​మాజీ ఎమ్మెల్యేలు దూరమయ్యారు. కాంగ్రెస్​అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ కేడర్​అంతా చెల్లాచెదరైంది. ముఖ్యంగా గ్రామ, మండల, పట్టణ స్థాయిలో పార్టీ తరపున కీలక పాత్ర పోషించే ముఖ్యనేతలందరూ గంపగుత్తగా కాంగ్రెస్​లో చేరడంతో ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి నేతలు కరువయ్యారు. ఇప్పటికీ ఇంటింటి ప్రచారం నిర్వహించడంలో మాజీ ఎమ్మెల్యేలు వెనకబడ్డారు. 

నల్గొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి తమ్ముడు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నల్గొండ నియోజకవర్గంలోనే ఇప్పటివరకు ప్రచారమే మొదలు పెట్టలేదు. సూర్యాపేటలో మాజీ మంత్రి, ఎమ్మె ల్యే జగదీశ్​రెడ్డి, ఆయన భార్య సునీత ఇంటింటి తిరిగి ప్రచారం చేస్తుండగా, నల్గొండలో బీఆర్ఎస్​నాయకులు మాత్రం ఇంకా మేల్కొనలేదు. 

నకిరేకల్​మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సైతం ఎన్నికల ప్రచారానికి పూర్తిగా దూరమయ్యారు. భువనగిరి అభ్యర్థి​ క్యామ మల్లేశ్ కు​జిల్లా రాజకీయాలతో అస్సలు సంబంధాలు లేవు. దీంతో ఎన్నికల ప్రచారం గురించి పట్టించుకునే నాథుడే లేకుండాపోయారు. రెండు నియోజకవర్గాలకు ఎన్నికల ఇన్​చార్జిగా వ్యవహరిస్తున్న జిల్లా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్​రెడ్డి ఎంపీ అభ్యర్థులను వెంటబెట్టుకుని ప్రచార షెడ్యూల్​ను ఫాలో అవుతున్నారు. 

పార్టీ కేడర్ ​నిలదీస్తుందనే భయం.

గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటి తిరిగి ప్రచారం చేయకపోవడానికి ఆర్థిక అంశాలే అసలు సమస్యగా మారినట్టు తెలుస్తోంది. ప్రతి బూత్​కు ఖర్చుల నిమిత్తం కనీసం రూ.15 వేలు ఇస్తే తప్ప అడుగు ముందుకుపడే పరిస్థితులు కనిపించడం లేదని సెకండ్ కేడర్ నాయకులు నియోజకవర్గ సమన్వయకర్తలకు తేల్చిచెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బకాయిపడ్డ పైసలే ఇప్పటివరకు ఇవ్వలేదని, ఇప్పుడు మళ్లీ ఎంపీ ఎన్నికల ప్రచారమని గ్రామాల్లోకి వెళ్తే కేడర్ నిలదీసే పరిస్థితులు ఉండడంతో మాజీ ఎమ్మెల్యేలు మొఖం చాటేస్తున్నారు. ఇలాంటి సమస్యలు వస్తాయనే పార్టీ హైకమాండ్​మాజీ ఎమ్మెల్యేలకు తోడుగా నియోజకవర్గ కో–ఆర్డినేటర్లను నియమించింది. కానీ, కో–ఆర్డినే టర్లు జోక్యం చేసుకున్నా పైసలే ప్రధాన సమస్యగా మారడంతో వాళ్లు కూడా గట్టిగా మాట్లాడలేకపోతున్నారు.