డీఫాల్ట్‌‌‌‌ రైస్‌‌‌‌  మిల్లర్లపై ప్రభుత్వం చర్యలు : రిజిస్ట్రేషన్లు బంద్‌..కోట్ల రూపాయల సీఎంఆర్‌‌‌‌ పెండింగ్‌

డీఫాల్ట్‌‌‌‌ రైస్‌‌‌‌  మిల్లర్లపై ప్రభుత్వం చర్యలు : రిజిస్ట్రేషన్లు బంద్‌..కోట్ల రూపాయల సీఎంఆర్‌‌‌‌ పెండింగ్‌
  • మిల్లు ఓనర్లు, డైరెక్టర్లు, లీజుదారులు, కుటుంబసభ్యుల ఆస్తుల లావాదేవీలపై కట్టడి
  • కలెక్టర్ ఎన్‌‌‌‌వోసీ ఇస్తేనే రిజిస్ట్రేషన్లు 
  • జిల్లా రిజిస్ట్రార్లకు అడిషనల్‌‌‌‌ కలెక్టర్ల లెటర్‌‌‌‌
  • డీఫాల్ట్‌‌‌‌ లిస్ట్‌‌‌‌లో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మిల్లులు

కరీంనగర్, వెలుగు : ఏండ్ల తరబడి సీఎంఆర్ ఇవ్వడంలో విఫలమవుతున్న రైస్‌‌‌‌ మిల్లర్లపై కొరఢా ఝలిపించేందుకు ప్రభుత్వం  సిద్ధమైంది. కోట్లాది రూపాయల విలువైన ధాన్యాన్ని దారి మళ్లించిన మిల్లర్లు.. తమ మిల్లులను అమ్ముకుని పరారయ్యే పరిస్థితి రాకముందే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగా డీఫాల్టర్లుగా గుర్తించిన మిల్లులకు సంబంధించిన ఓనర్లు, డైరెక్టర్లు, లీజుదారులు, వారి కుటుంబసభ్యుల ఆస్తులపై లావాదేవీలు జరగకుండా, ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్‌‌‌‌ చేయకుండా కట్టడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పలు జిల్లాల్లో డీఫాల్ట్‌‌‌‌ అయిన మిల్లుల లిస్ట్‌‌‌‌ను జత చేస్తూ అడిషనల్ కలెక్టర్లు ఆయా ఉమ్మడి జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లకు లేఖలు రాశారు. కలెక్టర్‌‌‌‌ ఎన్‌‌‌‌వోసీ ఇస్తేనే వారికి సంబంధించిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయాలని లేఖలో ఆదేశించారు. 

ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ నమోదు చేసినా రికవరీ కావట్లే... 

కొంత మంది మిల్లర్లు పెట్టుబడి లేకుండానే సర్కార్ ఇచ్చిన ధాన్యాన్ని తీసుకుని మరాడించాక బియ్యాన్ని ఎఫ్‌‌‌‌సీఐకి ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల్లో అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు వ్యక్తులు మిల్లులను లీజుకు తీసుకుని తమకు కేటాయించిన ధాన్యాన్ని పూర్తిగా దారి మళ్లిస్తూ బినామీల పేరిట ఆస్తులు సంపాదించుకుంటున్నారు.

ఇలాంటి వ్యక్తులపై ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ నమోదు చేసినా వారి దగ్గరి నుంచి డబ్బులు రికవరీ చేయడం చట్టపరంగా సాధ్యం కావడం లేదు. ఈ క్రమంలో కొందరు మిల్లర్లు తమ మిల్లులను ఇతరులకు అమ్మేయడం లేదా లీజుకు ఇవ్వడం వంటివి చేసి చేతులెత్తేస్తున్నారు. ఈ విషయంపై గతేడాది డిసెంబర్‌‌‌‌ 23న సెక్రటేరియట్‌‌‌‌లో నిర్వహించిన సమావేశంలో డీఫాల్ట్‌‌‌‌ మిల్లర్ల వ్యవహారంపై సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి సీరియస్ అయ్యారు. సీఎం ఆదేశాలతో కొన్ని జిల్లాల్లో అడిషనల్ కలెక్టర్లు ఆలస్యంగానైనా చర్యలు ప్రారంభించారు. 

కలెక్టర్ ఎన్‌‌‌‌వోసీ ఇస్తేనే రిజిస్ట్రేషన్‌‌‌‌

డీఫాల్ట్‌‌‌‌ రైస్‌‌‌‌ మిల్లుల డైరెక్టర్లు, వాటాదారులు, వారి కుటుంబసభ్యులు లేదా లీజుదారుల పేరిట ఉన్న ఆస్తులపై ఎలాంటి లావాదేవీలు జరుపవద్దని అడిషనల్‌‌‌‌ కలెక్టర్లు ఆయా జిల్లా సబ్‌‌‌‌రిజిస్ట్రార్లకు లెటర్లు రాశారు. ఆస్తుల లావాదేవీలు జరిగే సమయంలో సివిల్‌‌‌‌ సప్లై వద్ద ఎలాంటి బకాయిలు లేవని కలెక్టర్‌‌‌‌ ద్వారా ఎన్‌‌‌‌వోసీ తీసుకొస్తేనే రిజిస్ట్రేషన్‌‌‌‌ చేయాలని లెటర్‌‌‌‌లో ఆదేశించారు. 

కరీంనగర్‌‌‌‌లో 109 మిల్లులు...

కరీంనగర్‌‌‌‌ జిల్లాలో 2011 – 12 నుంచి 2023-– 24 వరకు 109 రైస్‌‌‌‌మిల్లులను డీఫాల్టర్లుగా గుర్తించారు. ఈ మేరకు ఆ మిల్లుల లిస్ట్‌‌‌‌తో పాటు కరీంనగర్‌‌‌‌ అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ కె.లక్ష్మీకిరణ్‌‌‌‌ జిల్లా రిజిస్ట్రార్‌‌‌‌కు ఇటీవల లేఖ రాశారు. ఈ లేఖ కాపీలను జిల్లాలోని సబ్‌‌‌‌రిజిస్ట్రార్లు, తహసీల్దార్లకు పంపారు.

కరీంనగర్‌‌‌‌ జిల్లాలో డీఫాల్ట్‌‌‌‌ అయిన మిల్లుల్లో వాసుదేవ ఇండస్ట్రీస్ (చల్లూరు), రాజరాజేశ్వర ఇండస్ట్రీస్ (గట్టుదుద్దెనపల్లి), శ్రీలక్ష్మి ఎంఆర్ఎం (రాజాపూర్), లక్ష్మీ పీబీఆర్ఎం (అన్నారం), శ్రీ వసుధ ఇండస్ట్రీస్, శ్రీవైష్ణవి ఇండస్ట్రీస్ (మానకొండూరు), సూర్య, ఎస్వీ, వాణి ఇండస్ట్రీస్ సహా 109 మిల్లులు ఉన్నాయి. ఇలా డీఫాల్ట్‌‌‌‌గా గుర్తించిన మిల్లుల్లో 70 శాతం మిల్లులకు గత ఖరీఫ్ సీజన్‌‌‌‌లోనూ సివిల్ సప్లై ఆఫీసర్లు ధాన్యం కేటాయింపులు చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ మిల్లులకు మళ్లీ ధాన్యం కేటాయించడంలో జిల్లా రైస్ మిల్లర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌లోని ఇద్దరు నాయకులు చక్రం తిప్పినట్లు తెలిసింది. ఏడాదిన్నర క్రితం కొందరు జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్లకు రైస్ మిల్లర్ల సంఘం నేతలు ముడుపులు ముట్టజెప్పడంపై అసోసియేషన్‌‌‌‌లో అంతర్గతంగా మిల్లర్ల మధ్య పెద్ద దుమారమే రేగింది. 

మిగతా జిల్లాల్లో...

రాష్ట్రంలోని పలుజిల్లాల్లో డీఫాల్ట్‌‌‌‌ అయిన రైస్‌‌‌‌మిల్లు లిస్ట్‌‌‌‌ను ఆఫీసర్లు ప్రకటించారు. ఇందులో నల్గొండ జిల్లాలో 84 రైస్‌‌‌‌ మిల్లులు డీఫాల్ట్‌‌‌‌ లిస్ట్‌‌‌‌లో ఉండగా... నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌లో 100, పెద్దపల్లి జిల్లాలో 58, జగిత్యాల జిల్లాలో 22, సూర్యాపేట జిల్లాలో 20 మిల్లులు ఉన్నాయి. అలాగే  మంచిర్యాల జిల్లాలో 25, మెదక్‌‌‌‌ జిల్లాలో 13, గద్వాల జిల్లాలో 14 రైస్‌‌‌‌ మిల్లులు డీఫాల్ట్‌‌‌‌ లిస్ట్‌‌‌‌లో ఉండగా.. వీటికి సంబంధించిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని అడిషనల్‌‌‌‌ కలెక్టర్లు సబ్‌‌‌‌రిజిస్ట్రార్లకు లెటర్లు రాశారు.