తెలంగాణ రాజకీయాల్లో ఓ వాక్యూమ్ కనిపిస్తోందా? వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి మరో కమ్యూనిస్టు పార్టీ ఉనికిలోకి వస్తుందా? విప్లవ భావజాలమున్న నాయకత్వం రాజకీయ పోరాటం చేస్తే సక్సెస్ అవుతుందా? ఆ పార్టీ పార్లమెంటరీ విధానంలో పోరాడితే ఎవరికి నష్టం.. రాజకీయాల్లో ఏ పార్టీకి కష్టం? ఎవరి ఓటు బ్యాంకు టర్న్ అవుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశం.
2026 ఫిబ్రవరి నాటికి సాయుధరూపంలో ఉన్న మావోయిస్టు ఉద్యమం దాదాపు ముగిసిన ప్రక్రియగానే చెబుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్చి 31, 2026 నాటికి ‘నక్సల్ ముక్త భారత్’ అని ప్రకటించారు. ఇందులో భాగంగా 2025లోనే 1,225 మావోయిస్టులు లొంగుబాటు బాట పట్టగా, 270 మంది న్యూట్రలైజ్ అయ్యారు. ఒక్క తెలంగాణలోనే 427 మంది సరెండరయితే ఇందులో మెజారిటీ ఉత్తర తెలంగాణవారే ఎక్కువగా ఉండడం విశేషం.
అయితే, ఈ లొంగుబాట్లు రాజకీయ రూపాంతరం చెందుతాయని స్వయానా అగ్రనేత దేవ్ జీ ప్రకటించారు. ఆయన 45 ఏళ్లుగా అండర్‌గ్రౌండ్‌లో ఉండి మావోయిస్టు స్ట్రాటజిస్ట్‌గా పనిచేశాడు. సరెండర్ తర్వాత ‘రాజకీయ జీవితం సాగిస్తాను’ అని ప్రకటించారు. అనుభవమున్న నాయకత్వం రాజకీయ వేదికను కోరుకుంటున్నదంటే తెలంగాణలో మరోపార్టీ పురుడు పోసుకోబోతోందని భావించకతప్పదు.
రాజకీయ, భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థలపై సాయుధ పోరాటమే సరైన మార్గమనే భావన నుంచి నక్సలిజం పురుడు పోసుకుంది. గ్రామాల్లోని పేద రైతులు, గిరిజనుల మద్దతుతో అడవుల్లో గెరిల్లా స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. ‘ప్రజల నుంచి.. ప్రజల కోసమే" అనే సూత్రం ప్రకారం.. ప్రజల సమస్యలను తమ ఎజెండాగా మార్చుకుని ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జనతన సర్కార్లు సైతం నిర్వీర్యం అయ్యాయి. శత్రువు బలహీనంగా ఉన్నప్పుడే దెబ్బతీయడం రాజనీతి లక్షణంలో భాగం. ఈక్రమంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ కగార్తో నక్సల్ ముక్త్ భారత్ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం లొంగిపోయింది.
అన్నల రాజకీయ రంగప్రవేశం
లొంగిపోయిన నక్సల్స్ వారి భావజాలానికి తగ్గట్టుగా ఉద్యమాన్ని రాజకీయ రూపాంతరం చెందబోతున్నట్టుగా ప్రకటించారు. దీంతో అన్నల రాజకీయ రంగప్రవేశంపై మేధోమథనం జరుగుతున్నదని వార్తలొస్తున్నాయి. అయితే విప్లవ భావజాలంగలవాళ్లు పార్టీలు స్థాపించి.. రాజకీయాల్లోకి వస్తే లక్ష్యాలు సిద్ధిస్తాయా లేదా అనే చర్చ లేకపోలేదు. ఈ సందర్భంగా ఎప్పుడైనా పార్లమెంట్ పంథాయే ప్రధానమని బయటకొచ్చిన మాజీ మావోయిస్టు గద్దర్ 2023లో అంబేద్కర్ భావజాలం ఆధారంగా ఏర్పడిన గద్దర్ ప్రజాపార్టీ ఎలక్షన్లలో పెద్ద ప్రభావం చూపలేదు. గద్దర్ సాహిత్యం, కళలకు ఆదరణ ఉన్నా ఆయన రాజకీయ అడుగులకు అంతగా ప్రజాదరణ లేకపోవడం విశేషం. గద్దర్ లాంటి ప్రజాదరణగల నేత రాజకీయాలు అనేసరికి జనం అంతగా స్వాగతించలేదు.
ఇక మరో ఉదాహరణ దనసూరి అనసూయ అలియాస్ సీతక్క జనశక్తి నక్సల్‌గా లొంగుబాటు బాట పట్టి టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. ప్రజాసమస్యలే ఆలంబనగా నిత్యం ప్రజల్లో ఉండటంతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి రేవంత్ రెడ్డి సర్కారులో కేబినేట్ మంత్రిగా సక్సెస్ గా కొనసాగుతున్నారు. నక్సల్స్ భావజాలంగల నేతలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వివిధ హోదాల్లో దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారు. నక్సల్స్ సానుభూతిపరులుగా ముద్ర పడ్డ కొండా సురేఖ – మురళీ దంపతులు ఎంపీపీగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి మంత్రివరకూ ఎదిగారు.
ఇదే టైంలో సభ్యసాచి పాండా (ఒడిశా మాజీ మావోయిస్టు) వంటివారు 2014లో సరెండర్ అయి రాజకీయాల్లోకి వచ్చినా హింస చరిత్ర వల్ల ఆయనకు మద్దతు తగ్గింది. మాజీ మావోయిస్టు అశోక్ 2015లో సరెండర్ అయి కాంగ్రెస్‌లో చేరాడు. రామన్న, పద్మ కోడపే దంపతులు సరెండర్ అయి పునరావాసం పొందారు. తక్కెల్లపల్లి వాసుదేవరావు వంటి వారు కూడా రాజకీయ ప్రవేశం చేశారు.
రాజకీయాల్లో రాణిస్తారా?
రాజకీయ పోరాటం అంటే సాయుధ విప్లవం వదిలి, ప్రజాస్వామ్య బాటలో ఎన్నికల పద్ధతిలో సామాజిక మార్పు సాధించడం. దేశంలో ముఖ్యంగా దక్షిణ భారతం, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో రాజకీయాలు ఖర్చుతో కూడుకున్న అంశం. ఓటుకు నోటివ్వడం, కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం పరిపాటిగా మారింది. రేపు గెలిచిన తర్వాత ప్రజల ఆలోచనలనుగుణంగా వీరి పంథా ఎలా ఉంటుందోనన్న చర్చా లేకపోలేదు. అయితే దేవ్ జీ సహా మరి కొందరు ముఖ్యులు కూడా రాజకీయ అరంగేట్రం అంగీకరిస్తున్న అంశం మిగిలిన మాజీల్లో కొత్త ఆశలు తొడుగుతాయి.
రెండు దశాబ్దాల నుంచి వివిధ ముఖ్య హాదాల్లో పనిచేసి లొంగిపోయినవాళ్లలో కొందరికి రాజకీయంగా రాణించాలని ఉన్నా ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ఇమడలేక వివిధ వృత్తుల్లో కొనసాగుతున్నారు. చాలామంది జర్నలిజంలో, వ్యవసాయ రంగంతోపాటు ఇతర రంగాలను జీవనోపాధిగా ఎంచుకున్నారు. సింగరేణిలో సికాసను పుట్టించిన ఓ మాజీ ఇంకా టైలరుగా కాలం వెళ్లదీస్తున్నారు. చాలామంది చిన్న, సన్నకారు రైతులుగా బతుకులీడుస్తున్నారు. అయితే, కొత్త పార్టీ పురుడు పోసుకుంటే సీనియర్ మాజీలంతా ఒకే వేదికపైకి వచ్చే అవకాశం లేకపోలేదు.
గులాబీ గూడు చెదురుతోందా?
కష్టాల్లో ఉన్న గులాబీ పార్టీకి మావోల కొత్తపార్టీగాని, రాజకీయ తెరంగేట్రంగాని కొంత ఇబ్బందే. నక్సలైట్ల ఎజెండానే తన ఎజెండా అని రాజకీయాలు నెరిపిన కేసీఆర్ మాజీలను తెలంగాణ ఉద్యమంలో విరివిగా ఉపయోగించుకున్నారు. కానీ, వరంగల్ శృతి ఎన్ కౌంటర్ తర్వాత బోలెడు అపప్రధను మూటగట్టుకున్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ నిర్బంధాలను తట్టుకునేందుకు టీఆర్ఎస్ ఓ కవచంలా నిలిచింది.
కానీ, కేసీఆర్ పార్టీ ఉద్యమ భావజాలం వీడి ఫక్తు రాజకీయపార్టీగా రూపాతరం చెందిన అనంతరం చాలామంది పార్టీకి దూరమయ్యారు. మావోయిజం ప్రధాన మూలాలతో ఉన్న ఉత్తర తెలంగాణ ఆదివాసీలు, రైతులు, దళితులు ఒకప్పుడు టీఆర్‌ఎస్ బలమైన బేస్. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక సంఘాలు జై తెలంగాణ జెండాపట్టి కేసీఆర్ గెలుపుకు ముందున్నారు. ప్రస్తుతం ఉద్యమకారులు దూరమవ్వడం, తెలంగాణతో ఆ పార్టీ పేగుబంధం తెగిపోయింది. లెఫ్ట్ ఓరియంటెడ్ ఓటు బ్యాంక్ పేటెంట్ క్రమంగా చీలిపోతూ వస్తున్న ఫలితంగానే 2023 ఎన్నికల్లో 2 శాతం ఓట్లతో ఓడిపోయింది. ఇప్పుడా పార్టీ అధికారం కోల్పోయి సంస్థాగతంగా బలహీనంగా ఉంది.
ఇప్పటికీ మాజీలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. అలాగే పార్టీలో ఉన్న సీనియర్లు కూడా మాజీ మావోల పార్టీ పురుడుపోసుకుంటే విప్లవభావజాలంగల నేతలెవ్వరూ ఆ పార్టీలో కొనసాగడం కష్టం. అవునన్నా కాదన్నా ఉత్తర తెలంగాణలోని ప్రతీ పల్లెలో లెఫ్ట్ ఓరియంటెండ్తోనే సగటున 15 నుంచి 20 శాతం ఓటర్లుంటారు. వారంతా కేసిఆర్ పార్టీకి దూరమైతే బీఆర్ఎస్ మనుగడ కష్టమన్న వాదన లేకపోలేదు. ఇక సీపీఐ, సీపీఎం వంటి లెఫ్ట్ పార్టీలు మావోయిజాన్ని సమర్థించడం మానేశాయి. కొత్తపార్టీతో కామ్రెడ్స్ ఓటు బ్యాంక్ చీలవచ్చన్న అభిప్రాయమూ ఉంది.
లాభం ఎవరికి?
అన్నల కొత్త పార్టీ స్థాపన వల్ల బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ చీలితే ప్రధానంగా లాభం కాంగ్రెస్, బీజేపీకే. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ చెప్పుకుంటుంది. స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాపాలనతోపాటు మాజీ నక్సల్, మంత్రి సీతక్క వంటివారు ఆకర్షణగా నిలుస్తారు. నక్సల్స్ భావజాలంగల నేతలు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీతోనే మనుగడ సాధిస్తారు. ఆదివాసీ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ ఓట్లు చీలితే కాంగ్రెస్ బలపడుతుంది.
ఇక నక్సల్ ముక్త్ భారత్ వల్ల మావోయిజం తగ్గింది. కాబట్టి కొత్త పార్టీ బీఆర్‌ఎస్‌ను ఓటు బ్యాంకును తగ్గిస్తే కాంగ్రెస్ ఆయా ప్రాంతాల్లో పాగా వేయవచ్చు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన మెజార్టీ స్థానాలు గోదావరి బెల్ట్ లోనివే. ఇక బీజేపీ ఆదివాసీ ప్రాంతాల్లో డెవలప్‌మెంట్ ప్రాజెక్టులతో బలపడుతుందని ఆ పార్టీ అంచనా. అమిత్ షా మార్చి 31, 2026 నాటికి నక్సల్ ముక్త్ అని ప్రకటించడం జాతీయస్థాయిలో బీజేపీకి రాజకీయ లాభం.
కానీ, తెలంగాణ లాంటి ఏరియాల్లో కష్టం. కొత్త పార్టీ ఆదివాసీ హక్కులు, భూసంస్కరణలు వంటి అంశాలపై దృష్టిపెడితే ప్రజాస్వామ్య చర్చ పెరుగుతుంది. నేపాల్ మాదిరి.. మావోయిస్టులు రాజకీయ పార్టీగా మారి ప్రభుత్వం ఏర్పాటు చేశారన్న ఉదాహరణలిప్పుడు బలపడుతున్నాయి.
- వెంకట్ గుంటిపల్లి, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం
