మీరు లొంగిపోండి లేదా చచ్చిపోతారు.. మీరు మీ ఆయుధాలను వదిలేస్తే.. హాయిగా బతుకుతారు లేదంటే మా చేతిలో చచ్చిపోతారు.. ఈ వార్నింగ్ ఇచ్చింది ఎవరో కాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ పై యుద్ధం మొదలుపెట్టిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడాడు. ఇరాన్ పై యుద్ధానికి సంబంధించి.. తన వైఖరి ఏ రేంజ్ లో ఉందో చెబుతూ.. ఇరాన్ దేశానికి మాస్ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై దాడి గురించి స్పందించారు. ఇరాన్ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ట్రంప్ ఆ దేశంపై భారీ సైనిక చర్యకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా చేపట్టిన దాడితో ఇరాన్ పాలనను అంతం చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఇరాన్ వెంటనే లొంగిపోవాలని లేదంటే చచ్చిపోతారంటూ ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ట్రంప్ ఫైనల్ వార్నింగ్..
ఇరాన్ సైనిక దళాలకు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సభ్యులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఫైనల్ హెచ్చరిక జారీ చేశారు. మీ ఆయుధాలను తక్షణమే పక్కన పెట్టండి.. అలా చేస్తే మీకు పూర్తి రక్షణ కల్పిస్తాం అన్నారు ట్రంప్. లేదంటే ఖచ్చితంగా చావును చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. వారి స్వేచ్ఛా సమయం ఆసన్నమైందని, ఇది తరతరాల్లో లభించే ఏకైక అవకాశమని పేర్కొన్నారు. బాంబు దాడులు జరిగే ప్రమాదం ఉన్నందున ప్రజలందరూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని, ఈ దాడుల అనంతరం తమ ప్రభుత్వాన్ని తామే స్వయంగా ఏర్పాటు చేసుకోవాలని ట్రంప్ సూచించారు. గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు చేయని సాహసాన్ని తాను చేస్తున్నానని.. ఇరాన్ ప్రజల చిరకాల కోరిక తీర్చడానికి అమెరికా తన అపారమైన శక్తితో మద్దతు ఇస్తోందని ట్రంప్ ప్రకటించారు. ఈ పోస్ట్ ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
అమెరికా ప్రజలను, విదేశాల్లో ఉన్న తమ సైనిక స్థావరాలను, మిత్రదేశాలను ఇరాన్ ముప్పు నుంచి రక్షించడమే ఈ సైనిక చర్య ఉద్దేశమని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ పాలనలోని ఒక క్రూరమైన ముఠా అమెరికాకు ప్రమాదకరంగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి అరాచకాలను ఇక ఎంతమాత్రం సహించబోయేది లేదంటూ ఆయన ఘాటుగా హెచ్చరించారు.
#WATCH | US President Donald Trump says, "A short time ago, the United States military began major combat operations in Iran. Our objective is to defend the American people by eliminating imminent threats from the Iranian regime, a vicious group of very hard, terrible people. Its… pic.twitter.com/EJNaBlYWCm
— ANI (@ANI) February 28, 2026
గత 47 ఏళ్లుగా ఇరాన్ పాలకులు అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. అమాయకుల రక్తపాతానికి కారణమవుతున్నారని ట్రంప్ విమర్శించారు. 1979లో అమెరికా ఎంబసీ ఆక్రమణ, 1983లో బీరూట్ బాంబు దాడిలో 241 మంది సైనికుల మరణం, USS కోల్ నౌకపై దాడి వంటి ఘటనలను ఆయన గుర్తు చేశారు. ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద ముఠాలు ఇరాక్, సిరియా, యెమెన్, లెబనాన్ వంటి దేశాల్లో అమెరికా సైనికులను హింసిస్తున్నాయని మండిపడ్డారు.
►ALSO READ | మా సత్తా చూపిస్తాం.. మీరు ఏడవటం ఖాయం: అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్
ఇజ్రాయెల్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన అక్టోబర్ 7 దాడుల వెనుక ఇరాన్ హస్తం ఉందని ట్రంప్ ఆరోపించారు. వెయ్యి మందికి పైగా అమాయకుల హత్యకు, 46 మంది అమెరికన్ల మరణానికి.. పౌరులను బందీలుగా పట్టుకోవడానికి ఇరాన్ నిధులు అందించిన ఉగ్రవాద సంస్థలే కారణమని ట్రంప్ ధ్వజమెత్తారు. ఎన్నిసార్లు చెప్పినా ఇరాన్ తన అణ్వాయుధ తయారీ ఆలోచనల్లో మార్పు రావటం లేదని.. ఖమేనీ మళ్లీ న్యూక్లియర్ ఆయుధాల తయారీని కొనసాగిస్తున్నారంటూ ట్రంప్ ఆరోపించారు.
అంతర్జాతీయ నౌకాయాన మార్గాల్లో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తూ ఇరాన్ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తోందని ట్రంప్ అన్నారు. ఇది ఉగ్రవాదం.. దీనికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది అంటూ యుద్ధ ప్రకటన చేశారు. ఈ పరిణామంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు అమెరికా తర్వాతి అడుగుల వైపు ఉత్కంఠగా చూస్తున్నాయి.
